బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కళకళలాడిన గురుకులాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. సౌకర్యాల లేమి, విద్యార్థుల చావులతో తరచుగా వార్తలకెక్కుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికాకముందే గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ వల్ల వందల మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. యాదాద్రి జిల్లా భువనగిరి గురుకుల పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి ఆహారం వికటించి మృతిచెందడం బాధాకరం. ఇటీవల వాంకిడిలో అస్వస్థతకు గురైన ఒక బాలిక 20 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నది. అంతకుముందు పాముకాటుతో ఓ విద్యార్థి మరణించాడు. అటు విద్యార్థుల ఆత్మహత్యలూ పెరిగాయి. కాంగ్రెస్ పాలనా పగ్గాలు చేపట్టిన ఏడాదిలోపే 42 మంది విద్యార్థులు మరణించారు. ఇంత జరుగుతున్నా సర్కారులో స్పందన లేదు. బీఆర్ఎస్ నేతలు ఈ విషయమై ప్రభుత్వాన్ని నిలదీస్తే మంత్రులు తూతూమంత్రంగా ప్రకటనలు చేసి చేతులు దులుపుకొంటున్నారు.
గత పదేండ్ల కాలంలో అద్వితీయమైన అభివృద్ధిని చూసిన గురుకులాలు ప్రస్తుతం సమస్యలకు నెలవుగా మారాయి. ప్రభుత్వం మారిన తర్వాత వాటిని పట్టించుకునే నాథుడే లేడు. గురుకులాల్లో చదవడం వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటాయని ఒక అధ్యయనంలో తేలినట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన చేయడం కాంగ్రెస్ ప్రభుత్వా నికి గురుకులాల పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది. గురుకులాల విషయంలో రేవంత్ ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తం చేయడం అదే మొదటిసారి కాదు, చివరిసారీ కాదు. ఇదంతా గమనిస్తుంటే నిర్లక్ష్యంతో నిరాదరణకు గురిచేసి మెల్లమెల్లగా గురుకులాల ఉసురు తీయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నదా? విలీనం పేరిట మొత్తంగా వాటి అస్తిత్వాన్ని దెబ్బతీసి దళిత బహుజన వర్గాలకు విద్యను దూరం చేసే కుట్ర పన్నుతున్నదా? లేక కార్పొరేట్‌కు కొమ్ముకాస్తూ బహుజన బిడ్డల బడులను బలి చేస్తున్నదా? అనే అనుమానాలు రాక మానవు. గురుకుల విద్యా జేఏసీ ఆందోళన బాట పట్టినా సర్కారుకు చీమ కుట్టినట్టయినా లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
గత కేసీఆర్ ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన ఘన విజయాల్లో గురుకులాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అన్నివర్గాల పిల్లలకు మెరుగైన విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో కృషిచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లల కోసం ప్రత్యేక గురుకులాలను ఏర్పాటుచేశారు. సకల వసతులు సమకూర్చి గ్రామీణ పేద విద్యార్థులకు చక్కని విద్యనందించారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాల సంఖ్య గణనీయంగా పెరిగి 1100కు చేరిం ది. గురుకులాల్లో చదివిన పిల్లలు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పోటీ పరీక్షల్లో సత్తా చాటే స్థాయికి ఎదగడం గమనార్హం. బడుగుల విద్యా ప్రదాతగా బీఆర్ఎస్ మన్ననలు పొందింది. కానీ, కాంగ్రెస్ సర్కారు అందుకు భిన్నంగా గురుకులాలను అతలాకుతలం చేస్తున్నది. ఇది ‘ఆనవాళ్ల చెరిపివేత రాజకీయం’ అనుకోవాలా? లేక బహుజనుల అభ్యున్నతి పట్ల కాంగ్రెస్ అనాదిగా అనుసరిస్తున్న వివక్షాపూరిత విధానాలకు కొనసాగింపుగా భావించాలా? అయితే, చదువులను సకలజనులకు అందుబాటులోకి తెచ్చే గురుకుల విద్యావ్యవస్థను నాశనం చేస్తే మాత్రం చరిత్ర క్షమించదని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి.