ఇచ్చట నోటీసులు ఇవ్వబడును.. మాట్లాడితే మొత్తంగా మూసేయబడును… అవును మీరు విన్నది నిజమే. నిక్కచ్చిగా మాట్లాడినా.., నిజాలు జనాలకు తెలియజెప్పినా నిర్దాక్షిణ్యంగా మూసేస్తాం.., కాదు కూడదు అని ‘తెగిస్తాం.. జనాలకు ఇంకా ఇంకా మద్దతుగా నిలుస్తాం.. వాళ్ల కోసం అలాగే నిలబడుతాం..’ అంటే రాత్రికి రాత్రే మా బలగం వస్తుంది… నిద్రలో ఉన్న మిమ్మల్ని లేపుకుని మరీ తీసుకెళ్తుంది.. అయినా వినకుండా.. అలాగే ప్రవర్తిస్తామంటే పాత కేసులను, అందునా పసలేని వాటిని కూడా మళ్లీ ముందటేస్తాం.. మా పోలీసులకు మళ్లీమళ్లీ పనికల్పించి మిమ్మల్ని బుక్కడు బువ్వకూడా తృప్తిగా తిననివ్వం.. భార్యాపిల్లలతో కలిసి ఉండనివ్వం.. ఇది మా స్టైల్.. ఇదే మా దందా….. సంక్షిప్తంగా సర్కార్ తీరుకు మచ్చుతునక.
ఆడలేక మద్దెల ఓడో, ఆడలేక మద్దెల దరువో.. ఆడలేక పందిరి కురుచో.. ఏదో వాళ్లకు జనం కట్టబెట్టిన బాధ్యతను ప్రతిపక్షం నిర్వర్తించే పనిలో కంకణబద్దులై ఉంటే ఈ పాలకపక్షం ఉన్నదే ఏమీ పాలుపోక, ఏం చేయాలో అర్థం గాక నిలువునా కాలిపోవట్టే. చేద్దామంటే ఏం తెలియడం లేదాయె. మాకు తోచిన దందాలతో నెట్టుకొద్దామంటే ఈ ప్రతి పక్షం వారున్నారే కనీసం ఆ వాటాల్లో తలమునకలైన పరిస్థితులను కూడా నిమ్మలంగా చేసుకోనివ్వడం లేదాయె.. మరేం చేయాలనే ఆత్రుతలో ఆగమాగం కావట్టే. నిను వీడని నీడను నేనూ అన్నట్టుగా మరీ ముఖ్యంగా ఆ ప్రతిపక్షంలోని ఆ ఇద్దరు పెద్దలున్నారే.. ఈ ప్రభుత్వం పసను, పవరున్నా ఏమీ చేయలేని తుస్సును అర్థం చేసుకోరుగాకా.. చేసుకోవడం లేదాయె.. వాళ్లు నిత్యం ప్రజాక్షేత్రంలో జనాలను చైతన్యపరుస్తూ సీఎం అండ్ టీమ్‌కు కంటిమీద కునుకు లేకుండా, చిక్కుల్లో పెడుతున్న తీరు ఏమన్నా బాగుందా…!
అలాంటోళ్లను నోళ్లు మూయించాలంటే ఏం చేయాలి.. వాళ్లు చెప్పేవన్నీ నిజాలేనాయె.. జనాలకు ఇస్తున్న సమాచారమంతా నగ్నసత్యాలేనాయె. లెక్కలు పక్కాగా, జనాల మెదళ్లకు ఎక్కేలా వండివార్చి తెరపై వివరిస్తున్న వారిని చూస్తే ప్రభుత్వానికి కడుపు మండకుండా ఉండటం ఎలా! అందునా సర్కార్‌లో మాట్లాడే సత్తా ఉన్నోళ్లు ఎవరో వాళ్లకే తెలియదాయె. మరేంజేయంటారు. దీటుగా ఎదుర్కోవాలంటే సబ్జెక్ట్ కావాల్నాయె. తిప్పికొట్టాలంటే నిజాలు మాట్లాడాల్నాయె. అవే లేకపోయేసరికి అబద్ధాలను వల్లెవేస్తే, పదేపదే పలికిస్తూ అనుకూల మీడియాల్లో ఒకటికి వందసార్లు జనం మెదళ్లలో ఎక్కిస్తూ ఏదో షో చేయబోతే అలాంటివీ ఫ్లాప్ కావట్టే. అందుకే ఇక మాట్లాడితే మూసేస్త్తం.. నిలదీస్తే నోటీసులిస్తం..అదీ కాదంటే మా వోళ్లను ఉసిగొల్పి అరెస్టులతో ఉన్నవి లేనివి కల్పించి కటకటాల్లో వేసేందుకు యత్నిస్తాం అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరును జనమే అర్థం చేసుకోవాలె.
ఏదన్నా అంటే అన్నారంటారూ… అష్టదిగ్గజాల గురించి చెప్పండయ్యా బాబూ అంటే… ఈ జ్యేష్ట్య దిగ్గజాల గురించి మాట్లాడుతున్నావేంట్రా.. అనుకుంటున్నట్టుంది కదా. అవును.. ఆ దిగ్గజాలు చరిత్రలో లిఖించిబడితే.., వీళ్లేమో చరిత్రను లిఖిస్తున్నామనే భ్రమలో చరిత్రహీనంగా మారుతున్న తీరు ఇది కదా. ఇవ్వాళ నువ్వు మాట్లాడితే నిన్ను మూసేసుడే, రేపు ఇంకెవరైనా ప్రశ్నిస్తే వాళ్లను పాతాళానికి తొక్కుతాం, నాలుక చీరుతాం.. అన్నట్టుగా భయాందోళనకు గురిచేసుడే. ఇది కదా మా పాలన తీరు. చరిత్ర ఏంటి.. లిఖించడం ఏంటీ అంటే.. లేకుంటే ఏంటి సార్… వాటాలేస్తాం.. మూసేస్తాం.. మాటువేసి తేల్చేస్తాం.. లోపలేస్తాం.. ఇది ైస్టెల్. ఏదైతేనేం రాష్ట్రంలో రేవంత్ సర్కార్‌కు అన్వయించుకోవాల్సిన సందర్భమే. ప్రజాపాలన కోసం సమయం వెచ్చించాల్సిన వారు ప్రతిపక్షాలతో పరాచికాల బాపతు ఆటలతో విలువైన సమయాన్ని టైమ్ పాస్ మాదిరిగా మార్చుకున్న తీరు.. ప్రశ్నిస్తే చాలు ఎదురు దాడికి దిగడం, నిలదీస్తే నిలువునా దహిస్తామనేలా విరుచుకుపడటం, జనం కోసం పోరాడుతున్న వారిని నోటికొచ్చిన బూతులు తిట్టడం, చేయాల్సిన పనుల కంటే క్షణికావేశాలకు వెచ్చిస్తున్న తీరే బాధాకరం.
అరవై కాదు కదా.. ఆ ఆరు కూడా చెయ్యం.. ఏం చేస్తారో చేసుకోండి.. రెండేండ్లు గడిచే.. ఇంకెన్నాళ్లకు కార్యరూపం మహాశయా.. అన్నపాపానికి అస్త్రశస్ర్తాలు ప్రయోగించడం.. అన్ని పవర్స్ ఉపయోగించి అడ్డూఅదుపు లేదన్నట్టుగా చెలరేగడం కేవలం సర్కార్కే చెల్లుతున్న తీరే హాస్యాస్పదం. చరిత్రలో నిలిచిపోయేలా పాలన సాగించాల్సిన పాలకులు ఎదుటి పక్షం కోసం పోరాటం చేయడానికే వాడుకుంటూ, జనసమస్యలపై కసరత్తు చేయాల్సిన సమయాన్ని ఆ ఇద్దరు ముగ్గురిని రాచిరంపాన పెట్టడానికే అన్నట్టు సాగిస్తున్న తీరే కడు విచిత్రం. ప్రతిపక్షం అంటేనే ఊగిపోతాం, ఏమైనా చేస్తాం.. ఎంతకైనా తెగిస్తాం… అన్నట్టు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తీరు అధికార పక్షానికే చెల్లుతున్నది. పొద్దున లేవగానే పేపర్లు తిరిగేసి మధ్యాహ్నానికి ముఖానికి నవ్వు పొర అంటించుకుని, సాయంత్రమో, రాత్రో పరకాయ ప్రవేశం చేయడమే.
అదేదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు.. ‘వేల కోట్లు ఖర్చు చేసి గెలిచిన పార్టీ సర్కార్ ఏర్పాటు చేసి ఇలాంటి సిల్లీ థ్రిల్లింగ్ పనులకు శ్రీకారం చుడుతుందని ఎప్పుడైనా ఊహించామా….’ ‘ఏదో ఉద్దరిస్తుందని ఊహించిన నేతలు పీఠమెక్కి పాలనకు బదులు బలుపం ఎత్కుకపోయిండు టీచర్… అనే బాపతు ఆటలతో ఎంటర్ టైన్ చేస్తారని కలగన్నామా’ ‘గత సర్కార్ పెద్దలపై ఉన్న కోపంతో ఆలోచించకుండా ఓటేసిన పాపానికి గెలిచి నెత్తికెక్కి నాట్యం చేసే పాలకులను కళ్లముందే చూస్తామని అనుకున్నామా.’
‘స్వరాష్ట్రంలోనే పరాయి పాలనను, పరాయిలనే మోయాల్సిన దౌర్భాగ్యాన్ని అనుభవిస్తామని ఎన్నడైనా కలగన్నామా అస్సలు..’ కానీ కాంగ్రెస్ ప్రభుత్వ విధానంతో ఆ అనుభూతులన్నీ కండ్లముందే అనుభవంలోకి రావడం ఎంత అదృష్టమో కదా!
ఆవాహయామీ, ఆవాహయామీ… పొద్దంతా అదేదో తొడుక్కున తొడుగురాయుడు సాయం త్రం అయిందంటే చాలు పొరలు చీల్చుకుని, పూనకంతో విరుచుకుపడటమే. పరకాయ ప్రవే శం’ అనే అనుభూతి గురించి కథల్లో వినేవాళ్లం, పుస్తకాల్లో చదువుకునేటోళ్లం. టెక్నాలజీ నానాటికి డెవలప్ అవుతున్న ప్రస్తుత తరుణంలో దానికింకా అవకాశం లేదులే అనుకుంటున్న తరుణంలో సరిగ్గా ఇన్నాళ్లకు దానిని చూపించడానికి కొలువుదీరిన పాలకులు కండ్ల ముందు సాక్షాత్కరించడం మనం చేసుకున్న అదృష్టమే. ఉన్నమాటంటే ఉలుకెక్కువ, అనేది లోకోక్తి. అవును రాష్ట్రంలో ట్రెండ్‌కు ఇప్పుడు ఇదే ట్రేడ్‌మార్క్. రోజులు కాదు.. వారాలు కాదు.., నెలలు కాదు.. ఏకంగా రెండేండ్లుగా జరుగుతున్న తంతు అత్యద్భుతం. ఎంతసేపూ ప్రతిపక్షాన్ని వేటాడటం., ప్రజలను వెంటాడటం అనే మాదిరిగా., అడిగిన దానికి తప్ప తోచిన వాటికి జవాబులు చెప్పడం, చేయాల్సిన పనులను ఆరా తీస్తే గతాలను ఏకరువు పెట్టడం, అసలు కార్యాన్ని అటకెక్కించటం.. ఇదీ నడుస్తున్న ట్రెండ్. ఇంతకన్నా ఏం జరగాలి.., జనాలకు ఒరిగేదేముంటది..? నేడు రాష్ట్ర సర్కార్ ప్ర జలకు ప్రత్యక్షంగా విఠాలాచార్య సినిమాలు మళ్లీ చూపుతున్నది. ప్రజలకోసం పోరాడుతున్న ప్రతిపక్షానికి పూటకో నోటీసు, ఆ పార్టీ ప్రధాన లీడర్లకు రోజుకో పిలుపు ఇస్తూ…. మొగుడు కొట్టినందుకు కాద ట.. తోడి కోడలు నవ్వినందుకు బాధ అన్నట్టుంది సర్కార్ పరిస్థితి. దాగుడుమూతల దండాకోర్.. పిల్లీ వచ్చే ఎలుకా భద్రం… ఎక్కడి దొం గలు అక్కణ్నే గప్‌చుప్.. సాంబర్ బుడ్డీ.. ఆట మాదిరి రిహార్సల్ నడుస్తున్నట్టు ఉన్నదిదీ.