ఆమె- దళిత బాలిక బాల వధువు పేద కుటుంబం పల్లెటూరు నేపథ్యం ఆమె పేరు కల్పన
ఆమెకు జీవితమంటేనే అలుపెరుగని పోరాటం
అడుగడుగునా అనేక సవాళ్ళను అధిగమించింది…
కానీ… పూట గడవడానికి నాలుగు రాళ్ళు సంపాదించడం కాదు.
వ్యాపారవేత్త కావాలని కలలు కన్నది.
యాభై వేల రూపాయల బ్యాంకు రుణం
ఆమెలో వ్యాపార కౌశలాన్ని రగిలించింది.
నాడు చిరుదివ్వె వంటి చిన్న వ్యాపారం-
ఇప్పుడు కోట్లాది రూపాయల సామ్రాజ్యం.
కొంచెం ఆర్థిక తోడ్పాటునిస్తే దళితులు శ్రమించి
కోటీశ్వరులవుతారనడానికి కల్పన నిలువెత్తు దర్పణం.
దళితులు ఎవరికీ తీసిపోరు. దేనిలోనూ తక్కువ కాదు. కానీ, తరతరాల వివక్ష, అణిచివేత వారిని అంధకారంలోకి నెట్టివేశాయి. చేయూతనిచ్చినా ఎదగలేరని అపప్రథలు, అవమానాలు. కానీ, ఇదంతా అబద్ధపు ప్రచారమని నిరూపించి నింగిని తాకేంతటి విజయాల్ని సాధించిన దళితులు ఎందరో ఉన్నారు. గోరంత చేయూతతో కొండంత లక్ష్యాల్ని కూడా అధిరోహించగలమని చాటిచెప్పిన వారు ఎందరెందరో.
ఇటువంటి విజయసాధకులను వందలు వేల సంఖ్యలో తయారుచేయటానికే తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని తీసుకొచ్చింది. పది లక్షల రూపాయల సాయంతో దళితులు తమ జీవితాన్నే గెల్చుకునే అవకాశం కల్పిస్తోంది.
ఈ నేపథ్యంలో.. భవిష్యత్ దళిత పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిని కలిగించటం కోసం ‘నమస్తే తెలంగాణ’ దళితుల విజయగాథలను అందించాలని సంకల్పించింది. మహారాష్ట్రలో అతి సామాన్య దళిత కుటుంబంలో పుట్టి, అనేక సమస్యలను ఎదుర్కొని నేడు వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన కల్పనా సరోజ్ ఆదర్శ గాథ ఇది.
కల్పన మహారాష్ట్రలోని రోపర్ఖెడా గ్రామంలోని పేద దళిత కుటుంబంలో జన్మించింది. తండ్రి పోలీస్ కానిస్టేబుల్. బిడ్డను బాగా చదివించాలనే అనుకున్నాడు. కానీ బిడ్డకు వెంటనే పెండ్లి చేయాలని బంధువుల ఒత్తిడి. అప్పడామెకు 12 ఏండ్లు, ఏడవ తరగతి. బంధువు ఒకాయన ముంబయిలో ఉంటున్న కుటుంబం గురించి చెప్పాడు. మంచి సంబంధం బిడ్డ సుఖపడుతుందని తండ్రి వెంటనే పెళ్ళిచేశాడు. అక్కడ అత్తగారింటిలో ఒకే గది. పన్నెండు మంది కుటుంబ సభ్యులు. కొత్త కోడలు అనే కన్నా, కట్టుబానిస అంటే సరిపోతుంది. ఉదయం నాలుగు గంటలకే లేచి ఇంటి చాకిరి అంతా కల్పన చేయాల్సిం దే. ఏదో సాకు చూపి అనుక్షణం తిట్టుడు, కొట్టుడు. కడుపు నిండా తిండి పెట్టరు. ఆరు నెలల తరువాత తండ్రి చూడటానికి వెళ్లినప్పుడు, కల్పన అస్థిపంజరంలా కనిపించింది. ఇక నా బిడ్డను ఇక్కడ ఉండనీయను అంటూ వెంట తీసుకుపోయాడు. ఆమె మకాం మళ్ళీ రోపర్ఖెడాలో తల్లిగారింటికి మారింది.
కల్పన ఆ నరకం నుంచి బయట పడిందే కానీ, ఇరుగు పొరుగు సూటిపోటి మాటలు బాధించేవి. ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. కానీ ఓ మోస్తరు ఉద్యోగానికైనా కనీసం పదవ తరగతి ఉండాలి. మొగుడిని వదిలి ఇంటిమీద ఉన్నదంటూ బంధువుల అవమానాలు భరించలేక చనిపోదామని పురుగుల మందు తాగింది. చిన్నమ్మ దవాఖానకు తరలించడంతో బతికిపోయింది. ‘ఏదో జరిగింది… విషం తాగిందీ’ అంటూ దవాఖానలోనే ఎత్తిపొడుపు మాటలు ఆమె చెవుల పడుతున్నాయి. ‘ఆడపిల్ల ఆత్మహత్య చేసుకోవద్దు బిడ్డా.. కుటుంబం పరువు తీస్తరు’ అంటూ చిన్నమ్మ చెప్పింది. ‘అంటే… తాను ఆత్మహత్య చేసుకున్నా అవమానాలను నుంచి తప్పించుకోలేదు. మరిక ఏమి చేయాలి?’ తాను బతకవలసిందే, బతకాలంటే పోరాడవలసిందే.
దవాఖాన నుంచి కొత్త కల్పన బయట అడుగు పెట్టింది. ఈ కొత్త కల్పన పరిస్థితులకు బెదరదు. ఎదురు దెబ్బలకు కుంగిపోదు… పోరాడుతుంది!
కల్పన కుట్టుపని నేర్చుకున్నది. కానీ గ్రామంలో అవకాశాలు లేవు. మళ్ళీ ముంబయి పోతానని అంటే తల్లి మొదట ఒప్పుకోలేదు. రైలు కిందబడతానని బెదిరిస్తే ముంబయికి పంపించడానికి ఒప్పుకొన్నది. పదిహేనేళ్ళ ప్రాయంలో ‘కొత్త కల్పన’ మళ్ళీ ముంబయిలో అడుగు పెట్టింది. ఈ సారి భర్త దగ్గరికి కాదు, మేనమామ ఇంటికి, తన కాళ్ళ మీద తాను నిలబడటానికి! కుట్టుపని వస్తుంది. ఓ దుస్తుల తయారీ కంపెనీలో చేరింది. తనకంటూ నిశ్చితమైన ఆదాయం ఏర్పడింది. జీవితంలో మొదటిసారి వంద రూపాయల నోటును తన చేతితో పట్టుకున్నది! పైస పైస జమచేసి ఒక కుట్టుమిషిన్ కొనుక్కున్నది. పొద్దంతా దుస్తుల ఫ్యాక్టరీలో పనిచేసేది. రాత్రిళ్ళు ఇంటిదగ్గర కష్టపడేది. కానీ విధి ఆమెకు మరో పరీక్ష పెట్టింది. తండ్రికి ఉద్యోగం పోయింది. మొత్తం కుటుంబాన్ని ముంబయికి పిలిపించుకుంది. కష్టపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నది. కానీ అంతలోనే మరో విషాదం..చెల్లె అనారోగ్యం పాలయింది.సర్జరీ చేయిం చాలి. కానీ చేతిలో డబ్బు లేదు. తనకు బతకాలని ఉన్నదంటూ ఏడుస్తూనే చెల్లె కన్నుమూసింది.
డబ్బు లేని బాధలేమిటో కల్పనకు ఇంకా బాగా అర్థమైంది. ఇప్పుడామె ఆలోచన ఒక్కటే.. ఏదైనా వ్యాపారం చేయాలి.. బాగా డబ్బు సంపాదించాలి.
బ్యాంకు నుంచి యాభై వేల రూపాయల రుణం లభించడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ డబ్బుతో ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నది. వ్యాపారం బాగానే నడుస్తున్నది. కానీ ఆమె గతాన్ని మరిచిపోలేదు. తనలాంటి పేద కుటుంబాలను ఆదుకోవాలని ఒక సంస్థను నెలకొల్పింది. దాదాపు ఎనభై లక్షల రూపాయల మేర అనేక మంది పేదవారికి రుణాలు ఇప్పించింది. అనేక మంది రిక్షాలు, కుట్టుమిషన్లు మొదలైనవి కొనుక్కొని బతుకుతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడేది. 1980 ప్రాంతంలో 22 ఏండ్ల వయసులో స్టీల్ ఫర్నిచర్ వ్యాపారం చేస్తు న్న సరోజ్‌ను వివాహమాడింది. వారికి ఇద్దరు పిల్ల లు. సంపాదన, సంసారం చక్కగా నడుస్తున్న దశలో ఆమె హృదయానికి మరో గాయం… 1989లో భర్త మరణించాడు. ఇద్దరు పిల్లలను ఒంటి చేత్తో పెంచు తూ వ్యాపారం చూసుకునేది, సంఘ సేవ చేసేది.
క్రమంగా కల్పన కుటుంబం నిలదొక్కుకున్నది. ఆమె సంఘంలో మంచి పేరు కూడా సంపాదించుకున్నది.
ఒక రోజు ఒకాయన వివాదంలో ఉన్న తన స్థలా న్ని అమ్ముతానంటూ కల్పనా సరోజ్‌ను సంప్రదించాడు. స్థలం విలువ రెండున్నర లక్షలు మాత్రమే. కానీ వివాదంలో ఉన్నది. ఆమె ధైర్యంతో కొన్నది. ఆ తర్వాత ప్రయాస పడి వివాదాలు పరిష్కరించుకు న్నది. దీంతో స్థలం విలువ యాభై లక్షలైంది. దాన్ని రియల్ ఎస్టేట్ డెవలపర్లకు అప్పగించి 35 శాతం వాటా తీసుకున్నది. రియ ల్ ఎస్టేట్ వ్యాపారం లాభసాటిగా ఉంద ని, కల్పన ఈ రంగంలోకి అడుగు పెట్టిం ది. కానీ బెదిరింపు లు మొదలయ్యా యి. కిరాయి హంతకులను పెట్టి ఆమెను హత్య చేసే ప్రయత్నా లు జరిగాయి. పోలీసుల కు ఫిర్యాదు చేసి వారిని అరెస్టు చేయించింది. ఈ కుట్రల వెనుకున్న కాంగ్రెస్ నాయకుడి మీద సోనియా గాంధీకి ఫిర్యాదు చేసింది. సోనియా నుంచి ఆదేశాలు రావడంతో అతడు వెనక్కు తగ్గాడు.
సాహసవంతులను విజయం వరిస్తుందంటారు. కల్పన సాహసి. విజయం ఆమెను వెన్నంటి ఉన్నది.
కామనీ ట్యూబ్స్‌కు చెందిన కొందరు కార్మికులు ఆమెను కలిసి, నష్టాల్లో ఉన్న తమ కంపెనీని ఆదుకోవలసిందిగా కోరారు. అప్పటికే ఆ సంస్థను కార్మికులకు అప్పగిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. కార్మిక నాయకుల స్వార్థం వల్ల అది మరింత దెబ్బతిని మూతపడ్డది. కార్మికులకు బకాయిలు, అప్పులూ కలిసి ఆ కంపెనీకి రూ.116 కోట్ల భారం ఉన్నది.
కల్పన మరో సాహసం చేసింది. మహారాష్ట్ర ఆర్థిక మంత్రితో మాట్లాడింది. అతడు బ్యాంకులతో మాట్లాడాడు. వడ్డీలే కాదు, అసలు కూడా 25 శాతం తగ్గిస్తామని బ్యాంకులు చెప్పాయి. 2000 సంవత్సరం నుంచి ఆమె పరిస్థితులను చక్కదిద్దడం మొదలుపెట్టింది. ప్రయత్నాలు ఫలించడంతో, 2006లో కామనీ ఇండస్ట్రీస్ చైర్మన్‌గా కల్పన బాధ్యతలు స్వీకరించింది. కార్మికులకు బకాయి పడిన వేతనాలు ఇవ్వడమే కాకుండా కంపెనీని లాభాల బాటలో నడిపిస్తూ బ్యాంకు రుణాలు కూడా చెల్లించారు. కామనీ కంపెనీకి చెందిన మరో రెండు విభాగాలు దివాళా బాటలో ఉంటే వాటిని కూడా కొనుగోలు చేసింది. కామనీ ఉత్పత్తులు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నా యి. ఆమె సంస్థలకు దేశంలో పోటీ లేదు, అంతర్జాతీయ రంగంలో చైనాతోనే పోటీ! కల్పన వ్యాపార సామ్రాజ్యం ఇతర రంగాలకూ విస్తరిస్తున్నది. విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నది. భూగర్భంలో- గనుల తవ్వకం, ఆకాశంలో- మానవ రహిత వాహనాల వంటి భిన్న రంగాలలో అడుగు పెడుతున్నది.
‘జిందగీ హై యా కొయీ తుఫాన్ హై
హమ్ తో ఇస్ జీనే కె హాంథోం మర్ చలే’
ఒకప్పుడు ఆమెకు జీవితమంటే తుఫాన్.
జీవితమే మృత్యువై కబళించేది.
కానీ ఆ తుఫానులోనే
పెనుగాలులతో సయ్యాటలాడుతూ
విజయ శిఖరాలు అధిరోహించింది,
ఆకాశంలో విహరిస్తున్నది.
ఇప్పుడు- మెర్సిడెజ్ బెంజ్ ఆమె వాహనం
రాతితో నిర్మించిన రాచప్రసాదం ఆమె కార్యాలయం
అంబానీలు, వాడియాల కల్యాణ్ ప్రాంతం కార్యక్షేత్రం
వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం
భారతీయ మహిళా బ్యాంక్ డైరెక్టర్లలో ఒకరు. ఐఐఎం బెంగుళూరు బోర్డ్ ఆఫ్ గవర్నర్లలో సభ్యురాలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అన్నిటికి మించిన సంఘ సేవకురాలు