దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాధినేతలు వర్సెస్ రాజ్యాంగాధినేతల మధ్య తలెత్తుతున్న ఘర్షణ వాతావరణం చర్చనీయాంశమవుతున్నది. కేంద్ర, రాష్ర్టాల్లో విభిన్న ప్రభుత్వాలున్నప్పుడు ఈ ఘర్షణ అనివార్యమవుతున్నది. అధికారాల విషయంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి రేగుతున్నది. కేరళ, తమిళనాడు ఇలా ఒక్కో రాష్ట్రంలో గవర్నర్ వ్యవస్థ వివాదమవుతున్నది. రాష్ర్టాలలో గవర్నర్లు, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీతో సహా కేంద్ర భూభాగాల్లో లెఫ్టినెంట్ గవర్నర్లు లేదా అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు. గవర్నర్ నామమాత్రపు అధిపతిగా వ్యవహరిస్తారు, అయితే నిజమైన అధికారం రాష్ర్టాలలో రాష్ర్టాల ముఖ్యమంత్రులు, వారి మంత్రమండలికి, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ లేదా అడ్మినిస్ట్రేటర్ వద్ద ఉంటుంది. ఢిల్లీ, పుదుచ్చేరి మినహా గవర్నర్ ఒక ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రుల మండలి సలహా ఆధారంగా పరిశీలన కొనసాగిస్తారు.
ఆర్టికల్-153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఓ గవర్నర్ ఉంటారు. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లను రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ 154 ప్రకారం రాష్ట్ర గవర్నర్‌కు కార్యనిర్వాహక అధికారం ఉంటుంది. పరోక్షంగా మంత్రి పండలి ద్వారా పరిపాలన చేయవచ్చనేది దీనర్థం.
గవర్నర్ వ్యవస్థ బ్రిటిష్ పాలన నుంచే ఉన్నది. బ్రిటిష్ చట్టాలకు అనుగుణంగా నాడు ఏర్పడిన ఈ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గవర్నర్ వ్యవస్థ వారధిలా ఉండాలనే ఉద్దేశమే దానికి కారణం. కానీ, ఈ గవర్నర్ వ్యవస్థను ఆసరా చేసుకొని కేంద్రం రాష్ట్రాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఓ బిల్లును ఆమోదించినప్పుడు స్పష్టత కోరే అధికారం గవర్నర్‌కు ఉన్నది. అయినా అమలుచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే. దేశంలోని గవర్నర్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో ఇలాంటి వివాదాలు తారస్థాయికి వెళ్లాయి. ఉదాహరణకు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య వివాదం. అసలు గవర్నర్ పదవి అనేది ఫెడరల్ వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించాల్సిన బాధ్యతాయుతమైన స్థానం. ఇక్కడ బాధాకరమైన విషయమేమంటే రాష్ర్టాల్లో ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేంద్రంలోని అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న గవర్నర్లు ప్రభుత్వ విధానాలను అడ్డుకుంటున్నారనే ఆరోపణలు అంతకంతకూ అధికమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఒక చరిత్రాత్మకమైనదిగా మిగిలింది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి వ్యవహారంపై ఇచ్చిన తీర్పులో, రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ తిరస్కరించినా, మళ్లీ అవే బిల్లులు తిరిగి రెండోసారి ఆమోదించి పంపినప్పుడు వాటిని రాష్ట్రపతికి పంపకుండా తన వద్దే ఉంచుకోవడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం చూపే అంశంగా ఉన్నదని, గవర్నర్ తన పదవి ద్వారా శాసనాధికారాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించవద్దని హెచ్చరించింది.
బిల్లులను ఆమోదించడంలో ఆలస్యం చేయకూడదని, మూడు నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. వైస్ చాన్స్లర్లు, ఇతర విద్యావ్యవస్థ సంబంధిత నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై జాప్యం చేయకూడదని ఈ తీర్పులో చెప్పింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో స్పష్టత రావడంతో పాటు, ఫెడరల్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేవిధంగా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా గవర్నర్ల వ్యవహారశైలి మారకపోతే, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉన్నది.
కేంద్రంలో ప్రభుత్వం మారిన ప్రతీసారి రాష్ర్టాల్లో తమ ఇష్టానుసారంగా గవర్నర్లను మార్చే చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు గవర్నర్ వ్యవస్థ ఇబ్బందికరంగా మారింది. అందులో భాగంగానే మోదీ ప్రభుత్వం గవర్నర్లను అడ్డుపెట్టుకొని రాష్ర్టాల హక్కుల మీద, రాజ్యాంగంలోని ఫెడరల్ సూత్రాల మీద తీవ్ర దాడి చేయడం 2014 నుంచి జరుగుతున్నది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు, అరుణాచల్‌ప్రదేశ్, గోవా, కర్ణాటక, కేరళలో ఈ దాడులను చూశాం. రాజ్యాంగం ఇచ్చిన కొన్ని విచక్షణాధికారాలను ఉపయోగించుకొని గవర్నర్లు సమాంతర అధికార కేంద్రాలుగా మారడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి, గవర్నర్ పదవి వివాదాస్పదం కాకుండా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నది. 1. రాజకీయ రంగంతో సంబంధం లేని, పాలనలో నిష్ణాతుడిని గవర్నర్‌గా నియమించాలి. 2. గవర్నర్ నియామకానికి ముందు రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ సలహాలను తీసుకోవాలి. 3. ప్రస్తుత రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండని వ్యక్తిని నియమించాలని సూచించిన సర్కారియా, పూంచీ కమిషన్ సిఫారసులను పాటించాలి. 4. గవర్నర్‌ను తొలగించడానికి మహాభియోగ తీర్మానం పద్ధతిని తీసుకురావాలి. 5. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలలో చొరబడి పెత్తనం చేయకుండా గవర్నర్‌ను సంతకాలకే పరిమితం చేయాలి.
రాష్ట్రాల్లో వర్సిటీల చాన్స్లర్లుగా గవర్నర్లు ఉంటున్నారు. ఈ అధికారం వారికి రాజ్యాంగం కల్పించింది కాదు. రాష్ట్ర శాసనసభలు, చట్టాలు కల్పించాయి. ఈ అధికారాన్ని కూడా గవర్నర్లు దుర్వినియోగం చేస్తూ బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై రాజకీయ దాడికి ఉపయోగించుకుంటున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ నిర్ణయాలను కేంద్రం చేత నామినేట్ చేయబడిన గవర్నర్ నిరాకరించడం ప్రజాస్వామ్యం మీద దాడిగానే పరిగణించాలి.
రాజ్యాంగంలోని అన్ని మౌలిక అంశాల మీద అంటే లౌకికత్వం, ప్రజాస్వామ్యం ముఖ్యంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏ మాత్రం ప్రాధాన్యం లేకుండా ఆరో వేలుగా ఉండి, అసలు ప్రజాస్వామ్యాన్నే పెను ప్రమాదంలోకి నెడుతున్న ఈ గవర్నర్ వ్యవస్థ మన దేశానికి అవసరమా? అనే కోణంలో ఆలోచించాలి.