మండే ఎండలు గాచిన ప్రకృతి ఒక్కసారిగా చల్లబడినట్టుగానే వరంగల్ సభలో కేసీఆర్ పలకరింపుతో ఎల్కతుర్తిలో లక్షలాదిగా గుమిగూడిన జనసందోహానికి, ఆ మాటకు వస్తే మహానేత ప్రసంగాన్ని టీవీలకు అతుక్కొని విన్న కోట్లాది కుటుంబాలకు మనసును చల్లబర్చింది. ఏడాదిన్నర కాలంగా ఎగసిపడుతున్న వేదనకు అదొక లేపనంలా ఊరటనిచ్చింది. కేసీఆర్ సభల పరంపరలో అన్నిటినీ తలదన్నే సభగా ఈ సభ నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. జాతీయ స్ఫూర్తిని, ప్రాంతీయ ఆర్తిని కలగలిపిన శైలిలో కేసీఆర్ ప్రసంగం సాగడం విశేషం. ప్రారంభంలో పహల్గాం విషాదాన్ని గుర్తుచేసుకుని సభకు వచ్చినవారితో నిమిషం మౌనం పాటించడం ఆర్ద్రతను చేకూర్చింది. ఆపై ప్రసంగంలో భాగంగా ‘కగార్’ ప్రస్తావన ఓ కీలక అంశం గా నిలిచింది. ఛత్తీస్గఢ్ అడవుల్లో నక్సల్స్ ఏరివేత పేరిట కేంద్రం సాగిస్తున్న మారణహోమానికి ముగింపు పలికి వారితో చర్చలు జరపాలని సూచించడం సమయోచితమే కాదు, బాధ్యతాయుతం కూడా. నిత్యం అక్కడ నేలకొరుగుతున్నవారిలోతెలంగాణ బిడ్డలూ ఉండటంతెలిసిందే.
చర్చలు జరిపితే వారి మనసులోని మాట తెలుస్తుంది కదా అని సూచించడం ప్రజాస్వామ్యం పట్ల సడలని నిబద్ధతకు నిదర్శనం. ఈ ప్రస్తావనల తర్వాత తన ప్రసంగంలో సింహభాగాన్ని ఆయన రాష్ట్ర ప్రజలు మారిన పరిస్థితుల్లో అనుభవిస్తున్న కడగండ్ల మీదే ఎక్కువగా కేంద్రీకరించారు. ప్రజలు తన నుంచి కోరుకుంటున్న భరోసాను సూటిగా, గుండెలను తాకేలా అందించారు. తెలంగాణ అసమర్థ నాయకత్వం కింద తెర్లయిపోతుంటే రాష్ట్ర సాధకుడు, ఆపై ప్రగతి రథసారథి చూస్తూ ఎలా ఊరుకుంటారు? సంద ర్భం బీఆర్ఎస్ రజతోత్సవమే అయినా రాష్ట్రంలో కమ్ముకున్న చిమ్మచీకట్ల ప్రస్తావన తేకుండా ఎలా ఉండగలరు? అవ్వలు తాతల నుంచి అప్పుడే పసిగుడ్డు దాకా అందించిన సంక్షేమ ఫలాలు కనుమరుగవుతుంటే ఎలా అందుకే నాటికీ, నేటికీ, ఏనాటికీ కాంగ్రెసే తెలంగాణ ఏకైక శత్రువని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. నెహ్రూ, ఇందిర నుంచి వారి అంతేవాసీలదాకా ఒక్కొక్కరి దౌష్ట్యాలను చీల్చిచెండాడా రు. తొలి దశ నీరుగారిపోవడం, మలిదశ పోరు అజేయమై, అద్వితీయమై చరిత్రకెక్కడాన్ని సమర్చుకున్నారు.
అమరులను యాదిచేసుకొని నివాళులర్పించారు. గెలిచి నిలిచిన తెలంగాణను అడ్డగోలు హామీలతో ఆగమాగం చేసిన పాలకులపై నిప్పులు చెరిగారు. ప్రజల గోసను తన గుండె ఘోషగా ప్రతిధ్వనించారు కేసీఆర్. మూటలు మోసే కమీషన్ల పాలనను ఎండగట్టారు. పేద ప్రజలకు ఉపశమనాన్ని సమకూర్చే సంక్షేమఫలాలను దూరం చేసిన తూర్పారబట్టారు. ప్రజాస్వామ్యానికి కట్టుబడి ప్రభుత్వాలను పడగొట్టే పనికి పాల్పడబోమని అంటూనే ప్రజావ్యతిరేక పాలనపై పోరాడుతామని స్పష్టతనిచ్చారు. బేరసారాల దిగజారుడు రాజకీయాలకు ఇంతకన్నా చెంపపెట్టు ఏం కావాలి? ఒక్కో సభతో రాజకీయాలను ఒక్కో మలుపు కేసీఆర్ కరీంనగర్ వరంగల్ సభ.. సంగతి తెలిసిందే. ఈ సారి జరిగిన వరంగల్ సభ అన్నిరకాలుగా ప్రత్యేకమైనదే. స్వరాష్ర్టాన్ని సాధించి, పదేండ్లపాటుప్రగతిపథంలో నడిపిన తర్వాత ఏర్పడిన సంధికాలంలో సభ కేసీఆర్ ప్రస్తావించినట్టుగానే నల్గొండ సభ కృష్ణాజలాల సమస్యపై పరిమిత లక్ష్యంతో జరిగిందే. కానీ వరంగల్ సభ పూర్తిస్థాయిలోప్రజల విస్తృత భాగస్వామ్యంతో జరిగిన సమర శంఖారావ సభగా నిలుస్తుంది. తెలంగాణ గుండెచప్పుడులో కేసీఆర్ ప్రతిధ్వనిస్తున్నాడని మరోసారి చాటిన సభ ఇది. ఆయన దరిదాపుల్లోకి ఇప్పట్లో ఎవరూ చేరుకునే అవకాశం లేదని తిరుగులేకుండా ముక్తకంఠంతో ఘోషించిన సభ ఇది. ఈ సభ అక్రమ పాలకులకు ఒక హెచ్చరిక. మరో ప్రజోద్యమానికి నాందీగీతం.