ఆకాశంబున నుండి శంభుని శిరం,బందుండిశీతాద్రి, సు శ్లోకంబైన హిమాద్రి…
అంటూ భగీరథుని ప్రయత్నంతో భూమిని చేరిన గంగను వర్ణిస్తాడు ఏనుగు లక్ష్మణ కవి. తాతలు ముత్తాతల పుణ్యలోక ప్రాప్తి కోసం గంగను తెస్తానని మాటిచ్చిన భగీరథుడు ఏండ్లకేండ్లు తపస్సు చేసి కూడా గంగను ఎత్తు నుంచి పల్లానికే తెచ్చాడు. కానీ తెలంగాణ ప్రజలకు సాగునీరిస్తానని మాటిచ్చిన అపర భగీరథుడు కేసీఆర్ గోదావరి నదికి రెక్కలు తొడిగి పల్లం నుంచి ఎత్తుకు పారించి నీరు పల్లమెరుగు అన్న సూక్తిని అబద్ధం చేశారు. గోదావరిని కాళేశ్వరం నుంచి మిడ్‌మానేరుకు, అటు నుంచి అనంతసాగర్‌కు, అక్కడి నుంచి రంగనాయకులకు, అటునుంచి కొండపోచమ్మకు, కొండపోచమ్మ నుంచి కూడెల్లి వాగుకు, కూడెల్లి వాగు నుంచి అప్పర్ మానేరుకు మళ్లించి నది నడకనే మార్చారు. గోదావరి నీటితో అప్పర్ మానేరును నింపి గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాలలోని 16 వేల ఎకరాలకు పైగా భూములను నీటితో తడిపి పల్లె తల్లి కాళ్లను గోదావరి నీటితో కడిగి రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు కేసీఆర్.
కలలో కూడా అనుకోని విధంగా కాలువల ద్వారా ఊరి చెరువులు నిండాయి. ముప్ఫై ఏండ్ల తర్వాత మొదటిసారిగా మానేరు ప్రాజెక్టు కింద సిరిసిల్ల రైతులు రోణి కార్తిలో నార్లు పోసి ఇప్పుడు నాట్లు వేస్తున్నారు. సమయానికి అందిన రైతుబంధుతో లాగోడి (పెట్టుబడి) పెట్టుకొని, సమయానికి వచ్చిన నీళ్లతో రైతులు పొలాలను దున్నుకుంటున్నారు. ఇది నదిని నిలిపి నడిగడ్డకు మలిపిన ఫలితం.
అసలు సిరిసిల్ల ప్రాంతమే ఒక నడిగడ్డ. తలాపున శ్రీరాంసాగర్ ఉన్నా సాగుకు కాదు అసలు తాగునీటికే కటకట పడి నీళ్లట్యాంకర్లతో గొంతు తడుపుకొన్న నేల. నిజాం కాలంలో కట్టిన అప్పర్ మానేరు ఒక్కటే ఈ ప్రాంతానికి జీవనాధారం. దీనికిందనే మానేరు నది పుట్టి సిరిసిల్ల మీదుగా పారుతుంది. అదే కరీంనగర్లో లోయర్ మానేరును నింపుతుంది. అప్పర్ మానేరు ప్రాజెక్టు 2.2 టీఎంసీల నీళ్లతో ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్ మూడు మండలాలకు నీళ్లిస్తుండేది. ప్రధాన వనరులైన కూడెల్లి, పాల్వంచ వాగులతో అది నిండేది. పాలకుల పక్షపాతం, వరుస కరువులు, ప్రాజెక్టులో కూడిన పూడిక, కూడెల్లి వాగు మీద కట్టిన చెక్‌డ్యామ్‌లు తదితర కారణాలతో అప్పర్ మానేరు ఎండిపోయింది. 1990 నుంచి పూర్తిస్థాయిలో రెండు పంటలకు ఎన్నడూ నీరు పారింది లేదు. దేవుడు దయతలచి వర్షాలు పడితే సెప్టెంబర్లోనో, అక్టోబర్లోనో నిండేది. అప్పటికి వానకాలం పంట నాట్ల టైం ఎత్తిపోయేది. ఇక యాసంగి పంట నాట్లు పడే జనవరి నాటికి సగం నీళ్లు కారిపోయేవి. ఉన్న ఒకటి అర టీఎంసీ నీళ్లతో యాసంగి ఒక పసలు పంట పండుడే గగనంగా ఉండేది. కొన తడులు అందక కొన్ని పొలాలు ఎండిపోయేవి. అందుకని తైబందుల (సాగు కోసం భూమి పరిమితులు) మీద పంటలు పండించుకునేవారు. అది కూడా వర్షాలు పడితేనే. ఇక వర్షాలు లేకుంటే ప్రాజెక్టు నిండక ఆ మాత్రం పంట కూడా లేక రెండు పసల్లు భూములు బీడుండవి. బోరు మోటర్ల వద్ద తప్ప కాలువల ద్వారా గత పాతికేళ్ల నుంచి జూన్, జూలైలో ఎప్పుడూ నాట్లు పడింది లేదు. అసలు ప్రాజెక్టు నీళ్లతో వానకాలం పంట పండిందే లేదు. మొదటి వానకు వట్టి వరి తుకాలు పోసి రైతులంతా ఆకాశం వైపు వర్షం కోసం ఎదురుచూసేవారు. ఏ జూలై చివరలోనో, ఆగస్టు మొదటలోనే వాన పడితే భగవంతుని మీద భారం వేసి నాట్లకు సాగేవారు. వానలు కొట్టి మానేరు నిండితే పండినట్టు.. లేకుంటే ఏసిన పంటలు ఎండినట్టు. అందుకే చాలామంది రైతులు ఆబితాబి (ఏడాదిలో పండే రెండు వరి పంటలను ఆబితాబి అంటారు) వరి పంట పండే పొలాల్లో పునాస పంటలు వేసేవారు. చాలాసార్లు ప్రాజెక్టులోనే సెనగలు, పల్లీలు అలికేవారు. ఏండ్లకేండ్లు జూదం లాంటి వ్యవసాయంతో అప్పుల పాలై ఇక్కడి రైతులు, కూలీలు బతుకుదెరువు లేక ఎడారి దేశాలకు వలస వెళ్లారు. ఒక దశలో ఊర్లల్లో వయస్సు మీదున్న మగవారు కనిపించలేదు. ఇంటింటికి ఒకరిద్దరు దుబాయి, మస్కట్లనే ఉండేవారు.
ఇదంతా 30 ఏండ్లుగా సమైక్య పాలనలో జరిగిన కథ. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెలంగాణ వచ్చాక కొత్త చరిత్ర మొదలైంది. అప్పర్ మానేరు డ్యాం చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి మండుటెండకాలం మే నెలలోనే నిండు కుండయి నిండింది. కాళేశ్వరం నీళ్లు మిడ్‌మానేరు గుండా అనంతసాగర్‌కు అక్కడి నుంచి కొండపోచమ్మకు వెళ్లేదారిలో జగదేవ్‌పూర్ మండలం చేబర్తి వద్ద కాలువ ద్వారా కూడెల్లి వాగులో కలిసి అప్పర్ మానేరులోకి వచ్చాయి. కలలో కూడా అనుకోని విధంగా కాలువల ద్వారా ఊరి చెరువులు నిండాయి. ముప్ఫై ఏండ్ల తర్వాత మొదటిసారిగా మానేరు ప్రాజెక్టు కింద సిరిసిల్ల రైతులు రోణి కార్తిలో నార్లు పోసి ఇప్పుడు నాట్లు వేస్తున్నారు. సమయానికి అందిన రైతుబంధుతో లాగోడి (పెట్టుబడి) పెట్టుకొని, సమయానికి వచ్చిన నీళ్లతో రైతులు పొలాలను దున్నుకుంటున్నారు. ఇది నదిని నిలిపి నడిగడ్డకు మలిపిన ఫలితం. ఇదిలాగే కొనసాగితే ప్రాజెక్టు ఇలాగే సకాలంలో నిండితే తెలంగాణ ఒక ధాన్యాగారం. ఎద్దేడ్వని ఎవుసం. రైతు నవ్విన రాజ్యం.
పెద్దింటి అశోక్‌కుమార్