శిశువునై పవళించనా పచ్చని పల్లె ఒడిలో
పాపనై పారాడనా వెచ్చని తల్లి ఒడిలో
మంచు ముసుగులో ముత్యమై మెరుస్తుంది
వేకువ వెలుగులో హరివిల్లయి విరుస్తుంది
సూర్యోదయానికి ముందే పక్షుల కిలకిలలు
పల్లెకవే కదా సుప్రభాత గీతికలు
నడిచొచ్చె ఆవుతల్లి, అన్నదాతకు ఆధారం
ఎదిగొచ్చె పైరుతల్లి, ప్రతిఒక్కరి ఆహారం
పచ్చని పైరులో వెచ్చని ప్రకృతి సోయగం
నిండిన చెరువుల్లో విచ్చిన కమలాలు రమణీయం
పాడే కోకిలలు, ఆడే లేగదూడలు
నాగలిపట్టే రైతన్నలు, పదంపాడే పల్లె పడుచులు
అలికిన వాకిళ్ళు, అలరారె ముగ్గులు
నిండిన ధాన్యాలతో అలరించే గుమ్ములు
కల్మషం లేని మనుషులు, మమత నిండిన మాటలు
ఊరంతా పచ్చదనం, ప్రతి పల్లె ప్రగతిమయం
సంస్కృతికి ఆలవాలం, సంస్కారానికి నిలయం
ఇదే మన బంగారు తెలంగాణం
ముదిగొండ ,సంతోష్
79813 52713