ఏ ఫెడరల్ వ్యవస్థలోనైనా పన్నుల ఆదాయ పంపిణీ వ్యవస్థ ఎంతో కీలకం. ఇది ఆర్థిక సమతుల్యతను కల్పించడమే కాకుండా ప్రాంతాల మధ్య సమాన అభివృద్ధిని సాధించడంలో సహాయపడుతుంది. అయితే భారత్‌లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా అత్యధికంగా ఆదాయం సమకూర్చే రాష్ర్టాలకు ఎక్కువ వాటా లభించకపోవడం గమనార్హం. జీఎస్టీ ఆదాయ పంపిణీ మోడల్ రూపకల్పనలో అన్ని రాష్ర్టాల ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్కువ అభివృద్ధి చెందిన రాష్ర్టాలకు ఎక్కువ ఆర్థిక సహాయం అందించే పద్ధతిని రూపొందించారు.
జీఎస్టీ వసూలు, పంపిణీ డేటా ప్రకారం మహారాష్ట్ర ప్రతి సంవత్సరం 35 నుంచి 45 శాతం వరకు మొత్తం వసూలులో కీలకపాత్ర పోషిస్తోంది. గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, హర్యానా వంటి రాష్ర్టాలు కూడా జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్న రాష్ర్టాలుగా నిలిచాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో (జనవరి వరకు) మహారాష్ట్ర రూ.2,97,685 కోట్లను జీఎస్టీ ద్వారా సమకూర్చింది. కర్ణాటక రూ.1,31,949 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. గుజరాత్ రూ.1,13,252 కోట్లు, తమిళనాడు రూ.1,08,626 కోట్లతో వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కొన్ని రాష్ర్టాలు పారిశ్రామికాభివృద్ధి, వినియోగ స్థాయులు, జనాభా ఆధారంగా ఎక్కువ పన్నులు వసూలు చేయగలుగుతున్నా, తక్కువ అభివృద్ధి చెందిన రాష్ర్టాలకు అధికంగా నిధులు అందించడమే లక్ష్యంగా జీఎస్టీ ఆదాయ పంపిణీ విధానాన్ని రూపొందించారు. దీంతో, జాతీయ పన్ను వసూళ్లలో ఎక్కువ వాటా ఉన్న రాష్ర్టాలకు తక్కువ నిధులు అందుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ జీఎస్టీ రిటర్న్స్ రూపంలో ఎక్కువ మొత్తంలో నిధులు పొందుతున్న రాష్ర్టాల జాబితాలో ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో (జనవరి వరకు) జీఎస్టీ వసూళ్లకు రూ.93,100 కోట్లు ఇచ్చి, తిరిగి రూ.60,572 కోట్లు పొందింది. పశ్చిమబెంగాల్ రూ.55,268 కోట్లు వసూలు చేసి, రూ.35,884 కోట్లు తిరిగి పొందింది. ఈ నేపథ్యంలోనే జీఎస్టీ వ్యవస్థపై అనేక రాష్ర్టాలు విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆదాయ పంపిణీ మోడల్, పరిహార విధానం, వాటి ఆర్థిక పరిస్థితులపై దీని ప్రభావాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు తమ నిరసన గళం విప్పుతున్నారు. రాష్ర్టాలకు జీఎస్టీ పంపిణీలో అసమానత ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపించారు. రాష్ర్టాలకు పన్నుల ఆదాయంలో 50 శాతం వాటా ఇవ్వాలని కేరళ సీఎం పినరాయి విజయన్ కోరారు. జీఎస్టీ అమలైన తర్వాత పంజాబ్‌కు ఆదాయ వృద్ధిలో భారీగా కోత పడిందని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా ఆందోళన వ్యక్తంచేశారు.
– జినిత్ పర్మార్, (‘అవుట్‌లుక్’ సౌజన్యంతో)