ఆగస్టు-28, 1963: I have a Dream
వాషింగ్టన్ (డీసీ)లోని అబ్రహం లింకన్ మెమోరియల్ మెట్ల మీది నుంచి సుమారు రెండున్నర లక్షల జన సమూహాన్ని ఉద్దేశించి మార్టిన్ లూథర్ కింగ్ చేసిన ప్రసంగం అమెరికా, చరిత్రలోనే ‘అత్యుత్తమ శతాబ్ది ప్రసంగం’గా నిలిచిపోయింది. నల్లవారి బానిసత్వానికి వర్ణ వివక్షకు వ్యతిరేకంగా చట్టాలు అమల్లోకి వచ్చి అప్పటికి వందేండ్లు గడిచిపోయినా బతుకుల్లో మార్పు రాలేదని అందరి జీవితాల్లో సమానత్వం, స్వేచ్ఛ భాసిల్లాలని అభిలషిస్తూ మార్టిన్ కన్న కలల ప్రసంగమది.
ఫిబ్రవరి 5, 2023: అబ్కీ బార్ కిసాన్ సర్కార్
మహారాష్ట్రలో నాందేడ్ పట్టణంలోని గురుద్వారా మైదానంలో తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం ఇచ్చారు. అక్కడ నిరాశా నిస్పృహలతో అలవికాని కష్టాలను అనుభవిస్తున్న మట్టి మనుషులను, రైతులను ఉద్దేశించి చేసిన ఈ ప్రసంగానికి, నాడు మార్టిన్ లూథర్‌కింగ్ ‘నాకో కల ఉంది’ ప్రసంగానికి మధ్య సారూప్యం స్పష్టంగా కనపడింది.
అమెరికాలో తరతరాలుగా అణచివేయబడిన నల్లజాతి ప్రజల కోసం మార్టిన్ లూథర్‌కింగ్ గళమెత్తారు. 75 వసంతాల స్వాతంత్య్రం తర్వాత కూడా దుర్భర పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తూ ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత లభించక ఆత్మహత్యల పాలవుతున్న రైతన్నల రాజ్యం రావాలని స్వప్నిస్తూ, అలాంటి సాకారమైన స్వప్నా న్ని ఉదాహరణగా పక్క రాష్ట్రంలో చూపిస్తూ ఉద్విగ్నభరితంగా కేసీఆర్ ప్రసంగించారు.
75 ఏండ్ల స్వాతంత్య్రానంతరం కూడా సాగునీటికి, సరిపడని కరెంటుకు, తాగునీటికి నోచుకోని ‘పల్లె బతుకుల్లో ఎలాంటి గుణాత్మకమైన మార్పును తీసుకురాదలచుకున్నారో కేసీఆర్ గణాంకాలతో సహా వివరిస్తూ ఉంటే- వేదిక ముందున్న రైతులు, ప్రజానీకమే కాదు, వేదికపై ఉన్న మహారాష్ట్ర ప్రజాప్రతినిధులు మీడియా ప్రతినిధులు, మేధావి వర్గాలలో ఆలోచనలు మొదలయ్యాయి. అది ఒక రాజకీయ పార్టీ చేరికల సభగా కాకుండా కళాశాల అధ్యాపకుడు విద్యార్థులను ఉద్దేశించి పాఠం బోధిస్తున్నట్లుగా సాగింది.
ఎనిమిదేండ్లుగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలవుతున్న సంక్షేమ పథకాలు పొరుగునే ఉన్న మహారాష్ట్ర ప్రజల మీద బాగానే ప్రభావం చూపాయి. ఒకప్పటి నిజాం సంస్థానంలో భాగమైన మరఠ్వాడా కరువు పీడిత ప్రాంతం. తాగునీటికి, సాగునీటికి గోసపడ్డ వెనుకబడిన ప్రాంతం. రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇక్కడ రైతులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, ఉచిత నిరంతర కరెంటు, సాగునీటి ప్రాజెక్టుల సత్వర నిర్మాణం రైతులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. కరెంటు విషయానికి వస్తే తెలంగాణ పూర్వపు పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. నాందేడ్ పట్టణంలో కూడా రోజుకు రెండు గంటలు అధికారిక కోతలు విధిస్తున్నారు.
మహారాష్ట్రలో ప్రవహిస్తున్న నదుల పేర్లు ఒక్కొక్కటిగా కేసీఆర్ వివరించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు. దేశంలో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంటే, అందులో సుమారు 50 వేల టీఎంల నీరు వృథాగా సముద్రం పాలవుతున్నదని, మరోవైపు బీడు భూములున్నాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. 4 లక్షల 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులో ఉండగా 2 లక్షల 15 వేల మెగావాట్ల డిమాండ్‌ను కూడా చేరుకోలేదని, మనకు కరెంటు కష్టాలు ఎందుకు దాపురించాయని ప్రశ్నించారు. తెలంగాణలో రాష్ట్రం సాధించుకున్న రెండేండ్లలోనే విద్యుత్ కోతలు లేని వ్యవస్థలను తీర్చిదిద్దుకున్నామని, ఇది దేశవ్యాప్తంగా ఎందుకు సాధ్యం కాదనే మౌలికమైన ప్రశ్నను ప్రజల ముందుంచారు. తెలంగాణలో పూర్తయిన, కొనసాగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు అందుకు సజీవ నిదర్శనం.
భారత రాష్ట్ర సమితి ప్రధాన నినాదం ‘అబ్ కీ బార్- కిసాన్ సర్కార్’ మహారాష్ట్ర రైతుల గుండెను స్పృశించింది. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు గురించి ప్రస్తావించినప్పుడు చప్పట్లతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. తెలంగాణలో ‘కోయి మాయి కాలాల్ కాదమ్ నహీ కే జాకే కిసాన్ సే పూచే తుమ్హారా కిత్ నా హెచ్‌పీ మోటర్ హై’ అన్నప్పుడు రైతాంగం విశేషంగా స్పందించడం అక్కడివారు ఎదుర్కొంటున్న కరెంటు కష్టాలు తెలియజేసింది. ప్రజల ఆలోచనావిధానంలో మార్పును కాంక్షిస్తున్న కేసీఆర్ ప్రసంగం మహారాష్ట్ర ప్రజానీకంలో ప్రత్యేకించి రైతాంగంలో చర్చనీయాంశమైంది. యువ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను సభకు పరిచయం చేయడం వల్ల యువతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సందేశం వెళ్లింది. స్థానికంగా పోలీసులు, అధికారులు సభ విషయంలో చాలా అప్రమత్తంగా ఉన్నారు. సభకు విచ్చేస్తున్న జనాన్ని ఆపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారికి అసౌకర్యం కల్పించవద్దని మహారాష్ట్రలోని ప్రముఖ పత్రిక ‘దేశోన్నతి’ పత్రికా సంపాదకులు ప్రకాశ్ పోరె మైకులో పోలీసులకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ప్రజలు భయం భయంగా సభకు వస్తున్నట్లు కనిపించింది.
తెలంగాణలో అమలవుతున్న పథకాలను సభా ప్రాంగణంలో డిజిటల్ స్క్రీన్ల ద్వారా స్థానిక భాషలో మూడు డాక్యుమెంటరీలుగా ప్రదర్శించారు. కంటివెలుగు, ఆరోగ్యశ్రీ, మెడికల్ కాలేజీలు, బస్తీ దవాఖానలు, కల్యాణలక్ష్మీ పోషకాహారం, కేసీఆర్ కిట్, విద్య, వైద్యం, స్కూళ్లు, పింఛన్లు, టీఎస్ఐపాస్, టీఎస్‌బీపాస్- ఇలా ప్రతి విషయం ప్రజలకు చేరవేసే ప్రయత్నం జరిగింది. కేంద్రం పార్లమెంటరీ కమిటీకి నివేదించిన ‘విద్యుత్తు సవరణ చట్టం-2022’ అమలుకాకుండా చూడాలని కోరుతూ విద్యుత్ ఇంజినీర్లు, ఉద్యోగుల జాతీయ సమన్వయ కమిటీ పక్షాన మా బృందం కేసీఆర్‌కు వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ఆ ప్రతినిధుల బృందంలో భాగంగా అక్కడికి వెళ్లిన నాకు సభలో కనిపించిన దృశ్యమిది.
తుల్జారాంసింగ్ ఠాకూర్: 78930 05313
(వ్యాసకర్త: అధ్యక్షులు, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్, టీఎస్ఎస్పీడీసీఎల్)