ఐదు వేల ఏండ్ల కిందటనే జనపనారతో వస్త్రాన్ని నేయడంతో నాగరికత వెల్లివిరిసింది. ఆ తర్వాత కాలంలో నేత అనేది గొప్ప మానవ నైపుణ్యంగా అభివృద్ధి చెందింది. కాలక్రమేణా వ్యవసాయం తర్వాత అత్యధిక ప్రజలకు ఉపాధి రంగంగా మారి అది పేగు బంధమైంది. ప్రాచీన భారతదేశంలో ప్రతి గ్రామంలోనూ బువ్వ పెట్టే రైతు-నాగలి, బట్టలిచ్చే చేనేత-రాట్నం ఉండేవి. నాటి నుంచి నేటివరకు చేనేత వస్త్రాలపై ప్రజలకు మక్కువ పెరిగిందే తప్ప తగ్గలేదు. నేత కార్మికుడు వస్ర్తాలపై సృష్టించిన అద్భుతాలను, ఆవిష్కరించిన కళాఖండాలను చూసి ప్రపంచం అబ్బురపడింది. కానీ, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల చేనేత రంగం నేడు సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ పాపంలో రెండు జాతీయ పార్టీలకు సమాన వాటా ఉన్నది.
వ్యాపారం పేరిట మన దేశంలో అడుగుపెట్టిన ఈస్టిండియా కంపెనీ దేశాన్ని ఆక్రమించుకొని, దేశ సంపదను దోచుకోవడమే కాకుండా చేనేతను దెబ్బతీసింది. బ్రిటిష్ పాలకులు ముడిసరుకుల (నూలు, పట్టు, రంగులు, రసాయనాల)పై పన్నుల భారం మోపారు. తద్వారా మిల్లులో తయారైన వస్ర్తాలను దేశంలోకి తీసుకొచ్చారు. విల్లు ఎక్కుపెట్టాలంటే బొటన వేలు ఎలా అవసరమో.. చేనేత వస్త్రాన్ని తయారు చేయాలన్నా, కళాఖండాలను ఆవిష్కరించాలన్నా చేతివేళ్లు అంతే అవసరం. నాడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలును గురుదక్షిణగా తీసుకున్నట్టే.. చేనేత వస్త్రాలను తయారు చేయకుండా ఉండేందుకు గానూ బ్రిటిష్ పాలకులు నేతన్నల చేతులను నరికిన ఘటనలెన్నో స్వాతంత్య్రానికి పూర్వం జరిగాయి.
బ్రిటిష్ కాలంలో దేశ వస్ర్తాలపై ఎగుమతి సుంకాలను అధికంగా విధించడంతో పాటు ఇక్కడ లభించే పత్తి, నూలును కారుచౌకగా ఇంగ్లండ్‌కు తరలించారు. అంతేకాదు, ఆ దేశంలో మిల్లులపై తయారైన వస్ర్తాలను మన దేశంలో అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇక్కడ కూడా మిల్లులను నెలకొల్పి ఎంతగానో దోచుకున్నారు. ఇలాంటి దారుణ పరిస్థితుల నేపథ్యంలోనే స్వాతంత్య్రోద్యమంలో చేనేత ఒక ఆయుధమైంది. విదేశీ వస్త్ర బహిష్కరణకు పిలుపునిచ్చిన మహాత్మాగాంధీ వాటిని కోల్‌కతాలో తగులబెట్టారు కూడా. మన దేశానికి వ్యవసాయం, చేనేత రెండు కండ్లు అని గాంధీజీ నొక్కివక్కాణించారు. అందుకే నాటి జాతీయ జెండాలో చేనేత చరఖా స్థానం సంపాదించింది.
స్వదేశీ వస్త్ర నినాదంతో మహాత్మాగాంధీ చరఖా చేతబూని స్వయంగా నూలు వడికారు. ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులు, చేనేత అభిమానులు చరఖాతో నూలు వడికి ఆ నూలుతో నేసిన ఖాదీ వస్త్రాలను ధరించి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత దేశంలో చేనేత పరిశ్రమ విరాజిల్లింది. నేతన్నలు తమ నైపుణ్యానికి మరింత పదునుపెట్టి అద్భుతాలను ఆవిష్కరించారు. అయితే కాలక్రమంలో పాలకుల విధానాలలో మార్పులు చోటుచేసుకోవడంతో చేనేత రంగం కుదేలైంది.
1985లో అప్పటి రాజీవ్‌గాంధీ సర్కార్ ప్రవేశపెట్టిన నూతన జౌళి విధానం చేనేతను తీవ్రంగా దెబ్బతీసింది. ఉపాధికి ప్రత్యామ్నాయంగా ఉత్పాదకతకు ప్రాధాన్యాన్ని కల్పించడం, వస్త్ర ఉత్పత్తి రంగంలో చేనేత, మిల్లు రంగాలను ఒకే క్యాటగిరీగా నిర్ధారించి వస్త్ర రంగంలో అత్యంత బలహీనరంగమైన చేనేతకు అప్పటివరకు ఉన్న ప్రాధాన్యాన్ని తగ్గించారు. చేనేతకు కేటాయించిన 22 రకాల రిజర్వేషన్లపై ఉన్న స్టేను రద్దుచేసి, వస్త్ర రంగంలో బలహీనమైన చేనేతకు రిజర్వేషన్లు అవసరమని, సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ నాటి కాంగ్రెస్ పాలకులు పట్టించుకోలేదు. అంతేకాదు, అప్పటివరకు ఉన్న 22 రకాల చేనేత వస్త్రాల రిజర్వేషన్లను 11 రకాలకు తగ్గించారు.
పాలిస్టర్ వంటి సింథటిక్ వస్త్ర ఉత్పత్తికి ప్రాధాన్యాన్ని కల్పించి, అందుకు అనుగుణంగా సింథటిక్ ఫైబర్ నూలు దిగుమతులపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించారు. మన దేశంలోని పత్తి, నూలు ఎగుమతులను ప్రోత్సహించడం, మిల్లుల ఆధునికీకరణకు పెద్దపీట వేసి ఉదారంగా ఆర్థిక సహకారం అందించారు. ఈ విధానాల ఫలితంగా 1985 నాటికి వస్త్ర రంగంలో చేనేతకు గల వాటా 45 శాతం కాస్త 1991 నాటికి 20 శాతానికి పడిపోయింది. అనతికాలంలోనే చేనేత పరిశ్రమ వేగంగా క్షీణించింది. చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.
1991లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఐఎంఎఫ్ ఆదేశిత నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు మిల్లులకు గేట్లు బార్లా తెరిచాయి. పాలకులు నియంత్రణను పూర్తిగా ఎత్తివేశారు. యూనిట్ల ఏర్పాటుకు పూర్తిగా లైసెన్సు రద్దు చేశారు. చివరికి రిజిస్ట్రేషన్, రెన్యూవల్ కూడా రద్దు చేశారు. ప్రభుత్వం అనుసరించిన విపరీత విధానాల ఫలితంగా దేశంలో చేనేతకు కోలుకోలేని దెబ్బతగిలింది. నాడు కాంగ్రెస్ పాలకులు పైకి ఎన్ని మాటలు చెప్పినా ఆచరణలో మాత్రం మిల్లుల యజమానులకు కొమ్ముకాశారు.
స్వదేశీ నినాదంతో 1998లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నూతన జౌళి విధానం పునః సమీక్ష పేరిట ఎస్ఆర్ సత్యం కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చేనేత పరిశ్రమకు గొడ్డలిపెట్టు లాంటి సిఫారసులను చేసింది. చేనేతకు కావలసిన చిలపల నూలును నూలు మిల్లులు తయారు చేయవద్దని, చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలు అవసరం లేదని, చేనేత వృత్తిని మానుకోవాలని ఆ కమిటీ దారుణమైన సిఫారసులను చేసింది.
ఈ సిఫారసులు చేనేతకు మరణ శాసనమని నాడు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయడంతో బీజేపీ సర్కార్ వెనక్కి తగ్గినట్టే తగ్గి సత్యం కమిటీ సిఫారసుల పునాదిపైనే 2000లో జాతీయ జౌళి విధానం తీసుకువచ్చింది. చేనేతను చావుదెబ్బకొట్టింది. నేటి మోదీ సర్కార్ కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నది. చేనేతకు ఎంతో మేలు చేశామని, చేనేతను ఆదుకున్నామని ప్రధాని మోదీ గొప్పగా చెప్తున్నారు. జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం సంతోషమే, కానీ ఆచరణలో చేనేత వ్యతిరేక విధానాలతో చేనేతను దెబ్బతీయడం సరికాదు. చేనేత కార్మికుల కోసం ఏర్పాటు చేసిన జాతీయ చేనేత బోర్డును రద్దుచేసింది మోదీ సర్కారేన్న విషయం మరవద్దు.
అంతేకాదు, మహాత్మాగాంధీ బునకర్ బీమా యోజన, ఐసీఐసీఐ లాంబార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం, హౌస్ కమ్ వర్క్‌షెడ్ లాంటి సంక్షేమ పథకాలను కూడా రద్దు చేసి కార్మికులను సంక్షోభంలోకి నెట్టింది. చేనేత పరిశ్రమను, కార్మికులను ఆదుకోకపోగా చేనేత ముడిసరుకులైన యార్న్‌పై 5 శాతం, రంగులు, రసాయనాలపై 5-12 శాతం, చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీని విధించి పన్నుల రూపంలో దోచుకుంటున్నది. పోచంపల్లి ఇక్కత్ డిజైన్లకు పేటెంట్ ఉన్నది. జియోట్యాగ్ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ పలు మిల్లులు ఇక్కత్ డిజైన్లను ప్రింట్ చేసి మార్కెట్లో చలామణి చేస్తున్నా ప్రభుత్వం అరికట్టడం లేదు. 1985లో చేసిన 11 రకాల రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయడం లేదు.
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ పాలకులు అనుసరించిన విధానాలనే నేటి పాలకులు అనుసరిస్తున్నారు. దారుణమైన విధానాల ఫలితంగా దేశవ్యాప్తంగా చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. అనేకమంది తనువు చాలిస్తున్నారు. పాలకుల విధానాలలో మార్పు రానంత కాలం చేనేత వృద్ధి చెందదు. చేనేత దినోత్సవం పేరిట ఒక్కరోజు సంబురాలు చేస్తే కార్మికుల బతుకుల్లో మార్పు రాదు. మాటల్లో కాదు, చేతల్లో చేనేతకు చేయూతనిచ్చినప్పుడే సంబురాలకు అర్థం ఉంటుంది. పాలకుల విధానాల్లో మార్పు కోసం చేనేత కార్మికులు ప్రతినబూనాలి. ఉద్యమాలకు సిద్ధం కావాలి.
– కూరపాటి రమేష్ 94900 98048