తెలంగాణ ముఖ్యమంత్రి భాషా వైదుష్యం పక్క రాష్ర్టాలకూ పాకింది. ఆయా రాష్ర్టాల రాజకీయ చర్చల్లో ఆయన ప్రధానంగా చోటు చేసుకుంటున్నారు. ప్రజాపాలనలో కాదు సుమా, పరుష పదజాలంలో. జాతీయ మీడియా సైతం తెలంగాణ సీఎం తిట్ల పురాణంపై దృష్టిని సారించింది. ఏదైతేనేమీ రాజకీయాల్లో ప్రత్యర్థులను విమర్శించే పాఠ్య ప్రణాళికకు ఒక వికృత అధ్యాయాన్ని జోడించారు.
ఏడాది కిందటి వరకు రాజకీయ సభ ల్లో ప్రవచించిన తిట్ల పురాణం ఇప్పు డు శాసనసభలోనూ ప్రతిధ్వనిస్తున్నది. రేవంత్ పరిభాషలో పదే పదే వినిపించే పదం ‘బట్టలిప్పదీయడం.’ వస్ర్తాపహరణమే కదా కౌర వ వంశ వినాశనానికి దారితీసింది. అది మర్చిపోతే ఎట్లా? అసభ్య పదజాలంతో సీఎం దూషించినప్పుడల్లా ఖండిస్తున్నవారంతా శిశుపాలుని ప్రస్తావన చేస్తున్నారు. కానీ, శిశుపాలుడు ఇంత అసభ్యంగా మాట్లాడలేదు. రాజసూయ యాగంలో అగ్ర తాంబూలానికి శ్రీకృష్ణుడు అర్హుడు కాదని, అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంతకంటే గొప్పవాళ్లు సభలో లేరా అని ధర్మరాజును ప్రశ్నించాడు. అంతేకానీ, జుగుప్సావహ బీభత్సరసాన్ని రంగరించి తిట్లందుకోలేదు. అందుకు మాఘుడనే కవి 1300 ఏండ్ల కిందట సంస్కృతంలో రాసిన శిశుపాల వధ కావ్యమే సాక్ష్యం. శిశుపాలునికి నేటి పాలకునికి పోలికే లేదు. రాజకీయాల్లో పరస్పరం విమర్శించుకున్న సందర్భంలో కొండకచో నోరుజారిన గొప్ప గొప్ప నాయకులు నాలుక కరుచుకున్న ఉదంతాలు, సవరించుకున్న సందర్భాలు లేకపోలేదు. కానీ, ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు, నా యిచ్ఛ యే కాని నాకేటి వెరపు’ అని ఓ కవి అన్నట్టు సమయం, సందర్భం లేకుండా అధికారిక కార్యక్రమాల్లో, చివరికి శాసనసభలో సైతం అభ్యంతరకరమైన తిట్ల పురాణాన్ని ప్రవచిస్తు న్న సీఎం ఇకనైనా తన తీరును మార్చుకుంటే సొంత పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు క్షేమదాయకం. ఒకప్పుడు దేశాన్ని ఏకచ్ఛత్రంగా పాలించిన కాంగ్రెస్ నేడు మూడు రాష్ర్టాలకే పరిమితమై స్ట్రెచర్‌పై కొన ఊపిరితో ఉన్నది. చాలా రాష్ర్టాల్లో ఉనికిలోనే లేదు. ఆ దుస్థితి తెలంగాణలో దాపురించకుండా ఉండాలంటే కాంగ్రెస్ అధిష్ఠానం సీఎం తిట్ల పురాణాన్ని కట్టడి చేయాలి.
ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ చక్కర్లు కొడుతున్నది. గత 14 నెలల్లో సీఎం అనుచితంగా ఏయే సందర్భాల్లో మాట్లాడారో నెలల వారీగా పేర్చి చూపించారు. కడుపు మండిన రైతులు, మహిళలు, యువకులు సోషల్ మీడియా ముఖంగా మాట్లాడితే ముఖ్యమంత్రి వారి పరిభాషను తప్పుబట్టడం సరే. మరి తాను మాట్లాడిన మాటలకు ఆయన పశ్చాత్తా పం వ్యక్తం చేయలేదు సరి కదా, తన భాష సరైనదే అన్నట్టు నిండు శాసనసభలో అవే మాటలను పునరుద్ఘాటించారు.
‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుం దా?’. నిండు శాసనసభలో అభ్యంతరకర పదజాలం సీఎం ఉపయోగిస్తుంటే ప్రజలు అనుసరించరా? వారు సాధారణ పౌరులు. వారి ఆగ్రహ ప్రకటన సందర్భంగా పద ప్రయోగా ల్లో అభ్యంతరకర పదజాలం దొర్లి ఉండవ చ్చు. అది కూడా మరో వ్యక్తితో తమ బాధను పంచుకున్న ఒక సందర్భంలోనే. కానీ, ముఖ్యమంత్రి పదవి గౌరవప్రదమైనది, బాధ్యతాయుతమైనది. పవిత్రమైన ప్రజాస్వామ్య దేవాలయం. ఆ విజ్ఞత, విచక్షణ, సందర్భ శుద్ధి మర్చిపోతే ఎట్లా? ఎవరైనా తప్పు చేసినట్టు భావిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. తప్పు రుజువైతే తగిన శిక్ష వేసేది మాత్రం న్యాయస్థానం, ముఖ్యమంత్రి కాదు. రజాకార్లు ఎప్పుడో 75 ఏండ్ల కిందట అమాయక తెలంగాణ ప్రజలపై, స్వాతంత్య్రోద్యమకారులపై అమలుపరిచిన రాళ్లతో కొట్టడాలు, లాగు ల్లో తొండలు వదలడాలు, తొక్కి పేగులు మెడ లో వేసుకోవడాలు, తోడుకల్ తీయడాలు, బట్టలిప్పి ఉరికించడాలు, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా శిక్షాస్మృతిలో చేర్చనుందేమోనన్న భయాలు ప్రజాస్వామ్యవాదులను వెంటాడుతున్నాయి. అవసరమైతే కొత్త చట్టం తెస్తానని సీఎం శాసనసభలో ప్రకటించాక ఆ భయం రెట్టింపైంది. వెర్రితనం కాకపోతే కోడి గొంతు నొక్కితే కొత్త పొద్దు ఆగుతుందా? మెటల్ డిటెక్టర్లకు ఆయుధం దొరుకుతుందేమో కానీ, ఆగ్ర హం దొరకదు. పాలనొక్కటే కాదు, నాయకుని భాష, ఆహార్యం, గుణగణాలు జీవనశైలి కూడా ప్రజలను ప్రభావితం చేస్తాయి. పోకిరి సినిమాలో విలన్ అలీభాయ్ (ప్రకాశ్‌రాజ్) తాను తొక్కుకుంటూ పైకి వచ్చానని హీరో( మహేష్ బాబు)తో బెదిరింపు ధోరణిలో అం టాడు. ఆ మధ్య సీఎం రేవంత్ కూడా తొక్కుకుంటూ ఇంతదాకా వచ్చానని చెప్పుకోవడాని కి వెనుక స్ఫూర్తి అదేనా?
ఇద్దరూ మహిళా యూ ట్యూబర్లు పెట్టిన పోస్టింగ్‌లో అభ్యంతరకరమైన అశ్లీలమైన పదప్రయోగాలుండవచ్చు. అది ముఖ్యమంత్రిని మనస్తాపానికి గురిచేసి ఉండవచ్చు. ఈ విషయంలో ఎవరూ విభేదించరు. వాస్తవానికి ప్రతిపక్ష పాత్రలో పదేండ్లలో కాంగ్రెస్ పెంచి పోషించిన సోషల్ మీడియా కేసీఆర్‌ను ఆయ న కుటుంబాన్ని కుళ్లపొడిచిన దాంతో పోల్చుకుంటే ఇదెంత? ఇవాళ సోషల్ మీడియా కూడా ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అన్న ట్టు వ్యవహరిస్తున్నది. అసభ్య పదజాలం కాదు కూడదంటూనే సీఎం నిరంతరాయంగా ప్రయోగిస్తున్న అదే పరిభాష అతనికి శాపంగా పరిణమించి సానుభూతి లేకుండా చేస్తున్నది.
రేవంత్ గత లోక్‌సభలో ఓ సందర్భంలో హిందీలో ప్రసంగించినప్పుడు సభలో ఉన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆయన హిందీని వెటకారం చేస్తూ ‘కమ్ జోరీ’ అనే పదాన్ని ఉపయోగించారు. ఆ పదం అసభ్యం, అశ్లీలం కాదు. అయినా రేవంత్‌రెడ్డి ఒంటి కాలు మీద లేచారు కదా! ఇతరులంటే అది తప్పు. తానంటే ఒప్పు. ఇదెక్కడి న్యాయం? ఆయన రాజకీయ ప్రస్థానంలో ప్రత్యర్థులను విమర్శించే క్రమంలో కట్టు తప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ అడిగిన పాపానికి రేవంత్‌రెడ్డి మీడియా ముందు ఎంత దారుణంగా స్పందించారో ప్రజలు చూశారు.
ఇక కేసీఆర్‌ను ఆయన కుటుంబసభ్యులను విమర్శించే క్రమంలో రాజకీయ సంప్రదా యం అంతరించి రచ్చబండ సంప్రదాయం జడలు విప్పింది. రాజకీయాలతో సంబంధం లేని పిల్లలను, మహిళలను, వ్యక్తిగత జీవితాలను సైతం వదిలిపెట్టలేదు. సొంత పార్టీ ప్రధానులు, ముఖ్యమంత్రులే దురదృష్టకర సంఘటనల్లో విషాదకరంగా, బాధాకరంగా దివంగతులైన చరిత్ర తెలిసి కూడా ప్రతిపక్ష నేత అకా ల మరణాన్ని సూచించే మార్చురీ పద ప్రయో గం ఒక ముఖ్యమంత్రి చేయడం దారుణం. ప్రమాదానికి గురై నడవలేని స్థితిలో కేసీఆర్ కర్ర పట్టుకుంటే అవహేళన చేసిన ముఖ్యమం త్రి కర్ర పట్టుకున్న గాంధీ స్వాతంత్య్రం తెచ్చాడని, కర్ర పట్టుకున్న బాబు జగ్జీవనరామ్ ఎమర్జెన్సీని ఎదిరించి కాంగ్రెస్‌ను తొలిసారి కేం ద్రంలో గద్దె దించాడని, వీల్‌చైర్‌లో కూర్చొని కరుణానిధి తమిళనాడును ఎదురులేకుండా ఏలాడని, ఆరోగ్యం సహకరించకున్నా సోనియ టమ్మ పదేండ్లు యూపీఏ ప్రభుత్వాన్ని వెంట ఉండి నడిపించారని తెలియదా. పరిపాలనలో లోపాలను ఎత్తిచూపుతున్న ప్రత్యర్థులకు దీటైన సమాధానం ఇవ్వలేక వయోభారాల మీద, అనారోగ్యాల మీద, అంగవైకల్యా ల మీద వెటకారాలు అమానుషం. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరంతరం వెనకేసుకొస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్న ఒక దినపత్రిక సంపాదకుడు, ఒక సుప్రసిద్ధ రాజకీయ విశ్లేషకుడు కూడా రేవంత్‌రెడ్డి ప్రయోగించిన స్ట్రెచ ర్, మార్చురీ పదాలను తప్పుబట్టారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. పరిధులు దాటిన దూషణ నైపుణ్యమే తనను అధికారంలోకి తెచ్చిందన్న భ్రమలో సీఎం ఉన్నారేమో తెలియదు కానీ, ఆయన ఆశిస్తున్నట్టు మరోసారి సీఎం కావడానికి అదే మార్గాన్ని ఎంచుకుంటే మాత్రం అదొక రాజకీయ విషాదాంతమవుతుంది. సప్త వ్యసనాల్లో అసభ్యంగా పరుషంగా మాట్లాడటం కూడా ఒకటని మహాభారతం చెప్పింది. వ్యసనం విచక్షణ లేకుండా చేస్తుంది. మొండి వ్యాధి. తొందరగా వదలదు. వ్యసనం అంతిమ గమ్యం పతనమే.
రాజకీయాల్లో పదవి దక్కించుకోవడం కంటే నిలబెట్టుకోవడమే కష్టం. అందునా కాంగ్రెస్ పార్టీలో మరీ కష్టం. రేవంత్‌రెడ్డి తరుణ ప్రాయంలోనే ఎంతోమంది సీనియర్లను త్రోసిరాజని కాలం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, ఎదురుగాలులకు నిలబడలేక ఏడాదికే తడబడుతున్నారు. అటు రాహుల్‌గాంధీ దర్శనం లభించక, ఇటు సీనియర్ మంత్రుల వ్యూహాత్మక మౌనం భరించక, పరిపాలనలో దిక్కుతోచని స్థితి సహించక అన్నివైపులా ప్రతికూల పరిస్థితులు ఎదురైన నేపథ్యంలో పెల్లుబుకుతున్న మానసిక సంక్షోభం, అసహనం ఆయన మాటల్లో ప్రతిఫలిస్తున్నది. దాన్ని, పరిహరించడానికి పరిపాలనను పట్టాలెక్కించడం ప్రజామోదం పొందడం తప్ప మరో మార్గం లేదు. అంతేకానీ, దూషణలు, నిర్బంధాలు అధికారాన్ని నిలబెట్టిన సందర్భాలు చరిత్రలో ఎక్కడా లేవు మన కవి సినారె అన్నట్టు…
కరవాలం విసిరితే కల కోకిల కూయునా? కొరడా ఝళిపించితే కుసుమం విరబూయునా?