తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మితమవుతుందనేది అక్షర సత్యం. ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశ మానవ వనరుల నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. నాణ్యమైన మానవ వనరులు కావాలంటే నాణ్యమైన విద్య/ శిక్షణ ఒక్కటే మార్గం. దీనికోసం అన్నివర్గాల ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో గురుకుల పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్యను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది.
దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలుచేయని విధంగా రాష్ట్రంలో గురుకుల విద్యను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. గ్రామీణ, పట్టణ స్థాయిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియంలో చదువులకు అంకురార్పణ చేసింది. వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లో 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నది. ‘మన ఊరు- మన బడి’, ‘మన బస్తీ- మన బడి’ కార్యక్రమంలో మౌలిక వసతులు కల్పించడం ద్వారా మానవ వనరుల అభివృద్ధికి భూమికగా నిలుస్తుందనటంలో సందేహం లేదు.
మూడేండ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ ప్రారంభించింది. మారుతున్న ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఆంగ్ల మాధ్యమ బోధనను ప్రవేశపెడుతున్నది. మూడేండ్లలో 26,072 ప్రభుత్వ పాఠశాలల్లోని మొత్తం 19.84 లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంతో ప్రయోజనం పొందనున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మొదటి దశలో 65 శాతం (సుమారు 13 లక్షల మంది) విద్యార్థులను కవర్ చేసే మొత్తం పాఠశాలల్లో 35 శాతం (9,123) పాఠశాలల్లో ఇది ప్రారంభించబడుతుంది.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు ఎక్కువగా ఉన్న 9,123 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలుచేయనున్నారు. ప్రభుత్వ ప్రణాళికలను అనుసరించి ఈ విద్యా సంవత్సరంలో చేపట్టే మొదటి దశలో రూ.3,497.62 కోట్లు ఖర్చుచేయనున్నారు. విద్యార్థుల హాజరుశాతాన్ని మెరుగుపరచడం, వారి చదువులు కొనసాగించేలా ప్రోత్సహించడంతో పాటు మెరుగైన విద్యా ఫలితాల కోసం దశలవారీగా డిజిటల్ మీడియా విద్యను ప్రవేశపెడుతారు. డిజిటల్ తరగతుల ఏర్పాటు, అవసరమైన అదనపు తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, అవసరమైన ఫర్నీచర్ కొనుగోలు, మరుగుదొడ్లతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులు చేపట్టనున్నది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థుల సృజనాత్మక శక్తిని మేల్కొల్పే వాతావరణం కల్పించడం ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.
‘మన ఊరు – మన బడి’ పథకం అమలును పారదర్శకత, సమర్థతతో జరగటానికి పాఠశాల నిర్వహణ కమిటీల ద్వారా స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం విజయవంతంగా ఆచరణ రూపం దాల్చడానికి గాను నిధుల కేటాయింపు, విడుదలను ఎప్పటికప్పుడు ఆర్థికశాఖ నిరంతరం పర్యవేక్షిస్తుంది. సాంకేతిక అంశాలు, మౌలిక వసతులకు సంబంధించి డిజిటల్ తరగతి గదులు ఇతర అంశాలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని ఐటీ శాఖ అందిస్తుంది. ఉద్దేశించుకున్న లక్ష్య సాధన కోసం నిర్ణీత గడువులతో పనులు చేపట్టనున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు ఉన్నతవిద్య సంస్థలలో మాత్రమే ఉన్న పూర్వ విద్యార్థుల సంఘాలను పాఠశాల వ్యవస్థలో కూడా ప్రవేశపెట్టి, పాత విద్యార్థులను కూడా పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములను చేయనున్నారు. ఈ సంఘాలలో ఇద్దరు క్రియాశీల పూర్వ విద్యార్థులు, ఇద్దరు పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సభ్యులుగా ఉంటారు. ‘మన ఊరు- మన బడి’ ‘మన బస్తీ- మనబడి’ కార్యక్రమంలో నీటి సౌకర్యం, టాయిలెట్ల విద్యుద్దీకరణ, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా విద్యార్థులకు సిబ్బందికి ఫర్నీచర్ తదితరాలు కల్పిస్తారు. పాఠశాలకు సున్నం, రంగులు; గ్రీన్ చాక్బోర్డులు, ప్రహరీ గోడలు, కిచెన్ షెడ్లు హైస్కూళ్లలో డైనింగ్హాళ్లు.. ఇలా సకల సౌకర్యాలు కల్పిస్తారు.
జిల్లా కలెక్టర్లు ప్రతి పాఠశాలలో ఒక ప్రాజెక్టుగా చేపట్టే అన్ని పనులకు పరిపాలనా అనుమతినిస్తారు. పూర్వ విద్యార్థులు, దాతల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతాయి. ఆయా పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులతో పాటు దాతల సహకారాన్ని పెంచడం గొప్ప విషయం. రూ.10 లక్షలు విరాళంగా ఇస్తే పాఠశాలలోని ఒక గదికి ఆ దాత పేరును పెడతామని చెప్పారు. కోటి రూపాయలు అందజేస్తే దాతలు కోరిన పేరును చేర్చి పాఠశాలకు నామకరణం చేస్తారు. ఆధునిక సమాజంలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్పొరేట్ రంగాల్లో ఉద్యోగావకాశాలకు వెళ్లిన సందర్భంలో ఇంగ్లీష్ భాషకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మాతృభాష అవసరమైనప్పటికీ ఆంగ్లం అనేది అనివార్యమైనది. కాబట్టి ప్రతి పేదవాడికి ఆంగ్ల విద్యను ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నది ప్రభుత్వం. దీంతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఈ బృహత్తర కార్యక్రమంలో కార్పొరేట్ సంస్థలను సామాజిక బాధ్యత కింద చేర్చడం ద్వారా నిధులను సమకూర్చుకునే వెసులుబాటు కూడా మెచ్చుకోదగ్గది. పట్టుదలతో ముం దడుగు వేసిన ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ విషయంలో కూడా విజయవంతం అవుతుందని ఆశిద్దాం.
– డాక్టర్ రవి ఆకుల
(వ్యాసకర్త: వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి, మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం, తెలంగాణ కామర్స్ అసోసియేషన్, సంయుక్త కార్యదర్శి)