కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతన్నలకు ఆనాటి చీకటి రోజులు మళ్లీ వచ్చాయి. స్వరాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో పచ్చబడ్డ పల్లెలు, నేడు మళ్లీ సంక్షోభంలోకి వెళ్తున్నాయి. ఈ పరిణామాలు అన్నదాతను ఆలోచింపజేస్తున్నాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులంతా ఒక్కటై ఓరుగల్లు వేదికగా సదస్సు పెట్టుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు మొదలై ఆగమాగమైపోతున్నది. రైతు ల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంటే, మరోవైపు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డుకోవాలని కాంగ్రెస్ చూస్తున్నది. గులాబీ జెండా ఎగిరితే చాలు.. కాంగ్రెస్ సర్కార్ గుండెల్లో గుబులు కలుగుతున్నది.
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ అంటేనే రైతుల ఆత్మహత్యలకు, బొంబాయి, దుబాయి వలసలకు చిరునామాగా మారింది. ప్రాజెక్టులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక పరిష్కారంగా నిలిచింది. కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ హయాంలో 14 ఏళ్లపాటు సాగిన ఉద్యమం ఫలితంగా స్వరాష్ట్ర కల సాకారమైంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ స్థిరీకరణ బాధ్యతను భుజాలపై ఎత్తుకున్నారు. మిషన్ కాకతీయ ఒక ప్రజా ఉద్యమంలా సాగింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ఊపందుకున్నది. రైతుల వ్యవసాయ మోటర్లకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరాతో రైతుల కండ్లల్లో వెలుగులు నిండాయి. ధాన్యం ఉత్పత్తి ఐదింతలు పెరిగి, 3 కోట్ల టన్నులకు చేరింది.
రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది, రైతుబీమా పథకం కొండంత ధీమానిచ్చింది. ఊరూరా పంట కొనుగోళ్లు జరిగి, రైతుబంధు పైసలు, పంట అమ్మిన పైసలు రెండూ సకాలంలో వచ్చి రైతుల ఆత్మవిశ్వాసం పెరిగింది. కానీ, అంతలోనే అంతా మళ్లీ ఆగమైంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్న కంట మళ్లీ కన్నీరు ఆగడం లేదు. తొమ్మిదిన్నరేండ్లపాటు సాఫీగా సాగిన 24 గంటల కరెంటు ఇప్పుడు ఆగమైంది. మళ్లీ మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. ఏ ఒక్క ప్రాజెక్టులో తట్టెడు మట్టి ఎత్తిపోయకపోవడంతో, ప్రాజెక్టులన్నీ పడావు పడిపోయాయి. ఇసుక మాఫియా దొంగలు చెక్‌డ్యామ్‌లను పేల్చివేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు.
మరోవైపు యూరియా దొరకక రైతులు నానా యాతనలు పడుతున్నారు. షాపుల్లో లేని యూరియాను యాపుల్లో ఉంటదని ఊరిస్తున్నారు. రైతుబంధును 15 వేలకు పెంచుతామని మోసం చేసిన కాంగ్రెస్, ఉన్న రైతుబంధును కూడా రెండు సార్లు ఎగవేసి, మూడోసారి కేవలం ఎకరానికే పరిమితం చేసింది. ఒకప్పుడు కాలర్ ఎగరేసిన రైతు మళ్లీ అధికారుల కాళ్లు మొక్కే దీనస్థితి వచ్చింది. తెలంగాణ రైతు మళ్లీ కష్టాల సుడిగుండంలో పడి కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ దుస్థితి నుంచి మళ్లీ గట్టెక్కాలంటే రైతన్న ఐక్యంగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. వ్యవసాయరంగ బాగు కోసం ఈ దుర్మార్గ పాలకులపై పోరాటాలు చేయాల్సిన బాధ్యతను గుర్తెరిగిన రైతాంగం.. బీఆర్ఎస్ నేతృత్వంలో రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నది. తెలంగాణ రైతుల గర్జనతో వరంగల్ గడ్డ మీద అన్నదాతలు ఎగురవేసే కేతనంతో.. కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ప్రారంభమైనట్లేనని స్పష్టమవుతున్నది.
(వ్యాసకర్త: శాసనమండలి సభ్యుడు)
– తక్కెళ్లపల్లి రవీందర్ రావు