పరిపాలనలో హిట్లర్ ఆదర్శమన్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రచారంలో గోబెల్స్ అంటే ప్రీతి. అబద్ధాన్ని పదేపదే వల్లె వేస్తే నిజమని అమాయక ప్రజలు నమ్ముతారని ఆయన అనుకుంటారు. కాకపోతే అప్పుడప్పుడూ పచ్చి అబద్ధాలూ ఆడేస్తారు. పాలమూరు నీటిగోస తీర్చే ప్రాజెక్టుపై తాజాగా ఆయన అవాకులు, చవాకులు మాట్లాడటం అందుకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమనాయకుడు కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టి, తెలంగాణ నీటి గోసను తీర్చేందుకు అపర భగీరథుడై ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. గోదావరిపై తెలంగాణ వరప్రదాయినిగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. దక్షిణ తెలంగాణ సాగు, తాగు నీటి కష్టాలు తీర్చేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పట్టాలెక్కించారు. కృష్ణా నదిపై శ్రీశైలం బ్యాక్ వాటర్ సోర్స్‌గా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం రూపొందించింది. 2016 జూన్ 16న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది.
ప్రాజెక్టులో ఐదు స్టేజీల ద్వారా 90 టీఎంసీల నీటిని 12.3 లక్షల ఎకరాలకు మళ్లించేందుకు రూ.27,000 కోట్లు నిధులు వెచ్చించింది. పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు నిర్మించి, 90 శాతం పనులు పూర్తి చేసింది. 27,081.95 ఎకరాలు అవసరమైతే, 26,950.97 ఎకరాలను సేకరించింది. భూసేకరణ చట్టం-2013 ప్రకారం మెరుగైన పరిహారం చెల్లించింది. కృష్ణా నది నుంచి నార్లాపూర్ వద్ద భారీ మోటర్లతో నీటిని ఎత్తిపోసేలా పనులను వేగంగా చేపట్టింది. 2023 సెప్టెంబర్ 23న కృష్ణా జలాలను ఉప్పొంగించింది. లక్షలాది మంది రైతుల కోసం తమ పంట భూములనువేలాది మంది రైతులు త్యాగం చేశారు. సహాయ, పునరావాసంలో భాగంగా నిర్మించిన కాలనీలు మినీ పట్టణాలుగా కనిపిస్తున్నాయి. ఇంత జరిగినా బీఆర్ఎస్ భూసేకరణ జరుపనే లేదని సీఎం అనటం అర్థరహితం. భూసేకరణే జరుపకుండా గాలికి వదిలేసిన ప్రాజెక్టుల్లో తాను నీళ్లు ఎలా నింపాలని అమాయకత్వం నటించడం ఆయనకే చెల్లింది.
ప్రాజెక్టులో ప్రధానమైన నార్లాపూర్-ఏదుల రిజర్వాయర్‌కు ఓపెన్ కెనాల్ కీలకమైంది. ఈ మార్గం మొత్తం రాయితో కూడి ఉంటుంది. ఇందులో బీఆర్ఎస్ ప్రభుత్వం 1.3 లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని తొలగించింది. మరో 30 వేల క్యూబిక్ మీటర్ల రాయిని తొలగిస్తే నీటిని నేరుగా కరివెన రిజర్వాయర్‌కు పంపింగ్ చేయవచ్చు. కానీ 30 నెలలుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టును పట్టించుకోలేదు. సర్కార్ అలసత్వాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని, పాదయాత్ర చేస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించటంతో పాలక పక్షం ఉలిక్కిపడింది. బీఆర్ఎస్ నేతలు ఉద్యమ కార్యాచరణకు పూనుకోవటంతో సీఎం రేవంత్ ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. ఈ నెల 5న పాలమూరు ప్రాజెక్టుల పరిశీలన పేరిట హడావుడి చేసి, భూసేకరణపై నోటికొచ్చింది మాట్లాడటం చౌకబారు రాజకీయమే. రెండున్నరేండ్లలో మిగిలిన పదిశాతం పనులు కూడా చేయలేని ముఖ్యమంత్రి అడ్డగోలు ప్రేలాపనలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. మరో 4వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉన్నదని ఆయన చెప్పుకొచ్చారు. కానీ వాస్తవానికి మరో 128.75 ఎకరాలు సేకరిస్తే సరిపోతుంది.
సమైక్య పాలనలో వలసపోయిన ప్రజలు ప్రత్యేక రాష్ట్రంలో తిరిగి పాలమూరుకు వచ్చారు. తమ పొలాలకు కాలువలతో నీళ్లు వస్తుంటే సంబురపడ్డారు. కానీ ప్రాజెక్టు పూర్తయ్యే దశలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తొమ్మిదిన్నరేండ్లపాటు అస్తిత్వంతో ఆత్మగౌరవంతో బతికిన తెలంగాణపై మళ్లీ సమైక్య కుట్రలు మొదలయ్యాయి. బనకచర్లకు ఒప్పుకొంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు చంద్రబాబు ఎన్వోసీ ఇస్తారని కేంద్రం చెప్తున్నది. అంటే తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు నుంచి ఎన్వోసీ తెచ్చుకోవాల్సిన దుస్థితిలో తెలంగాణ పాలనా వ్యవస్థ అఘోరించిందన్నమాట. తాము ఒప్పందానికి సిద్ధమని, ఇది తెలంగాణ ప్రజలకు శుభవార్త అంటూ ఇటీవల పాలమూరు పర్యటనలో రేవంత్‌రెడ్డి తలాతోక లేని మాటలు మాట్లాడారు.
ఇదంతా చూస్తుంటే ఆయన పాలమూరు ప్రాజెక్టులను పరిశీలించడానికి వెళ్లినట్టు లేదు. ఏపీ బనకచర్ల ప్రాజెక్టును పట్టాలెక్కించే బాధ్యతను భుజాలకెత్తుకుని కిందామీద పడుతున్నట్టు కనిపిస్తున్నది. రేవంత్‌రెడ్డి తన నాలుకను ఎన్ని అష్టవంకర్లు తిప్పినా ప్రజలు ఆయన మాటలను నమ్మే స్థితిలో లేరని ఆయన తెలుసుకోవాలి. కేసీఆర్ చేసిన కృషి కండ్లెదుటే ఉన్నది. చివరి దశను పూర్తి చేయకుండా రెండున్నరేండ్లు పాలమూరు ప్రాజెక్టును పడావుపెట్టి, ఇప్పుడు ఎవరికోసం ఆరాటపడుతున్నారో అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు.. తెలంగాణ ప్రజలు, మరీముఖ్యంగా పాలమూరు బిడ్డలు.