తన చరిత్రలో ఎన్నో ఉత్థాన పతనాలు చూసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం పునర్వైభవం దిశగా అడుగులు వేస్తున్నది. సాంకేతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో మెరికల్లాంటి నాయకత్వాన్ని దేశానికి, ప్రపంచానికి అందించిన ఘనత ఓయూ సొంతం. ప్రపంచంలోనే పటిష్ఠమైన, విస్తృతమైన పూర్వ విద్యార్థుల సమూహం కలిగిన అతికొద్ది విశ్వవిద్యాలయాల్లో ఓయూ ముందువరుసలో ఉంటుంది. రెండేండ్ల కిందట నేను ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చారిత్రక ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను మరింత పెంచటానికి సరికొత్త అజెండాతో ముందుకెళ్లాం.
పాలనా వ్యవస్థను గాడిలో పెట్టడం.. అకడమిక్, పరిపాలనా వ్యవస్థలను పటిష్ఠం చేయటం.. విద్య, పరిశోధనా రంగాల్లో మేటిగా నిలపటమే ధ్యేయంగా 21 పాయింట్ అజెండాతో ప్రస్థానాన్ని ప్రారంభించాం. రీఫా ర్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ పేరుతో తీసుకొచ్చిన సంస్కరణలు ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నాయి. ఫలితంగా మరో వందేండ్ల పాటు ఉస్మానియా తన కీర్తి ప్రతిష్ఠలను కొనసాగిస్తుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రగతిశీల, వాస్తవిక నిర్ణయాలతో ఓయూ సమగ్రాభివృద్ధికి రెండేండ్లలో తీసుకున్న నిర్ణయాలు అంశాలవారీగా…
ప్రగతి ప్రస్థానం: రెండేండ్లలో ఓయూలో చేపట్టిన సంస్కరణలతో.. 2022కు గాను జాతీయస్థాయి ఉత్తమ విద్యాసంస్థలు, యూనివర్సిటీల జాబితా (NIRF)లో.. 2021లో ఉన్న 32వ స్థానం నుంచి పది ర్యాంకులు మెరుగుపరుచుకొని ఓయూ 22వ స్థానాన్ని సాధించింది. ఐదు విభాగాల్లో ఆయా విద్యాసంస్థలు సాధించిన ప్రగతి ఆధారంగా ఎంహెచ్ఆర్డీ/ కేంద్ర విద్యాశాఖ కోర్ కమిటీ చేసిన అధ్యయనంలో ఓయూకు ఉత్తమ గుర్తింపు లభించింది.
WCRC లీడర్స్ ఆసియా, వరల్డ్స్ బెస్ట్ బ్రాండ్ 2022: ఈ అవార్డుకు ఓయూ ఎంపికైంది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును యూకేలోని హౌజ్ ఆఫ్ లార్డ్స్‌లో ఓయూ ఉప కులపతి, ఈ వ్యాసకర్త ప్రొఫెసర్ డి.రవీందర్ యాదవ్ అం దుకున్నారు.
ఓయూ ఇంజినీరింగ్ కళాశాల పలు విభాగాల్లో ప్రతిష్టాత్మక ISO గుర్తింపు పొందింది. అత్యుత్తమ నాణ్యత, ప్రమాణాలతో ISO 9001 సర్టిఫికెట్ సాధించింది. పర్యావరణ గ్రీన్ ఆడిట్లో ISO 14001, ఎనర్జీ ఆడిట్లో ISO 5001 ధ్రువీకరణ లభించింది. నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్న గంగా, కిన్నెర బాలికల హాస్టల్ మెస్‌లు, ఇంజినీరింగ్ కళాశాల క్యాంటీన్, యూనివర్సిటీ గెస్ట్ హౌజ్‌లకు ఫుడ్ సేఫ్టీ ISO 22000తో గుర్తించింది.
104 ఏండ్ల ఓయూ జమానాలో తొలిసారిగా ఆవిర్భావ దినోత్సవాన్ని 2022 నుంచి ఏటా ఏప్రిల్ 26న వేడుకగా నిర్వహించాలని నిర్ణయిం చాం. ‘ఉస్మానియా తక్ష్’ పేరుతో ఏటా మూడు రోజుల పండుగను ఏర్పాటుచేశాం. ఓపెన్ డే, ల్యాబ్ టు ల్యాండ్, ల్యాబ్ టు ప్రొడక్ట్ ద్వారా వర్సిటీలో జరుగుతున్న పరిశోధనలను ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ‘తక్ష్’ కార్యక్రమం ద్వారా ‘కనెక్ట్ టు రీ కనెక్ట్’ పేరుతో సమాజానికి విశ్వవిద్యాలయాన్ని చేరువ చేయ టం, పూర్వ విద్యార్థులను వర్సిటీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయటం ద్వారా ప్రస్తుత విద్యార్థులకు ఉత్సాహాన్ని నింపేందుకు కృషిచేస్తున్నాం.
ఓయూ అల్యూమినై సెల్‌ను ఏర్పాటుచేసి.. డాటా బేస్‌ను ఏర్పాటు చేయటంతో పాటు నెట్‌వర్క్‌ను చేశాం. ఎంఐటీ, స్టాన్ఫోర్డ్, ఐఐటీ, ఐఐఎంలలో ఉన్నటువంటి విధానం ఓయూలో లేకపోవటం, దానికి సంబంధించి ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రామ్‌గోపాల్ సూచించిన విధంగా ఉస్మానియా ఫౌండేషన్ సెక్షన్‌ను 8 కంపెనీ యాక్ట్ కింద రిజిష్టర్ చేసి ముందుకు సాగుతున్నాం. ఉస్మానియా అభివృద్ధి కోసం అమెరికా, యూకే, జపాన్ సహా ఆయా దేశాల్లో పర్యటించి పూర్వవిద్యార్థులను ఏకీకృతం చేశాం. వారి సహకారంతో పరిశోధన, విద్యాబోధనల్లో సంస్కరణలు చేపట్టాం. అందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో స్థిరపడ్డ ఉస్మానియన్లతో మొట్టమొదటిసారిగా 2023 జనవరి 3, 4వ తేదీల్లో ఉస్మానియా గ్లోబల్ అలుమ్ని మీట్ (జీఏఎం) ఏర్పాటుచేశాం. ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ ఏర్పాటుచేసి… కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్), అలుమ్ని, బ్రాండింగ్ కోసం ప్రత్యేకంగా సీఏబీ పేరుతో ఓ డైరెక్టరేట్‌ను ఏర్పాటుచేశాం.
కొత్త కోర్సులు- నైపుణ్యాల పెంపు – ఉపాధి మార్గాలు: నైపుణ్యాల పెంపుదల, మార్కెట్‌కు అనుకూలమైన పాఠ్యాంశాలతో కొత్త కోర్సులు అందుబాటులోకి తెచ్చాం. ఇంజినీరింగ్‌లో భాగంగా.. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, మైనింగ్, బీఏ ఆనర్స్ కోర్సులను ప్రవేశపెట్టాం. పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు అనుకూలంగా పాఠ్య ప్రణాళిక రూపొందించాం. డిగ్రీలో కామ ర్స్, సైన్స్, ఇంజినీరింగ్, మెడిసిన్ ఇలా ఏ కో ర్సు చదివినవారైనా… ఆర్ట్స్, సోషల్ సైన్సెస్‌లో పీజీ చేసే వినూత్న అవకాశాన్ని దేశంలోనే ప్రాంతీయ విశ్వవిద్యాలయాల్లో మొదటిసారిగా ఉస్మానియాలో అందుబాటులోకి తెచ్చాం.
క్లస్టర్ విధానం, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్, స్కిల్ ఎన్హాన్స్మెంట్, ప్లేస్మెంట్ సర్వీసెస్, సివిల్ సర్వీసెస్ అకాడమీ, స్టూడెంట్ డిస్కార్స్ సెంటర్ లాంటి వాటిని ఏర్పాటుచేశాం. గ్లోబల్ ఎడ్యుకేషన్ కోసం శిక్షణా కార్యక్రమాలు, అవకాశాలను పూర్తిగా వినియోగించుకునే కార్యక్రమాలను చేపట్టాం. విద్యార్థులకు అన్నిరకాల అవకాశాలు వచ్చేలా ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చాం.
పరిశోధనలకు పెద్దపీట: ఉత్తమ పరిశోధనలను ప్రముఖ జర్నల్‌లో ప్రచురితం చేసిన అధ్యాపకులను ప్రోత్సహించే ఉద్దేశంతో వైస్ ఛాన్స్లర్ పరిశోధనా అవార్డు ఏర్పాటుచేయటం బహుశా దేశంలోనే మొదటి యూనివర్సిటీ అని చెప్పటం అతిశయోక్తి కాదేమో. రెండేండ్లుగా ఐఐటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రామ్‌గోపాల్, భారత రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు డాక్టర్ సతీష్‌రెడ్డి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ బి.జె.రావు లాంటి శాస్త్రవేత్తల చేతుల మీదుగా ఉస్మానియా లో ఉత్తమ పరిశోధనలు చేస్తున్న అధ్యాపకులకు వీసీ అవార్డులు అందజేస్తున్నాం. ఇండో-పసిఫి క్ అధ్యయన కేంద్రం, అంబేద్కర్ అధ్యయన కేంద్రం, మహాత్మా జ్యోతిబా ఫూలే అధ్యయన కేంద్రం, తెలంగాణ అధ్యయన కేంద్రాలను ఏర్పాటుచేసి మరిన్ని ఉత్తమ పరిశోధనలు జరిగేలా ప్రోత్సహిస్తున్నాం. నేషనల్ సెంటర్ ఫర్ ఆడిటివ్ మాన్యుఫ్యాక్చర్ను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేశాం.
ఉస్మానియా అభివృద్ధి కోసం విద్యార్థులు అందించే ప్రతి సలహాను తీసుకుని కలసికట్టుగా ముందుకు సాగేందుకు పాలకవర్గం ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. యూనివర్సిటీ తీసుకునే నిర్ణయాల్లో విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, అధ్యాపకులు, బోధన, బోధనేతర సిబ్బంది భాగస్వాములై ఉస్మానియా పతాకాన్ని ప్రపంచ యవనికపై మరింత ఎత్తున ఎగురవేసేందుకు కలసి ముందుకు సాగాలి.
నాణ్యమైన పరిశోధనల దిశగా ఓయూ విద్యార్థి లోకాన్ని ప్రోత్సహించటం తద్వారా సమాజానికి అవసరమైన నైపుణ్యాలను అందిం చే సంకల్పంతో అవసరమైన సంస్కరణలు చేపట్టాం. ఆన్లైన్ అర్హత పరీక్షలు, అకడమిక్ మెరిట్ ఆధారంగా అర్హులైన వారికే పీహెచ్డీ ప్రవేశాలు దక్కేలా ప్రక్రియ పూర్తిచేసిన విషయా న్ని పునరుద్ఘాటిస్తున్నాం. ఓయూను పరిరక్షించేందుకు ప్రస్తుత పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు ఫలితాలు సాధిస్తున్నాయి. ఉస్మానియా విస్తృత ప్రయోజనాల దృష్ట్యా తీసుకునే నిర్ణయాల్లో ఎలాంటి ఆశ్రిత పక్షపాతానికి, భయానికి తావులేదు. ప్రతి పేద విద్యార్థికి ఉన్నత చదువులు అందాలనేది ప్రస్తుత పాలక మండలి సం కల్పం. అదే సందర్భంలో పరిశోధక విద్యార్థులకు నాణ్యమైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత కూడా విశ్వవిద్యాలయంపైనే ఉన్నది. కూర్చున్న కొమ్మనే నరుక్కోవటం సరైంది కాదు. తెలంగాణ ప్రాంత గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య, పరిశోధన అవకాశాలు కల్పించే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ప్రతి ఒక్కరం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే దశాబ్దం తర్వాత ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా కొంత ట్యూషన్ ఫీజు పెంచిన మాట వాస్త వం. ఫీజులు పెంచటంపై కొన్ని విద్యార్థి సం ఘాలు నిరసన తెలపటం పట్ల మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే దశాబ్దం తర్వాత పెంచిన ట్యూషన్ ఫీజు విద్యార్థుల పరిశోధనా అవసరాల కోసమే అనే విషయాన్ని వారు గమనించాలి. అదే సందర్భంలో ట్యూషన్ ఫీజు పెంపు వల్ల విద్యార్థులపై ఎలాంటి భారం పడదు. ప్రభుత్వమే రీయింబర్స్మెంట్ రూపం లో తిరిగి చెల్లిస్తుందనే విషయాన్ని గమనించాలి. విద్యార్థి సంఘాలైనా, విశ్వవిద్యాలయ పాలకమండలైనా వర్సిటీ భవిష్యత్తు, విద్యార్థుల శ్రేయ స్సు కోసమే పనిచేయాలి. వర్సిటీ తీసుకుంటున్న నిర్ణయాలను విద్యార్థి సంఘాలు అర్థం చేసుకుంటాయని ఆశిస్తున్నాం.
ప్రొ.దండెబోయిన రవీందర్ యాదవ్
(వ్యాసకర్త: ఉస్మానియావిశ్వవిద్యాలయం ఉపకులపతి)