సాంకేతికతతో పోటీపడుతూ ప్రపంచం ముందుకు దూసుకెళ్తున్నది. సమాచారం పంచుకునే పద్ధతులు, వార్తలు తెలుసుకునే మార్గాలు విప్లవాత్మకంగా మారాయి. గతంలో వార్తా పత్రికలు, రేడియో, టెలివిజన్ వంటి మాధ్యమాల ద్వారా వార్తలు పొందేవాళ్లం. వాటికి ఒక నిర్దిష్ట విధానం, బాధ్యత కలిగిన సంపాదకులు ఉండేవారు. అయితే, సోషల్ మీడియా రాకతో ప్రతి ఒక్కరూ వార్తా ప్రసారకులుగా మారారు. ఎవరికి తోచింది వారు రాస్తున్నారు, ఎవరికి నచ్చింది వాళ్లు నమ్ముతున్నారు.
నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ప్రపంచమంతా తిరిగి వస్తుందని అంటారు. అదిప్పుడు నిజమైంది. ఫేక్ న్యూస్ వేగంగా వ్యాపిస్తున్నది. ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు సమాచారాన్ని ప్రజలకు అత్యంత వేగంగా చేరవేస్తున్నాయి. కానీ, వాటిలో ఎంతమేరకు నిజం ఉందో చెప్పడం చాలా కష్టం. సామాన్య ప్రజలు తమకు తెలియకుండానే ఈ సమాచార ప్రవాహంలో చిక్కుకొని, ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోలేకపోతున్నారు. ఒకరికి నచ్చిన కథను మరొకరు పంచుకుంటారు, అది వందలమందికి చేరుతున్నది. అందులో ఉన్న వాస్తవాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు. ముఖ్యంగా ఆరోగ్య సమాచారం, రాజకీయ విశ్లేషణలు, ఆర్థిక అంశాలు, కులం, మతం లాంటి భావోద్వేగ అంశాల్లో అసత్య ప్రచారం బాగా పెరిగింది.
ఇది కొత్త సమస్య కాదు. మన పురాణాలు, ఇతిహాసాల్లోని ఒకే సంఘటనను విభిన్న కోణాల్లో వివరిస్తారు. ఇటీవలే విడుదలైన సినిమా గురించి సోషల్ మీడియాలో తమకు తోచిన విధంగా కథనాలు సృష్టిస్తున్నారు. ‘ఛత్రపతి శివాజీ గొప్ప వీరుడు, శూరుడు’ అని ఒక వర్గం వాదిస్తే, ‘ఔరంగజేబు గొప్ప, శివాజీ పిరికివాడు’ అని మరొక వర్గం వాదన. మరి అసలు గొప్పవాడు ఎవరు? చరిత్రను ఎవరు రాయాలో, ఏ కోణంలో చూడాలో నిర్ణయించే వాళ్లదే ఆధిపత్యం. వాస్తవానికి చరిత్ర అనేది కాలక్రమంలో వక్రీకరించబడుతూ ఉంటుంది.
సోషల్ మీడియాలో మెసేజ్లు, వీడియోలు, పోస్టులు నిరభ్యంతరంగా షేర్ అవుతున్నాయి. వీటిలో మంచిని పంచే సమాచారం కొంత ఉంటే, అపార్థాలు కలిగించే, ద్వేషాన్ని రగిలించే, అపనిందలను వ్యాప్తి చేసే సమాచారమే ఎక్కువగా ఉంటున్నది. సోషల్ మీడియాలో దృశ్యాలు, ఆడియోలు సులభంగా మార్పు చేయవచ్చు. అలా చేసిన వాటిని నిజమని నమ్మి అమాయకులు మోసపోతున్నారు. ఆరోగ్య రంగంలో ఫేక్ న్యూస్ దారుణ ప్రభావం చూపిస్తున్నది. అవగాహన లేకుండా కొన్ని వదంతులను నమ్మి, తప్పుడు చికిత్సలు అనుసరించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కొవిడ్ మహమ్మారి సమయంలో ఈ ధోరణి విపరీతంగా కనిపించింది. అదే విధంగా, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కూడా తప్పుడు ప్రచారం జరుగుతున్నది.
కులం, మతం అనే భావోద్వేగ అంశాల్లో అసత్య ప్రచారం ఘోరంగా విస్తరించింది. చిన్న సందేహాలను
భారీ వివాదాలుగా మార్చడం, చీలికలు సృష్టించడం సోషల్ మీడియా వల్ల సులభమైంది. కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టే పలు పోస్ట్లు, వీడియోలు వ్యాపిస్తున్నాయి. నిజానిజాలు తెలుసుకోకుండా ప్రజలు వీటిని నమ్మి సంఘంలో అశాంతి సృష్టిస్తున్నారు.
విమర్శనాత్మక ఆలోచన ఎంతో అవసరం. ఏ వార్తనైనా బాగా పరిశీలించిన తర్వాత మాత్రమే నమ్మాలి. మనకు నమ్మకమైన వనరులు ఉపయోగించి ఆన్లైన్ పోస్టులు మాత్రమే కాకుండా, నమ్మకమైన వార్తా సంస్థలు, పరిశోధనాత్మక కథనాలను ప్రామాణికంగా భావించాలి. ప్రస్తుతం అనేక ఫ్యాక్ట్-చెకింగ్ వేదికలు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించి సమాచారం నిజానిజాలను నిర్ధారించుకోవచ్చు. సోషల్ మీడియాలో ఏమి పంచాలో, ఏమి పంచకూడదో నిర్ణయించే సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉన్నది.
పెద్దలు చెప్పిన మాట గుర్తు చేసుకోవాలి. అర్ధసత్యం అబద్ధం కంటే భయంకరం. టెక్నాలజీ మన జీవన శైలిని సులభతరం చేస్తుంది కానీ, అదే టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించకపోతే అది మనల్ని అధః పాతాళానికి నెడుతుంది. సమాచార విప్లవంలో నిజాన్ని గుర్తించే విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. నిజం తెలుసుకునే తపన, అసత్యాన్ని ప్రశ్నించే ధైర్యం ఉండాలి. అప్పుడే మన సమాజం అబద్ధాన్ని అణచివేసే శక్తిని సంతరించుకుంటుంది. నిజమే శాశ్వతం.. అబద్ధం తాత్కాలికం. నిజానిజాలను విచారించే సామర్థ్యాన్ని పెంచుకొని, సమాజాన్ని ఆరోగ్యకరమైన సమాచారం వైపు నడిపించగలిగితేనే సత్యం విజయం సాధిస్తుంది.
-కాసర్ల నాగేందర్రెడ్డి