ఉమ్మడి ఏపీలో కలెక్టర్‌గా, కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అడ్మినిస్ట్రేటర్‌గా, స్పోర్ట్స్ అథారిటీ కమిషనర్‌గా, హౌజింగ్‌బోర్డు మేనేజింగ్ డైరెక్టర్‌గా, సమాచార సంబంధాల కమిషనర్‌గా, దేవాదాయశాఖ కమిషనర్‌గా, విద్యాశాఖ కమిషనర్, ఏపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా, సీఎంలకు మీడియా సలహాదారునిగా పలు ప్రభుత్వ శాఖలలో ఉద్యోగం చేసి చెరగని ముద్ర వేసుకున్నారు డాక్టర్ కేవీ రమణాచారి. ప్రభుత్వ అధికారిగానే కాదు, ప్రముఖ సాహితీవేత్తగా, హైదరాబాద్‌లోని కవులు, రచయిలతో పాటు జిల్లాలోని సాహితీవేత్తలను, కళాకారులను, రచయితలను ఆదరించి మనస్ఫూర్తిగా ప్రోత్సహిస్తూ నేటి యువతరానికి చేయూతనందించిన అధికారి కేవీ రమణాచారి.
‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’ అనే నానుడి ప్రకారం కేవీ రమణ వైష్ణవశాఖలో జన్మించిన భక్తుడు. ముఖ్యంగా కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. అందుకే వీరు అలంకరించిన పదవుల అనుభవాలను మూటగట్టుకొని సప్తగిరులపై వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ అధికారిగా నాటి ప్రభుత్వం నియమించడం వలన ఆయన హృదయం పొంగిపోయింది. సంతోషం కట్టలు తెంచుకుంది. టీటీడీ చరిత్రలో కనీవినీ ఎరుగని నిర్వహణాధికారిగా, తొలి వైష్ణవుడిగా తిరుమల క్షేత్రాన్ని ‘హరే శ్రీనివాసా!’ అనుకుంటూ మెట్లు ఎక్కుతూ ఆనంద నిలయాన్ని చేరుకొని స్వామివారిని దర్శించి, నిర్వహణ బాధ్యతలు చేపట్టి ఎన్నో నూతన కార్యక్రమాలు, పథకాలు, సేవా కార్యక్రమాలు ప్రతిపాదనలు, ప్రణాళికలు తయారు చేసుకున్నారు. వాటికి పరీక్షలు పెట్టాడు ఆ శ్రీనివాసుడు. తన పరమ భక్తునికి పరిష్కారాలు కూడా స్వామియే చూపించగా, ప్రతి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.
రమణ చేపట్టిన నూతన సేవా కార్యక్రమాలన్నీ తను రచించిన ‘హరే శ్రీనివాసా!’ అనే గ్రంథంలో 22 అధ్యాయాల్లో పొందుపరిచి భక్త సమాజం, పాఠకుల ముందుంచారు. ‘అసాధ్యం’ అనుకున్న మహా కార్యక్రమాలను రెండున్నరేండ్లలో ‘సుసాధ్యం’ చేసి చూపించిన ఏకైక కార్వనిర్వాహకులు
డాక్టర్ కేవీ రమణాచారి.
నిర్వహణాధికారిగా భక్తితోపాటు నిష్ఠను, ఆచారాలను, సంప్రదాయాలను పాటిస్తూ ప్రతిక్షణం స్వామిని స్మరిస్తూ, తరిస్తూ స్వామికి ఒక విన్నపం చేశారు. అదేమిటంటే భక్తులందరూ ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఓర్చుకొని వందల, వేల కిలోమీటర్ల దూరం నుంచి బస్సులు, రైళ్లు, కార్లు, విమానాలు, కాలినడకన ఆపసోపాలు పడుతూ స్వామి దర్శనానికి వచ్చి రెండు నిమిషాల దర్శనంతో తృప్తిచెందకుండా తిరుగు ప్రయాణం చేస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన డాక్టర్ రమణ హృదయంలో ఒక మెరుపు మెరిసింది. ‘స్వామీ సర్వశక్తిమంతుడవు కదా! ధనవంతుడవు కదా! నీ భక్తుల వద్దకు నీవే వెళ్లి సంతృప్తికరమైన దర్శనమిచ్చి వారిని ఆనందపరచవచ్చు కదా! తరంపజేయవచ్చు కదా!’ అని ప్రాధేయపడ్డారు. అంతేకాదు, ‘అఖండ దీపంలా.. అఖండ హరినామ సంకీర్తనతో భక్తులు గోవిందా.. గోవిందా..’ అనే నామస్మరణతో సప్తగిరీశుని సన్నిధిలో ముక్తకంఠంతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సంకీర్తన భక్తి చైతన్య యాత్ర సుగమమైంది. రథయాత్రలు ఏర్పాటు చేయాలని 2007 డిసెంబర్ 20న ‘కృతయుగ అవతారమైన వరాహ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రమైన సింహాచలమునకు, త్రేతాయుగ అవతారమూర్తి శ్రీరామచంద్రుడు ఉన్న భద్రాచల క్షేత్రమునకు, ద్వాపర యుగ అవతారమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ వెలసిన కృష్ణా జిల్లాలోని మొవ్వ క్షేత్రానికి శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి మొదలగు స్వాముల వారి హస్తముల మీదుగా భక్తి చైతన్య యాత్రను ప్రారంభించారు. గోవిందా.. గోవిందా అనే నామస్మరణ హోరుతో మూడు రథాలు మూడు దిక్కులుగా అడుగులు వేస్తుంటే.. శ్రీనివాసా.. శ్రీనివాసా.. అంటుండగానే ఈవో రమణాచారితో సహా భక్తులందరి కళ్లవెంట ఆనందబాష్పాలు ఏరులై పారాయి.
ఈ రథములు ప్రయాణించిన ప్రాంతాల్లో ప్రజలు, భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామికి స్వాగతం పలుకుతూ, దారివెంట ముగ్గులు పరిచి, మామిడాకుల తోరణాలు, పూలమాలలు, తులసి మాలలతో స్వామిని అలంకరించుకుంటూ ‘గోవిందా.. గోవిందా..’ అంటూ, భజన చేస్తూ భక్తి పారవశ్యంలో తేలియాడారు. భక్తులు గుమ్మడికాయలు, పట్టువస్ర్తాలు, కానుకలు కోకొల్లలుగా సమర్పించి స్వామిని దర్శించుకొని ఆనందించారు. శ్రీవేంకటేశ్వరుడు వారి ఇండ్లకు వచ్చినట్లుగా భావించారు. భక్తి చైతన్య యాత్రలు విజయవంతంగా జరిపించారు.
టీటీడీ ఈవోగా కేవీ రమణచారి ఏ కార్యక్రమం చేపట్టి, సంకల్పం అనుకున్నా వెంటనే శ్రీనివాసుడు అనుగ్రహించాడు. వాటిలో భాగంగా వేద విశ్వవిద్యాలయం, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయానికి విస్తరణ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ ఉపన్యసిస్తూ డాక్టర్ కేవీ రమణచారి సేవలను సభాముఖంగా అభినందించారు. దీంతో వైఎస్ ప్రశంసాపూర్వకంగా భుజం తట్టడం తన ప్రాప్తమని, తనకు ఉత్సాహం, ఉల్లాసం కలిగిందని రమణ మనసులోని మాటను వెల్లడించారు.
డాక్టర్ రమణకు హైదరాబాద్‌కు బదిలీ అయిన రోజు వీడ్కోలు పలికేందుకు టీటీడీ వివిధ సంఘాల ఉద్యోగులు, మరోవైపు సంగీత కళాకారులు, రంగస్థల కళాకారులు, హరికథా భాగవతారులు, పండితులు, సాహితీవేత్తలు, కవులు, క్రీడాకారులు అందరూ వేర్వేరు దారులతో బయల్దేరి పూలమాలలతో, స్వీటుబాక్సులతో రైల్వేస్టేషన్‌కు వచ్చి భావోద్వేగాలతో వీడ్కోలు పలికారు. వచ్చినవారందరికీ వినమ్రంగా కృతజ్ఞతలు తెలిపి, నమస్కరించి, సెలవు తీసుకొని వెంకటాద్రి రైలు ప్రయాణాన్ని ‘హరే శ్రీనివాసా’ అంటూ సాగించారు.
– డాక్టర్ కర్నాటి లింగయ్య 83329 47239