‘ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం’ బాగుపడవనే నానుడి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి తలకెక్కినట్టు లేదు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా యావత్ తెలంగాణ రైతాంగం ఉసురు పోసుకోవడానికే కాంగ్రెస్ సర్కార్ కంకణం కట్టుకున్నట్టుంది. సగటున రోజుకొక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. పంట కొనే నాథుడు లేక ధాన్యం కుప్పల మీదే ప్రాణాలు వదులుతున్న అభాగ్యులు.. అకాల వర్షాలకు ఆగమైపోయిన అన్నదాతలు.. ఎన్నికల హామీలతో ఎన్నో ఆశలు పెంచుకుని తుదకు హతాశులైన శ్రమజీవులు.. పోలీసుల పద ఘట్టనలతో చెల్లాచెదురవుతున్న పల్లెటూళ్లు.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ప్రజా పాలన?
కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య పచ్చని పంట పొలాలతో అలరారే గద్వాల రైతు గొంతు గర్జించింది. రాజోలి మండలం పెద్ద ధన్వాడ యుద్ధభూమిగా మారింది. నేల, గాలి, నీటిని విషతుల్యం చేసే కాలుష్యకారక ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత రైతులు కొంతకాలం నుంచి ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతూనే ఉన్నారు. పద్ధతిగా ప్రభుత్వానికి విన్నవించుకుంటూ వస్తున్నారు. అయినా వారి వేదన అరణ్య రోదనే అయ్యింది. తమ ఉనికికే ప్రమాదం పొంచి ఉన్నదన్న భయంతో, బాధతో 12 గ్రామాల రైతులు విధిలేని పరిస్థితిలో గుత్పలందుకున్నారు.
ఇథనాల్ ఒక రసాయనం. జొన్న, మక్కజొన్న ప్రధానంగా బియ్యం వంటి ధాన్యాల నుంచి ఈ రసాయనాన్ని తయారుచేస్తారు. ఇది కాలుష్యకారక పరిశ్రమ కాదని బుకాయించి ఎడాపెడా అనుమతులు, రాయితీలు ఇచ్చేశారు. కానీ, ఈ పరిశ్రమ వల్ల పరిసర పర్యావరణం తీవ్రంగా ప్రభావితమవుతుందని, వెలువడే వ్యర్థాలు, రసాయనాలు పంటలపై, మనుషులపై విషం చిమ్ముతాయన్న వాస్తవాన్ని కప్పిపుచ్చారు.
ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ముద్దాయిలే. పర్యావరణవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తల హెచ్చరికలతో ప్రభుత్వాలు ఇథనాల్ పరిశ్రమల అనుమతులను రద్దుచేస్తే ఈ ఘర్షణ తలెత్తేది కాదు.
నిన్నమొన్నటి వరకు ఆదిలాబాద్ జిల్లా దిలావర్పూర్ రైతులు అక్కడి ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేసి పాక్షిక విజయం సాధించారు. రైతులు భూమి కోసం, భుక్తి కోసమే పోరాటం చేశారు. కేసులు, అరెస్టులు, జైళ్లకు భయపడలేదు. అనుమతులు పూర్తిగా రద్దు కాలేదు కానీ, ప్రక్రియ ఆగిపోయింది. అయినా ఆ ప్రాంత ప్రజల భయాలు, అనుమానాలు ఇంకా తొలగిపోలేదు. అమాయక రైతులు, యువతపై మోపిన అభియోగాలు, కేసులు, విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం పెద్ద ధన్వాడపై విరుచుకుపడింది.
పెద్ద ధన్వాడ పొరుగున ఉన్న నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరులో ఏర్పాటైన ఇథనాల్ పరిశ్రమ వల్ల అక్కడి ప్రజలు నానా యాతనలు అనుభవించారు. అక్కడి ప్రజల జీవనాధారమైన మన్నేవాగు కాలుష్యమయమైపోయింది. ఆ నీరంతా రామన్‌పాడు ద్వారా కృష్ణాలోకి చేరడం వల్ల ఆ పరీవాహక ప్రాంతాలన్నీ కాలుష్యమయమయ్యాయి. ప్రజలు రకరకాల వ్యాధుల పాలుకాగా ఆందోళనలు కొనసాగాయి.పెద్ద ధన్వాడ ప్రజలు చిత్తనూరు దుస్థితి స్వయంగా చూశారు. వివిధ జిల్లాల్లో ఇదేవిధంగా ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటును ఎక్కడికక్కడ రైతులు, పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు అడ్డుకుంటున్నారు. ఆ చైతన్యం పల్లె పల్లెకూ చేరిపోతున్నది.
ఇథనాల్ వ్యతిరేక ఉద్యమాలను రకరకాల మాయమాటలు, ప్రలోభాలు, బెదిరింపులతో అదుపు చేయాలని ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం విఫలయత్నం చేస్తున్నది. ఓ సందర్భంలో దిలావర్పూర్ ఉద్యమకారులతో ఓ ప్రతినిధి బృందం పెద్ద ధన్వాడకు సంఘీభావ సందర్శనకు వస్తే అక్కడి అధికారులు అటునుంచి అటే వెనక్కి పంపించారు.
ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ లగచర్ల రైతులు, గోశాల కోసం తమ భూములు లాక్కోవద్దంటూ ఎనికేపల్లి రైతులు, ఇలా రాష్ట్రవ్యాప్తంగా రకరకాల కారణాలతో భూములు కోల్పోతున్న రైతులు వీధుల్లోకి వస్తే ప్రభుత్వం లాఠీలకు పనిచెప్తున్నది. ఉద్యమకారులతో స్థానిక ఉద్యోగులు గొంతు కలిపితే ‘మీకేం సంబంధం’ అంటూ దబాయిస్తున్న ప్రభుత్వం అక్కడి గాలి, నీరు, పంటలు వారూ వినియోగిస్తారని, వారు కూడా బాధితులేనన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నది. అక్రమ కేసులు మోపి నిర్బంధం అమలుచేస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయా ప్రాంతాలకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం నాడు బాధిత రైతులతో గొంతు కలిపినవారే.
కానీ, వారే నేడు ఎమ్మెల్యేలుగా గెలిచి గద్దెనెక్కి ముఖం చాటేస్తున్నారు. మంత్రులూ అంతే. ఢిల్లీ ప్రయాణాలు, పక్క రాష్ర్టాల ఎన్నికల ప్రచారాలకు సమయాన్ని కేటాయించే మంత్రులు, ముఖ్యమంత్రికి రైతులు ఉద్యమిస్తున్న ప్రాంతాలను సందర్శించి బాధితుల కష్టనష్టాలు తెలుసుకునే తీరిక లేకపోవడం శోచనీయం. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అటకెక్కాయి. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానన్న ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మంచి పథకాలకు మంగళం పాడేసింది.
కాళేశ్వరాన్ని ఎండబెట్టింది. రైతు భరోసా కొందరికే ఇచ్చి చేతులు దులుపుకొన్న ప్రభుత్వం రైతు బీమాకు ఎగనామం పెట్టింది. ధాన్యం కొనుగోళ్లు లేవు. పంట నష్టం పరిహారం లేదు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అతీగతీ లేదు. పదేండ్ల తర్వాత మళ్లీ ఎరువులు, విత్తనాల కోసం చెప్పుల క్యూలు కనిపిస్తున్నాయి. సమాజాన్ని బతికించే రైతన్న బతుకు పోరాటం చేయడం బాధాకరం. అయినా కిందవడి, మీదవడి వ్యవసాయం చేసుకుంటున్న రైతుల పంట భూములను గుంజుకుంటామంటే వారు ఊరుకుంటారా, తిరగబడరూ. అది చారిత్రక సత్యం.
-అయాచితం శ్రీధర్