రుద్రంపూర్, జూలై 21 : సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలో నూతనంగా నిర్మించిన ఏరియా వర్క్‌షాప్‌లో స్వల్ప వర్షానికే నీరు నిల్వ ఉండడం ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. వెంకటేశ్ ఖని కోల్ మైన్ విస్తరణలో భాగంగా పాత జీఎం కార్యాలయం పక్కన ఉన్న ఏరియా వర్క్‌షాప్‌ను త్రీ ఇంక్లైన్ ప్రాంతానికి తరలించి నూతనంగా నిర్మించారు. ఈ వర్క్‌షాప్‌ను 2025 మే 31న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. అయితే లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ వర్క్‌షాప్‌లో స్వల్ప వర్షానికే సీసీ రోడ్లు, ప్రాంగణంలో నీరు నిలిచిపోతుండగా వర్క్ షాప్ లోని ఆఫీస్ ముందు భాగంలో చిన్న చెరువును తలపించేలా పరిస్థితి నెలకొంటోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కార్యాలయానికి వచ్చే ఉద్యోగులు నీటిలో జారిపడి సంఘటనలు కూడా జరిగాయని వారు తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, సివిల్ అధికారుల పర్యవేక్షణ లోపమే ఈ సమస్యకు కారణమని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వర్క్‌షాప్ ప్రాంగణాన్ని పరిశీలించి, ఎక్కడెక్కడ నీరు నిల్వ ఉంటుందో గుర్తించి, శాశ్వత పరిష్కారం చేపట్టాలని వారు కోరుతున్నారు.

చినుకు పడితే చెరువే… లక్షలతో నిర్మించిన వర్క్‌షాప్‌లో నీటి నిల్వలు