ఆకాశంలో సగమని అందంగా చెప్పుకొనే మహిళ ఆర్థికంలో మాత్రం అధఃపాతాళంలోనే ఉండిపోయింది. వ్యవసాయ కూలీల దగ్గరి నుంచి సినిమా హీరోల దాకా మగవారిదే రాజ్యం. మగ మహారాజుల ఆదాయం ముందు మహిళలు ఎందుకూ సరిపోరన్నది జగమెరిగిన సత్యం. చారిత్రక క్రమంలో ఈ సత్యం ఎలా పాతుకుపోయిందో తన లోతైన పరిశోధనల ద్వారా వివరించినందుకు అమెరికా ఆర్థికవేత్త క్లాడియా గోల్డిన్‌కు ఈ ఏడాది ఆర్థిక నోబెల్ బహూకరించారు. ‘శ్రామికశక్తిలో మహిళలు, లింగ సమానత్వం’ అనేది ఆమె పరిశోధనాంశం. సుమారు 200 ఏండ్ల అమెరికా చరిత్రను తవ్విపోసి, సంపాదనలో మహిళ క్రమానుగత పతనాన్ని లెక్కతేల్చి చూపారు ఆమె. ఆర్థిక నోబెల్‌ను ఇప్పటిదాకా ముగ్గురంటే ముగ్గురే మహిళలు గెల్చుకోవడం గమ్మత్తయిన విషయం. మూడో విజేత అయిన గోల్డిన్ ఒంటరి విజేత గా రికార్డు సృష్టించారు. గత 55 ఏండ్లలో 93 మందికి ఈ బహుమ తినివ్వగా అందులో ముగ్గురు మాత్రమే మహిళలు. ఇదీ గోల్డిన్ అధ్య యనం చేసిన వ్యత్యాసాల వలె ఉండటం ఓ వైచిత్రి.
‘శ్రామికశక్తిలో మహిళల పాత్ర గురించి అవగాహన చేసుకోవడం సమాజానికి చాలా కీలకం’ అని బహుమతి ప్రదానోత్సవంలో నోబెల్ కమిటీ పేర్కొన్నది. శ్రామికశక్తితో పాటుగా, చట్టసభలు సహా అన్నిరంగాల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచాలనే ఆలోచనలు విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో గోల్డిన్ నోబెల్ గెలుపు ఓ మేలుమలుపు. కచ్చితమైన డాటా అందుబాటులో లేకపోవడమనేది ఆమెను వేధించింది. జనాభా లెక్కల్లో మహిళలను గృహిణులుగా ఒకేగాటన కట్టేసి, చేసే పనేమిటో, వచ్చే ఆదాయమేమిటో సూచించేవారు కాదు. ఇలాంటి సవాలక్ష సమస్యలతో పోరాడుతూ ఆమె ప్రధానంగా అమెరికా సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని పరిశోధనలు సాగించారు. ఆమె సూత్రీకరణలు పైపైన చూస్తే తెలిసినట్టే అనిపిస్తాయి. కానీ, వాటి వెనుక గల ఆర్థిక కోణాలను, చారిత్రక పరిణామాలను ఆవిష్కరించడం ఆమె ప్రత్యేకత. ఇవి భారత్‌తో సహా ఇతర దేశాలకు, రకరకాల స్థాయిలో వర్తిస్తాయని చెప్పవచ్చు. వ్యావసాయిక సమాజంలో మహిళ పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేది. పారిశ్రామిక విప్లవం రాకతో మహిళ పరిస్థితి దిగజారింది. ఇల్లు విడిచిపెట్టి ఫ్యాక్టరీకి వెళ్లాల్సి రావడమనేది సమస్యగా మారింది. మరీ ముఖ్యంగా పెండ్లయిన మహిళలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చేది. మహిళలకు విద్యావకాశాలు లభించి, సేవలరంగం విస్తరించిన తర్వాత పరిస్థితి మెరుగుపడింది.
గర్భనిరోధక సాధనాలు ప్రవేశపెట్టిన తర్వాత శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం పెరిగిందని గోల్డిన్ సోదాహరణంగా రుజువు చేయడం విశేషం. అయినప్పటికీ గర్భం ధరించడం, పిల్లలను కని పెంచడం అనేవి మహిళల్ని కెరీర్లో పైకి పోకుండా ఆపుతున్నాయి, వేతన వ్యత్యాసాలకు కారణమవుతున్నాయి. ఈ తరహా కార్యకారణ పరిశోధనలు ఇంతకుముందెవరూ చేయకపోవడం గమనార్హం. ఆధునిక యుగంలో వేతనాల్లో మహిళల పట్ల వివక్ష ఎందుకు, ఎలా కొనసాగుతున్నదో కూడా గోల్డిన్ సాధికారికంగా విశ్లేషించారు. పరదా చాటున కూర్చోబెట్టి సంగీత వాయిద్యకారులకు ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టిన తర్వాత వాయిద్య బృందాల్లో మహిళల చేరికలు పెరిగిపోయాయంటూ ఆమె ఇచ్చిన ఉదాహరణ అందరినీ ఆలోచింపజేసింది. ఇటీవలి సంవత్సరాల్లో, ముఖ్యంగా సంపన్నదేశాల్లోని యువతలో స్త్రీపురుష వేతన వివక్షలు వేగంగా తగ్గుతున్నాయనే గోల్డిన్ నిర్ధారణ ఒక ఆశావహ పరిణామం!