వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. తమ ఊరిని తామే తీర్చిదిద్దుకోవాలనుకునే వారికి వాసాలమర్రి కార్యక్షేత్రం దారి చూపుతుంది. ప్రజల మధ్య ఐక్యమత్యం వెల్లి విరిసి మర్రి ఊడల్లాగా బలంగా ఉండాలని రాష్ట్రమంతటికీ పాఠం చెప్పేందుకు దోహదపడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఈ ఊరిలో ఉన్న ప్రజలంతా నా కుటుంబీకులేనని చెప్పి, మీలో ఒకమనిషిగా మీ అందరిలో కలిసిపోయి ఈ వాసాలమర్రిని అభివృద్ధి మర్రిగా మారుస్తానని చెప్పటం ప్రతి ఊరికి ఇచ్చిన సందేశం.
పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారం కార్యక్రమాల ద్వారా మన ఊళ్లు సంపూర్ణంగా అభివృద్ధి చెందాలి.వాసాలమర్రి గ్రామసభ ప్రతి ఊరి గ్రామసభకు ఒక పాఠం కావాలి. అది ప్రతి ఊరి అభివృద్ధికి అంకాపూర్ బోధనాంశంగా మారాలి. భావి గ్రామీణ తెలంగాణకు అది అఖండ ఆర్థిక పరిపుష్ఠిని అందివ్వాలన్నదే అందరి ఆకాంక్ష. నా తెలంగాణ ఆదర్శ గ్రామాల పల్లె వెలుగులుగా వెలుగొందాలి.
వాసాలమర్రి గ్రామ ప్రజలందరిలో విశ్వాసాన్ని నింపటానికి చేసిన కృషి, మొత్తం తెలంగాణలోని గ్రామ, పట్టణ, మహానగరాల ప్రజలందరిలో ఒక ఐక్యత భావాన్ని నిలపటానికి జరిగిన కృషిగా మిగిలిపోతుంది. వాసాలమర్రి గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధికి సన్నద్ధం చేయటం కోసం ప్రజలందర్ని గ్రామసభ పేరున, సహపంక్తి భోజనాల పేరున ఒక దగ్గరికి చేర్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. వాసాలమర్రిలో ముఖ్యమంత్రి గ్రామస్థులతో మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలందరికి వర్తిస్తాయి. అన్ని గ్రామాలను అంకాపూర్లుగా, గంగదేవిపల్లిలుగా, మల్కాఫూర్లుగా మార్చటం కోసం చేసిన వినూత్న ప్రయోగమిది. ప్రతి ఒక్కరిలో మన ఊరు అన్న సోయి వచ్చి, అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దామనే స్థితి రావాలి. అందరు ఐక్యంగా కలిసుంటే ఏ విధంగా ఐక్యతను సాధించగలుగుతారో అంకాపూర్ గ్రామాన్ని ఉదాహరణలతో సహా వివరించారు.
వాసాలమర్రిని తన లోపల ఉన్న భవిష్యత్తు ఆలోచనలకు బలమైన వేదికగా మార్చి అన్ని ఊళ్లకు అక్కడి నుండి కేసీఆర్ సందేశం అందించారు. ఆదర్శ గ్రామ నిర్మాణానికి ఎలాంటి బలమైన పునాదులు వేయాలో వివరించారు. అందుకు వాసాలమర్రిని ప్రయోగశాలగా మార్చే పనిని మొదలుపెట్టారు. ఆదర్శ గ్రామ సృష్టికి చేయాల్సిన కృషిని కర్తవ్యాలను బోధిస్తూ ఆచరణపాఠం అందరూ చదువుకోవాలని చెప్పారు. ఊరు మంచికి అంద రూ సహకరించేందుకు అందరి మనసులో మొదట మానవ సంబంధాల గూడును చెదిరిపోకుండా చూసుకోవాలి. మనుషుల్లో ద్వేష భావాన్ని నశింపజేసుకోవాలి.
కులం, మతం స్థానంలో ఐక్యమత్య మతం, అభివృద్ధి కులం, మార్పును సాధించే మహా సంకల్పం మొలవాలి. ప్రేమతో చేసే పని ఏదైనా ఉన్నతంగా ఉంటుం ది. ప్రేమతోనే కష్టాలను, బాధలను జయించాలి. కుల మతాల పేరున చీలిపోయిన బజారులన్నీ, దారులన్నీ గ్రామ అభివృద్ధి అనే మహాసంకల్పంలో కలగలిసిపో వాలి. కాలునొచ్చినా, చేయి నొచ్చినా, కష్టమొచ్చినా, కన్నీళ్లు వచ్చినా, ఊరంతా ఒక దగ్గరికొచ్చి ఎవరు బాధపడ్డా అది ఊరంతటి బాధగా చేసుకునే దశకు వస్తే అంతకంటే మించిన అత్యున్నతమైనది మరొకటి ఉండదు. పల్లెప్రగతి అంటే చెట్లు నాటడం, వాటిని కాపాడటం మాత్రమే కాదు మనుషుల మధ్యలో మనసుల మధ్యలో ఐక్యత మొక్కలు నాటాలి. ఆ సహృదయత లేకుండా ఏ అభివృద్ధి ముందుకుపోదు. అం దుకే వాసాలమర్రిలో సీఎం పదేపదే మనుషుల మధ్య ప్రేమ భావనలు వెల్లివిరియాలని కోరారు. అదే ఐక్యతకు తొలిమెట్టు అవుతుంది.
రాజకీయ ఘర్షణలు, కుల వైరుధ్యాలతో, మతాల విభేదాలతో ఊరు మధ్యలో చిచ్చు లేపే శక్తులు కూడా ఉంటాయి. అలాంటి ప్రతీపశక్తుల వల్ల ఊరు ముఠాలుగా, వర్గాలుగా చీలిపోయిన సందర్భాలను అనుభవంలో చాలా చూశాం. ఇక అలాంటివాటికి చరమ గీతం పాడటానికే మనసుల మధ్య, మనుషుల మధ్య ప్రేమానురాగాల మొక్కలు నాటే పనిని కేసీఆర్ వాసాలమర్రిలో చేశారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా కమిటీ వేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రమదాన కమిటీ, పరిశుభ్రత, తాగునీటి కమిటీ, హరితహారం కమిటీ, వ్యవసాయదారుల కమిటీ, యువ మహిళా కమిటీలు అనేకం వేసుకొని పని విభజన జరగాలని ఆ పనిలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్న సందేశం వాసాలమర్రి గ్రామసభ ఇచ్చింది. చేసే ప్రతి పని ఐక్యమత్యంతో ఉండాలి. అదే ఊరి అభివృద్ధి మ్యానిఫెస్టో. అదే ఊరి సంపూర్ణ అభివృద్ధికి కృషి చేస్తుంది. ఊరు ఆలనాపాల నా చూసే గ్రామాభివృద్ధి కమిటీయే ఈ ఊరికి సుప్రీంకోర్టు అని ఆ కమిటీకున్న శక్తిని కేసీఆర్ చెప్పారు.
ఊరు అభివృద్ధి అంటే అది ప్రతి కుటుంబం అభివృద్ధే అవుతుంది. ప్రతి కుటుంబానికి ఆదాయం, పొదుపు రెండూ ఉండాలి. సంపదలను సృష్టించుకోవటం, సృష్టించుకున్న సంపదను తిరిగి అందరూ సమంగా పంచుకోవటం జరగాలి. పొదుపు అన్నది కుటుంబాన్ని అన్నింటినుంచి కాపాడేది. పొదుపు అన్నది ఎట్లా ఉండాలో అందుకు బంగ్లాదేశ్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ హస్మీ చేసిన కృషిని, అంకాపూర్ అభివృద్ధిని గ్రామ సభ ద్వారా కేసీఆర్ చెప్పి అవగాహన కల్పించారు. పొదుపు ఉద్యమ స్ఫూర్తితో గ్రామంలో ఒకరికొకరు సహకరించుకుంటారు. సర్పంచ్ ఊరిలోని అందరి కుటుంబ వివరాలు ఆర్థికస్థితిగతులు సేకరించాలి. గ్రామసభ అంటే ఘర్షణల సభ కాకూడదు. ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో గ్రామసభ జరగాలి. అది ఊరి అభివృద్ధి ప్రతిభగా నిలవాలి.
(వ్యాసకర్త: బీసీ కమిషన్ మాజీ సభ్యులు)
జూలూరు గౌరీశంకర్