అవును
నీకే కావాలి
అన్నీ నీకే కావాలి
ప్రకృతి సంపద
జల సంపద ప్రతి మనిషికీ హక్కు కదా
తాను వినిపించాల్సిన జలరాగం
నీ వీణ తోటే పలికిస్తావా
తాను గ్రహించాల్సిన
జీవన సస్యాన్ని
నీ పెరట్లో మొలిపించుకుంటావా
నీ కుట్రల మీద
నేను చేసిన క్షమా సంతకం
నిర్లజ్జగా ఎన్నిసార్లు మరిచిపోయావు
నీ కుంపటి నీదైనాక
నా వాకిలిని వదిలి
మీ ఇంటికి నువ్వు చేరుకున్నాక
ఇంకా నా భాగం ఆశిస్తావా
బనకచర్ల పేరుతో నాకు రావలసిన
జలభాగం
కబళిస్తానంటావా
ఆకాశం నీ భుజం మీద అడుగు పెట్టింది
నిన్ను తనలో చేర్చుకోవడానికే
అవకాశం నీది అసలే కాదు
జల భాగస్వామికి
ద్రోహం చేసి
పిట్టల తగవు పిల్లిని తీర్చమంటావా
ద్రోహాల పొయ్యి మీద
మంట కాగి మంట కాగి
ఉన్మాద జీవులతో అంట కాగి
నువ్వు సాధించేది శూన్యం
దురాశకు కళ్లెం వేయకపోతే
గుర్రం నిన్ను కింద పడేస్తుంది.
మళ్లీ నువ్వు తొక్కుడు బండ కింద
చిక్కిపోయిన బల్లి అవుతావు
ప్రకృతిని సమానంగా పంచుకో
మానవార్తిలోని మర్మాన్ని
ఇకనైనా అర్థం చేసుకో..