ఏ యుద్ధానికి నేను సిద్ధంగా లేకున్నా
ఓ ఆఖరి యుద్ధాన్నైతే ఆరంభిస్తాను
ఆ యుద్ధంలో ఏ దేశాల జాబితాలుండవు
ఏ ప్రభుత్వాల పతనాలుండవు
ఏ రక్తపు మరకలుండవు
ఏ దేశ పొలిమేర మీద పాతిన జెండాలుండవు
సరిహద్దులన్ని ఏకమైన సరళరేఖ మీద
నిరాయుధురాలినై ఓ శాంతి గీతం ఆలపిస్తూ
ఓ పావురాన్ని ఎగరేస్తూ ప్రపంచమంతా తిరుగుతాను!
సరిహద్దుల సంకెళ్ళన్నీ తెంచేసి
సమైక్యమై హృదయాలను హత్తుకోమని ప్రకటిస్తాను
ఆకాశమంత ప్రేమను స్వప్నించి
నిస్వార్థంగా నీటి మేఘమై కురిపించమంటాను
తుపాకులకూ.. తూటాలకూ.. సమాధులు కట్టి
వాటి హృదయాల మీద గులాబీ తోటలు నాటమంటాను
యుద్ధాన్ని ముద్దాడటమంటే..
మనిషిగా మరణించినట్లేనని
ప్రేమించడం ఒక్కటే
మనిషితనాన్ని నిలబెట్టగలదని
లోకానికి వినిపిస్తాను
అయినా కూడా యుద్ధం మొదలుపెడతానంటే
తప్పక నేను సంసిద్ధమవుతాను
అణుబాంబులు, తుపాకులు తునాతునకలయ్యేదాకా
యుద్ధం చేస్తూనే ఉంటాను
ఈ ‘శాంతి కోసం యుద్ధం’ అనే ఒక్క వాక్యాన్ని
బతికించడానికై నేను బతికే ఉంటాను
ఏ ఆయుధాలు నాతో లేకున్నా
ప్రేమించడానికై యుద్ధం చేయ నినదిస్తూ..
మళ్ళీ మళ్ళీ యుద్ధం చేస్తూనే ఉంటాను
యుద్ధానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తూ..
ఏ నెత్తుటి మడుగులో నీ అడుగులు కనిపించని దాకా
ఏ ఆయుధాలూ మొలకెత్తని లోకాన్ని నిర్మిస్తాను
యుద్ధాన్ని అంతం చేసి శాంతి కపోతాన్ని ఎగుర వేస్తాను..
– పి.సుష్మ
99597 05519