ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనించినప్పుడు, దేశంలో ఫెడరలిజం ప్రస్తుత పరిస్థితీ, భవిష్యత్తూ ఏమిటనే సమీక్ష చేసుకోవలసి వస్తున్నది. ఫెడరలిజం తాత్కాలికంగా దెబ్బతినటం మాత్రమే జరుగుతున్నదా, లేక భారత దేశానికి ఇక ఫెడరలిజం అన్నదే అవసరం లేకుండా పోతున్నదా అనేది మౌలికమైన ప్రశ్న. ఈ దేశ వాస్తవ పరిస్థితుల దృష్ట్యా రాజ్యాంగ నిర్మాతలు సెమీ-ఫెడరల్ అనదగ్గ రాజ్యాంగాన్ని నిర్మించిన 75 ఏండ్ల తర్వాత అటువంటి సమీక్ష అవసరం కూడా.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 75 ఏండ్ల కాలంలో దేశ రాజకీయ వ్యవస్థ ఒకవైపు యూనిటరిస్టు శక్తులు, మరొకవైపు ఫెడరలిస్టు శక్తుల మధ్య అనేక ఘర్షణలను చూసింది. రాజ్యాంగ నిర్మాతలు తమవైపు నుంచి ఈ దేశ వైవిధ్యతలను స్వాతంత్య్రోద్యమ కాలం నుంచే గుర్తించారు. ఆ వైవిధ్యతలలో ఉపజాతులు, భాషా సంస్కృతులు, ప్రాంతీయతలు, రాజకీయం ఆర్థికం వంటివన్నీ పరిగణనలోకి వచ్చాయి. ఆర్థికం, ప్రాంతీయతలు అనే రెండింటితో కూడిన పరిగణనలోకి, మధ్యమ యుగాల్లో, అదేవిధంగా బ్రిటిష్ వలస పాలనా కాలంలో ఏర్పడిన ప్రాంతీయ అసమానతలు లెక్కలోకి వచ్చాయి. ప్రాంతీయ అసమానతలను మరొక విధంగా చెప్పాలంటే కొన్ని ప్రాంతాలు, కొన్ని వర్గాలు బాగుపడి తక్కిన ప్రాంతాలు, వర్గాలు అంతర్గత వలసలుగా మారడమన్నమాట.
భారతదేశం ఆ విధమైన చారిత్రక స్థితి నుంచి ఆధునిక ప్రజాస్వామిక దశలోకి అడుగుపెట్టడమన్నది రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశాల్లో ఒకటి. అందుకోసం అవసరమైన వాటిలో అంతర్గత వలస స్థితి పోవటం, అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి ముఖ్యమైనది. కనుక, ఒకవైపు ఈ విధమైన అవసరాన్ని, మరొకవైపు పైన పేర్కొన్న వేర్వేరు వైవిధ్యతలను దృష్టిలో ఉంచుకుంటూ, దేశ భవిష్యత్తు కోసం బలమైన రాష్ర్టాలు అనే ప్రాతిపదికను ముందుకు తెచ్చారు. ప్రాంతాల గురించిన ఆలోచన ఫెడరలిజం భావనలకు ఆధారమైంది. కేంద్రం విషయానికి వస్తే, స్వాతంత్య్రం వచ్చిన దశలో వేర్వేరు పరిస్థితులు, అవసరాలు ఉన్నాయి.
అటు బ్రిటిష్ పాలనలో ఉండిన ప్రాంతాలు, ఇటు వందలాది రాజసంస్థానాల ఏలుబడిలో గల వాటిని కలిపి రాజకీయంగా మొదటిసారిగా ఒక ఉమ్మడి దేశంగా మార్చటం ఒకటి. దేశ విభజన వల్ల కల్లోలంగా మారిన స్థితిని చక్కదిద్దటంతోపాటు భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రాకుండా తగు చర్యలన్నది రెండు. వందల ఏండ్ల ఫ్యూడలిజం, వలస పాలనలతో వెనుకబడిన ఇంత పెద్ద దేశాన్ని, 20వ శతాబ్దపు ఆధునిక ప్రపంచంలోకి తీసుకువెళ్లవలసిన అవసరం మూడు. వీటన్నింటికి అవసరమైన రాజకీయ, పరిపాలనా, వ్యవస్థలను సృష్టించటంతోపాటు ఆర్థికాది వనరులు సమకూర్చుకోవటం నాలుగు. అందుకోసం తోడ్పడగల స్వదేశీ, విదేశీ శక్తులకు ప్రోత్సాహమివ్వటం ఐదు.
పైన చెప్పిన ప్రాంతీయ పరిస్థితులు, లక్ష్యాల నుంచి ఫెడరలిస్టు భావనలు ఏర్పడగా, జాతీయ పరిస్థితులు, అవసరాల నుంచి కేంద్రీకరణ లక్ష్యాలు ముందుకొచ్చాయి. ఈ రెండూ కూడా దేశానికి అప్పటి పరిస్థితులలోనే గాక, రాగల కాలంలోనూ తప్పనిసరి అవసరాలే గనుక, రాజ్యాంగ నిర్మాతలు బలమైన కేంద్రం, బలమైన రాష్ర్టాలు అనే సమతులనతో కూడిన సూత్రీకరణను చేశారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనంతటి ఇంత మహా వైవిధ్యమైన దేశంలో కేంద్రం బలంగా ఉంటే తప్ప రాష్ర్టాలు గాని, రాష్ర్టాలు బలంగా ఉంటే తప్ప కేంద్రం గాని మనలేవు. అందుకే రాజ్యాంగం దేశ పరిపాలనాధికారాలను కేంద్ర జాబితా, రాష్ర్టాల జాబితా, ఉమ్మడి జాబితా అంటూ విభజించింది. సహకార ఫెడరలిజం అనే దృక్పథాన్ని ప్రవేశపెట్టింది.
ఈ సుదీర్ఘ నేపథ్యాన్నంతా చెప్పుకున్న తర్వాత, గత 75 ఏండ్ల కాలంలో ఆచరణలో ఏమి జరుగుతూ వచ్చింది? ఒకవైపు యూనిటరిస్టు శక్తులు, మరొకవైపు ఫెడరలిస్టు శక్తులు ఏ విధంగా రూపుతీసుకుంటూ వచ్చాయి? ఏ విధంగా వ్యవహరిస్తూ వచ్చాయి? ఎవరి బలాలు, బలహీనతలు ఏమిటి? ఎవరి సాఫల్య వైఫల్యాలేమిటి? అన్నది ఒక విధమైన చర్చ. ప్రస్తుత పరిస్థితి ఏమిటన్నది ఇంకొకటి. భవిష్యత్తు సంగతి మరొకటి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ ప్రశ్నలు అన్నింటి కన్నా ప్రధానమవుతున్నాయి. అందువల్ల వీటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిద్దాము. ముందుగా కొన్ని కీలకమైన విషయాలను చెప్పుకోవాలి.
అది తెలిస్తే తప్ప ఇంతకాలంలో యూనిటరిస్టు శక్తులు ఒకవైపు, ఫెడరలిస్టు శక్తులు మరోవైపు ఏ విధంగా రూపుదిద్దుకొని వ్యవహరిస్తూ వచ్చాయి? వాటి మధ్య సహకారం గాని, సంఘర్షణ గాని ఎట్లా సాగాయి? ఏ దశలో ఎవరి శక్తియుక్తులేమిటి? క్రమంగా ఎవరిది పైచేయి అవుతూ వచ్చింది? ఎందువల్ల? మునుముందు ఏమి జరగవచ్చును, లేదా జరగకపోవచ్చును? అనే విషయాలు బోధపడవు. ఆయా యూనిటరిస్టు, ఫెడరలిస్టు పార్టీల ప్రాబల్యాలు, జయాపజయాలు కూడా దీనిపైనే ఆధారపడి ఉంటున్నాయి, ఉంటాయి కూడా.
ముఖ్యంగా ఇండియా వంటి విస్తృతమైన, వైవిధ్యమైన దేశాల్లో యూనిటరిస్టు, లేదా జాతీయస్థాయి శక్తులకు స్వీయ ఆర్థికాభివృద్ధి, ఆర్థిక ప్రయోజనాలు, అవి నెరవేర్చుకునేందుకు రాజకీయాధికారం ప్రధానమైన ఆధారాలు, లక్ష్యాలు అవుతాయి. దానితోపాటు జాతీయతాభావన ఉపయోగకరమవుతుంది. ఇండియాలోనే కాదు, ఎక్కడైనా అంతే. ఫెడరలిస్టు శక్తులకు రెండు విధాలైన ఆధారాలుంటాయి.
ఒకటి ఆ ప్రాంతపు భౌగోళిక, చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, భాషా వైవిధ్యతలు. రెండు, ఆ ప్రాంతానికి చెందిన ఆర్థిక శక్తుల స్వీయ ప్రయోజనాలు, అభివృద్ధి. ఈ రెండింటిని కలిపి ఉపజాతీయత అంటున్నారు గనుక, ఆ ప్రాంతపు రాజకీయాధికారం అక్కడి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక శక్తుల చేతిలో ఉండాలన్నది ఫెడరలిస్టు సూత్రీకరణ. యూనిటరిస్టు, లేదా జాతీయమైనవి అనుకునే శక్తుల లక్ష్యాలు అందుకు భిన్నమే గాక, విరుద్ధమైనవి కూడా. కనుక ఈ రెండింటి మధ్య ఘర్షణస్థితి తలెత్తుతుంది.
రెండు శక్తుల మధ్య సమన్వయం అసాధ్యమేమీ కాదు. ఘర్షణకు అవకాశాలు ఉన్నాయని రాజ్యాంగ నిర్మాతలు ముందుచూపుతో గ్రహించినందు వల్లనే అధికారాలను మూడు జాబితాలుగా విభజించటంతోపాటు సహకార ఫెడరలిజం అనే దృక్పథాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఏమి జరుగుతూ పోయిందో తెలిసిన విషయమే. ప్రాంతీయ, ఆర్థిక, రాజకీయ శక్తులను కబళించటమే లక్ష్యంగా మారింది. ఇక్కడ గమనించవలసిందేమిటంటే, కేంద్రం గాని, కేంద్రాన్ని తమ నియంత్రణలో పెట్టుకునే యూనిటరిస్టు ఆర్థిక శక్తులు గాని, రాష్ర్టాలకు కలిగించే రాజకీయ నష్టాలు, పరిపాలనాధికారాల విషయంలో చేసే నష్టాలు ప్రచారంలోకి వస్తున్నాయి గాని, ఆర్థికపరమైన నష్టాలు ఎక్కువ వెల్లడి కావటంలేదు.
కేంద్రం- రాష్ర్టాల ఆర్థిక సంబంధాల్లో క్రమంగా వస్తున్న మార్పులకు ఒక ముఖ్య కారణం, జాతీయత పేరిట చలామణి అయ్యే భారీ పెట్టుబడిదారీ వర్గాలు తమ ప్రయోజనాల కోసం, ప్రాంతీయ ఆర్థిక ప్రయోజనాలను, వాటిని ఆధారం చేసుకునే ప్రాంతీయ ఆర్థిక శక్తులను దెబ్బతీస్తూ పోవటమే. ప్రాంతీయ ఆర్థిక శక్తులు గాని, ప్రాంతీయ రాజకీయ శక్తులు గాని తమకు అనుకూలంగా వ్యవహరిస్తే ఆ మేరకు వాటిని మనుగడలో ఉండనిస్తారు. అట్లా గాక, ఏ మాత్రం స్వతంత్రంగా వ్యవహరించజూసినా, ఫెడరలిజాన్ని నిలబెట్ట ప్రయత్నించినా, జాతీయ స్థాయిలో తమ చెప్పు చేతల్లో ఉండే అధికార పక్షాన్ని ఉపయోగించుకుని రకరకాల సమస్యలు సృష్టిస్తారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగింది, ఇప్పుడు బీజేపీ పాలనలో జరుగుతున్నది అదే.
రెండింటి మధ్య గల తేడా, బీజేపీ తన స్వీయాధికారానికి గాని, తనతో గల భారీ పెట్టుబడిదారుల ప్రయోజనాలకు గాని మతం, జాతీయవాదం అనే తెరలను విజయవంతంగా ఉపయోగిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ తన సుదీర్ఘ పాలనా కాలంలో అధికారం కోసం భారీ పెట్టుబడిదారుల కోసం యూనిటరిస్టు విధానాలను బాగానే అనుసరించింది. ఫెడరలిస్టు రాజ్యాంగ ఏర్పాట్లను బాగానే దెబ్బతీసింది. సహకార ఫెడరలిజాన్ని కుంటుపరచింది. ఆ స్థితికి సర్కారియా కమిషన్ అద్దం పట్టింది. కానీ ఎప్పుడైనా సమర్థమైన దుర్మార్గానికి, అసమర్థమైన దుర్మార్గానికి మధ్య తేడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ క్రమక్రమంగా తన వైఫల్యాల వల్ల అసమర్థమైన దుర్మార్గునిగా తేలింది. యూనిటరిజాన్ని శక్తిమంతం చేసి ఫెడరలిజాన్ని, ఫెడరల్ శక్తులను, చివరకు ఆ భావనలను సైతం రూపుమాపి చూడటంలో ఈ రెండు పార్టీలు ఒకదానికొకటి తీసిపోవు.
తెరవెనుక గల ఆర్థిక శక్తులు, తెరముందు గల రాజకీయ శక్తుల స్వభావం, ప్రయోజనాలు రెండింటిలోనూ మౌలికంగా ఒకటే గనుక. వాటి పేర్లు కనిపించకుండా టేపులు అతికిస్తే యూనిటరిజం, ఫెడరలిజం విషయాల్లో రెండూ ఒకటేనని ఎవరికైనా అర్థమవుతుంది. అందువల్లనే ఇరువురూ ప్రాంతీయ పార్టీలను ఒకే తరహాలో ఉపయోగించుకుంటూ, మోసగిస్తూ, బలహీన పరుస్తూ, చీల్చుతూ, కబళిస్తూ రావటం కనిపిస్తుంది.
భవిష్యత్తు ఏమిటన్నది ఫెడరల్ పార్టీలకు ఎదురయ్యే ప్రశ్న. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంగ్లీషులో బ్యాక్ టు బేసిక్స్ అనే మాట ఉన్నది. అనగా, ఈ పరీక్షా సమయంలో ఫెడరలిస్టులు పెద్ద బాలశిక్షను తిరిగి చేతిలోకి తీసుకోవటం. ఫెడరలిజానికి గల వివిధ ఆలంబనలు ఏమిటో పైన చెప్పుకున్నాము. ఫెడరలిస్టు శక్తులకు వాటి తు.చ. తప్పని అనుసరణ, పరిస్థితులను బట్టి వాటినే మరింత మెరుగుపరచుకోవటమే దుర్భేద్యమైన దుర్గం అవుతుంది. అదే సమయంలో వారు తమ లోపాలను సరిద్దుకోవటం తప్పనిసరి.
భారతదేశపు వైవిధ్యత మారేది కాదు. యూనిటరిస్టు శక్తులు రకరకాల పేర్లు, నినాదాలతో ఎంత ప్రయత్నించినా ఫెడరలిస్టు శక్తులు జనరంజక పరిపాలనలతో, ప్రజల్లో అస్తిత్వ భావనలను నిత్యనూతనం చేస్తూ సరైన వ్యూహాలు, ఆచరణలతో ముందుకు సాగినంత కాలం యూనిటరిస్టు మంగోల్ దాడులు వారి కోటలను ఏమీ చేయలేవు. ఈ జాగ్రత్తలను పాటించే శక్తులు తాత్కాలికంగా ఎదురు దెబ్బలు తిన్నా తిరిగి పుంజుకోగలవు. ఫెడరలిజం భారతదేశపు సహజ స్వభావం అయినందున.
– టంకశాల అశోక్