నాన్నా పులి కథ అందరికీ తెలుసు! కానీ ఇప్పుడు అందరం నాన్నా.. వైరస్ కథ చూస్తున్నాం! ప్రపంచంలో ఏదో మూల ఏదో ఒక వైరస్ వ్యాప్తి ఎక్కువ అవగానే మరో ప్రళయం రాబోతుందనే స్థాయిలో సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నది. ముందుగా వైరస్ పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకుందాం.
వైరస్లు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆవిర్భవించాయి. ఇవన్నీ వ్యాధి కారకాలే. అవి మొక్కల్లో, జంతువుల్లో, మానవుల్లో వ్యాధులను కలిగిస్తుంటాయి. కొన్ని వైరస్లు బాక్టీరియాలపైనా దాడి చేస్తాయి. అతిథేయి లేకుండా వైరస్ ప్రత్యుత్పత్తి కొనసాగించలేదు. వైరస్‌ను నిర్జీవజీవిగా వర్ణిస్తారు. దానికి జీవుల లక్షణాలు, నిర్జీవుల లక్షణాలు రెండూ ఉంటాయి. అతిథేయి దేహంలో జీవిగా, బయట నిర్జీవిగా మనుగడ సాగిస్తుంది.
మానవులలో వైరస్ వ్యాధులు నియోలిథిక్ కాలం నుంచీ ఉన్నాయి. 12 వేల ఏండ్ల క్రితమే వైరస్లు మానవుల్లో వ్యాధిని కలిగించాయి. మనిషి పరిణామ క్రమంలో సంఘజీవిగా మారినప్పటి నుంచీ వైరస్ వ్యాధులు వ్యాప్తి చెందడం మొదలయింది. స్మాల్‌పాక్స్. మీజిల్స్ అతిప్రాచీనమైన వైరస్ వ్యాధులు. మనుషుల్లో వ్యాధి కారక వైరస్లు.. మొదట జంతువుల్లో లేదా పక్షులలో వ్యాధిని కలిగించే వైరస్లు (జునోటిక్/ ఏవియన్ వైరస్). 15వ శతాబ్దంలో ఇన్ఫ్లుయెంజా, ఫ్లూ వ్యాధులు లక్షలాదిమంది మరణాలకు కారణమయ్యాయి. ఇవే వ్యాధులు 17వ శతాబ్దంలోనూ విస్తృతంగా వ్యాప్తి చెందా యి. 18వ శతాబ్దంలో స్మాల్‌పాక్స్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా విలయానికి కారణమైంది. 19వ శతాబ్దంలో వాక్సిన్స్ కనుగొన్న తరువాత స్మాల్‌పాక్స్‌ను అరికట్టగలిగాం. పోలియో, మీజిల్స్, ముంప్స్, రుబెల్లా వంటి వాటి వ్యాప్తిని నివారించగలిగాం. కానీ, కొత్త వైరస్లు పుట్టుకొస్తూ మానవాళికి కొత్త సవాళ్లను విసురుతూనే ఉన్నాయి.
మానవ అభివృద్ధి జరిగిన కొద్దీ జీవన విధానంలో మార్పులు వస్తూ ఉన్నాయి. జనాభా పెరుగుదల, వాతావరణ మార్పులు, విస్తృత రవాణా సదుపాయాల వంటివి కొత్త వైరస్ల ఆవిర్భావం, వ్యాప్తికి కారణం అవుతున్నాయి. మానవాళి ప్రధానంగా జునోటిక్ వైరస్లు, ఇన్ఫ్లుయెంజా వైరస్లు, అర్బోరి వైరస్ల (కీటకాల నుంచి సంక్రమిస్తుంది) వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నది. 20, 21 శతాబ్దంలో ఈ వైరస్ల నుంచి అనేక ప్రమాదాలు ఎదుర్కొన్నాం. ఫ్లూను కలగజేసే ఇన్ఫ్లుయెంజాను ఉదాహరణగా తీసుకుంటే, 1899లో 2.5 లక్షల మరణాలు, 1918లో స్పానిష్ ఫ్లూగా రూపాంతరం చెంది 5 కోట్ల మరణాలు, 1950లో ఆసియన్ ఫ్లూగా 10 లక్షల మరణాలు, 2009లో స్వైన్ ఫ్లూ రూపంలో అనేక మరణాలకు కారణమైంది. అలాగే, ఎల్లో ఫీవర్ వైరస్ ప్రతి దశాబ్దంలోనూ విజృంభిస్తున్నది. 19వ శతాబ్దం మొదట్లో పుట్టుకొచ్చిన హెపటైటిస్ వైరస్ ఇప్పటికీ వ్యాధులను కలిగిస్తూనే ఉన్నది. ఇలా కొన్ని వేల సంవత్సరాలుగా వైరస్‌తో మానవుడు పోరు సలుపుతూనే ఉన్నాడు.
ప్రపంచం ప్రస్తుతం జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందే శ్వాసకోశ వ్యాధికారక వైరస్ల నుంచి పెను ప్రమాదం ఎదుర్కొంటున్నది. అతి తీవ్ర శ్వాసకోశ వ్యాధులు (సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్) మానవులకు చాలా ప్రమాదకరంగా ఉంటున్నాయి. గతంలో వచ్చిన ‘సార్స్’,‘మెర్స్’తో పాటు 2019 లో వచ్చిన కొవిడ్-19 ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసింది. కోట్లాదిమంది మృతికి కారణమైంది. ఈ వైరస్ ప్రభావం నుంచి ప్రపంచం ఇప్పుడిపుడే కోలుకుంటున్నది.
ప్రస్తుత కాలంలో ఏ కొత్త వైరస్ పేరు విన్నా మానవాళి ఆందోళనకు గురి అవుతున్నది. ఇప్పుడు చైనాలో మరో వైరస్ హ్యూమన్ మెటాన్యూమోనిక్ వైరస్ (హెచ్ఎంపీవీ) కేసులు పెరగ్గానే ప్రపంచంలో అలజడి మొదలయింది. కానీ ఇది చాలా పాత వైరస్. 2001 లోనే దీనిని డచ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రపంచంలో అనేక దేశాలలో ఈ వైరస్ సోకినప్పటికీ మరణాలు ఎక్కువగా లేవు. ఎండమిక్ గానే ఉంది. ప్రస్తుతం కూడా అదే స్థాయిలో ఉంది.
భారతదేశంలో కూడా వేర్వేరు ప్రాంతాల్లో హెచ్ఎంపీవీ వ్యాప్తిని 2008 నుంచి 2023 వరకు గమనించారు. అయితే, ఇక్కడ కూడా భారీ నష్టాన్ని ఏమీ కలిగించలేదు. ప్రధానంగా ఐదేండ్లలోపు పిల్లలు, వయోధికులు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారిలో, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, శ్వాస సంబంధ వ్యాధులు ఉన్నవారిలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువ. మిగిలిన వారిలో కేవలం జలుబు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ వైరస్ యొక్క వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ గురించి జనబాహుళ్యంలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొత్త వైరస్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. మ్యుటేషన్స్, జెనెటిక్ షిఫ్ట్, స్పీసిస్ జంప్ వల్ల ఇలా జరుగుతుంది. ప్రతీ కొత్త వైరస్ ప్రమాదభరితం కాదు. కాకపోతే, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆందోళన అసలే అవసరం లేదు. సోషల్ మీడియా పుకార్లతో ‘నాన్నా! వైరస్’ స్థితికి రావద్దు.
– డాక్టర్ అనుమాండ్ల వేణుగోపాల్‌రెడ్డి మైక్రోబయాలజిస్ట్, 99481 06198