కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక మొత్తం 650 పేజీలు. అంత పెద్ద నివేదిక సారాంశమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఓ 60 పేజీలను విడుదల చేసింది. కేసీఆర్ మీద బురద జల్లడమే ఆ 60 పేజీల సారాంశం. కేసీఆర్ ఇంజినీర్ల మాట వినలేదని, తుమ్మిడిహెట్టి నుంచి అకారణంగా బ్యారేజీని మేడిగడ్డకు మార్చారని, సాయిల్ టెస్టు సరిగా చేయకుండా కట్టడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని ఘోష్ కమిషన్ నివేదిక పేర్కొందని కాంగ్రెస్ నేతలు చెప్పారు. కమిషన్ తన నివేదికలో ఏం చెప్తుందనేది ఇటీవలి రాజకీయ పరిస్థితులను గమనిస్తున్న ఎవరైనా.. కమిషన్‌ను ఏర్పాటు చేసినప్పుడే ఊహించి ఉంటారు.
ఈ 60 పేజీలు నిజంగా ఆ నివేదికలోనివేనా, లేకపోతే ఆ నివేదిక పేరు చెప్పి కాంగ్రెస్ నేతలు తమ అక్కసును వెళ్లగక్కారా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే, ఆ 60 పేజీలు కమిషన్ నివేదిక లోపలి పేజీలు కావు. కాంగ్రెస్ మంత్రుల ఆదేశాలతో రెండు ప్రభుత్వ విభాగాలు సంకలనం చేసిన అంశాలవి. ఇక ఇక్కడ మరో అంశం ఏమిటంటే కమిషన్ మరీ అంత ఏకపక్షంగా, ఒక వ్యక్తి కేంద్రంగా తన రిపోర్టును సమర్పిస్తుందా?
నివేదికలోని 60 పేజీల్లోనే కేసీఆర్ పేరు 32 సార్లు, హరీశ్‌రావు పేరు 19 సార్లు, ఈటల రాజేందర్ పేరు 5 సార్లు ప్రస్తావించారు. అంటే నివేదిక సాంకేతిక అంశాల కంటే రాజకీయంగా వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చిందని అర్థమవుతున్నది. ప్రాణహిత ప్రాజెక్టు రీడిజైన్‌కు పూర్తి బాధ్యత కేసీఆరే వహించాలని నొక్కిచెప్పడం, క్యాబినెట్ అనుమతులు లేకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించడం కమిషన్ పక్షపాత వైఖరిని ప్రతిబింబిస్తున్నది. సాధారణంగా అయితే విచారణ కమిషన్ తప్పులను సాంకేతికంగా గుర్తించి, ఆధారాలతో నివేదికలో పొందుపరచాలి. కానీ, ఘోష్ కమిషన్ తన పరిధిని దాటి, రాజకీయ విమర్శలపై దృష్టి సారించింది. సాంకేతిక లోపాలను వివరించడంలో స్పష్టతను కోల్పోయింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, నీటి లీకేజీలు జరిగినట్లు నివేదిక పేర్కొంది. కానీ, ఈ లోపాలకు కచ్చితమైన సాంకేతిక కారణాలు, ఇంజినీరింగ్ విశ్లేషణలను నివేదిక సారాంశంలో వివరించలేదు.
నివేదిక పారదర్శకత కూడా విమర్శలకు గురవుతున్నది. 650 పేజీల పూర్తి నివేదికను ప్రజల ముందుంచకుండా, 60 పేజీల సారాంశాన్ని మాత్రమే విడుదల చేయడం, దానిని మీడియాకు లీక్ చేయడం వివాదాస్పదమైంది. ఈ సారాంశం కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా తయారైనట్లు విమర్శలు వస్తున్నాయి. నివేదిక పూర్తి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచకపోవడం, మీడియా ద్వారా ఎంపిక చేసిన సమాచారాన్ని లీక్ చేయడం కమిషన్ నిష్పాక్షికతపై సందేహాలను లేవనెత్తుతున్నది.
తుమ్మిడిహెట్టి వద్ద తగినంత నీటి లభ్యత లేదని సెంట్రల్ వాటర్ కమిషన్ సూచించినా కూడా అలా లేదని చెప్పడం, నివేదిక సమర్పించిన రోజే (31 జూలై 2025) మీడియా సంస్థలు దాని వివరాలను లీక్ చేయడం కమిషన్ సమాచార గోప్యతపై అనుమానాలను పెంచుతున్నది. అందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అది ఘోష్ కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్ అని విమర్శించారు. కాళేశ్వరం గొప్పతనం గురించి పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ, ధవళేశ్వరం బ్యారేజీని కట్టిన కాటన్ గురించి ఇంకా చెప్పుకుంటున్నామంటే నీటికి ఉన్న విలువ అలాంటిది. ఇప్పుడు కాళేశ్వరం అంటే గుర్తువచ్చేది కేసీఆర్. అందుకే రేవంత్ అధికారంలోకి రాగానే కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆ దిశగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాళేశ్వరం వల్ల కేసీఆర్‌కు పెరిగిన ప్రతిష్టను దెబ్బతీయడం ద్వారా రాజకీయంగా ఆయనను ఎదుర్కోవచ్చని ఓ కుటిల కుట్రకు తెరతీశారు. ఆ కుట్రలో భాగమే ఈ 60 పేజీల కక్షసాధింపు నివేదిక.
(వ్యాసకర్త: రాష్ట్ర శాసనమండలి సభ్యులు)
– శంభీపూర్ రాజు