ఇటీవల మెక్ కిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ వారు ‘ది రైజ్ అండ్ రైజ్ ఆఫ్ ది గ్లోబల్ బ్యాలెన్స్ షీట్. హౌ ప్రొడక్టివ్లీ వి ఆర్ యూజింగ్ అవర్ వెల్త్’ అనే నివేదికను వెలువరించారు. ఈ నివేదికలో ప్రపంచంలోని నికర విలువ పెరుగుదల గత రెండు దశాబ్దాల (2000-2020)లో ఏ విధంగా ఉందో విశ్లేషిస్తూ, ప్రపంచ నికర విలువలకు 60 శాతం వరకు దోహదం చేస్తున్న 10 దేశాల స్థితిగతులను విశ్లేషించారు. చైనా, జపాన్, స్వీడన్ , కెనడా, యూకే, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, మెక్సికో, అమెరికా దేశాల నికర విలువల విశ్లేషణ ఇందులో ఉన్నది. ప్రపంచ నికర విలువ 2000లో 160 ట్రిలియన్గా ఉండగా అది 2020 నాటికి 510 ట్రిలియన్కు చేరుకుందని, ఇది రెండు దశాబ్దాల కాలంలో మూడు రెట్లు పెరిగిందని విశదీకరించారు. దేశాలవారీ నికర విలువలను వెల్లడించారు. ఈ నికర విలువ చైనాలో 50 శాతం పెరుగుదల ఉంటే అమెరికాలో 22 శాతం మాత్రమే ఉన్నది.
చైనా నికర విలువ 2000లో 7 ట్రిలియన్ మాత్ర మే ఉండేది. 2020 నాటికి 120 ట్రిలియన్కు చేరుకుంది. ఈ రెండు దశాబ్దాల్లో చైనా 113 ట్రిలియన్ పెరుగుదల నమోదు చేసుకోగా అమెరికా 90 ట్రిలియన్ డాలర్ల పెరుగుదలను నమోదు చేసుకున్నది. చైనా నికర విలువ జీడీపీలో 8.2 రెట్లు అత్యధికంగా నమోదు కాగా మొత్తం పది దేశాల్లోనే అమెరికా అత్యల్పంగా జీడీపీలో 4.3 రెట్లు మాత్రమే కలిగి ఉన్నది. అయితే ఇక్కడో విశేషం గమనించాలి. చైనా తలసరి ఆదాయం 86 వేల డాలర్లు అయితే, అమెరికా తలసరి ఆదాయం 272 వేల డాలర్లు.
గడిచిన రెండు దశాబ్దాల్లో ప్రపంచ దేశాల ఆర్థికరంగంలో ఒక డాలర్ పెట్టుబడి ఉంటే రెండు డాలర్ల మేర రుణం లేదా నాలుగు డాలర్ల మేర భారం ఉంటుంది. కానీ చైనాలో ఒక డాలర్ పెట్టుబడి ఉంటే ఒక డాలర్ రుణం మాత్రమే ఉంటున్నది. అంటే ప్రపంచ దేశాల్లో కెల్లా చైనాలో పెట్టుబడులు ఆశాజనకంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. కానీ, చైనాలో కానీ, అమెరికాలో కానీ నికర విలువలో మూడింట రెండొంతులు పది శాతం కుటుంబాల చేతిలో ఉన్నది. 2000లో అమెరికా జనాభాలోని 10 శాతం దగ్గర 67 శాతం సంపద ఉండేది. కానీ 2019 నాటికి 10 శాతం దగ్గర 71 శాతానికి సంపద పెరిగిందని తెలిపింది. ఇక చైనా విషయం చూస్తే, జనాభాలోని పై తరగతి 10 శాతం దగ్గర 2000లో 48 శాతం సంపద ఉంటే, 2015 నాటికి 67 శాతానికి పెరిగింది. అంటే కేవలం పదిహేనేండ్లలో 19 శాతం పెరుగుదల నమోదైంది. అంటే కమ్యూనిస్టు వ్యవస్థగా చెప్పుకొంటున్న చైనాలో ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్నాయి. గడచిన రెండు దశాబ్దాలలో నికర విలువల పెరుగుదలలో తీవ్ర వ్యత్యాసాలున్నాయని స్పష్టమవుతుంది. ఈ నికర విలువలో రియల్ ఎస్టేట్ భాగం 68 శాతం ఉన్నదని, మిగతా ఆస్తులన్ని కలిపి 32 శాతమే ఉన్నాయని ‘మెక్ కిన్సే’ నివేదిక వివరించింది.
ఆస్తుల ధర పెరుగుదల వల్ల ఆదాయాలతో నిమిత్తం లేకుండా సంపద పెరుగుతున్నది. చైనాలో 2000-20 కాలంలో నామినల్ ఇంటి విలువ 411 శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. కానీ అమెరికాలో మాత్రం 108 శాతం పెరుగుదలనే నమోదు చేసుకుంది. అంటే చైనా నికర విలువ పెరుగుదలలో రియల్ ఎస్టేట్ ముఖ్య భూమిక పోషించింది. అమెరికా చైనా కంటే నికర పెరుగుదలలో తక్కువగా ఉండటానికి ముఖ్య కారణం రియల్ ఎస్టేట్ పెరుగుదల చైనాలో మాదిరిగా లేకపోవడం. దీంతో పాటు అమెరికా నికర విదేశీ రుణం అధికంగా ఉండటమే. అమెరికాలో ద్రవ్యోల్బణం గడిచిన 130 ఏండ్లతో పోలిస్తే, గడిచిన రెండు దశాబ్దాలలో పెద్దగా లేదని నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ షిలర్ అభిప్రాయపడ్డారు.
ఆస్తుల కార్యకలాపాల వల్ల ఆదాయాలు తగ్గుముఖం పట్టగా, విలువలు మాత్రం పెరిగాయని ‘మెక్ కిన్సే’ నివేదికలో ఉన్నది. కొత్త ఉత్పత్తిదాయక పెట్టుబడులను పెంచడానికి, కార్యకలాపాలు పెంచేవిధంగా యాజమాన్య కౌశలాన్ని పురిగొల్పడానికి లభించే ప్రోత్సాహకాలు ఇటీవలికాలంలో తగ్గిపోయాయి.
ఉత్పత్తి కన్నా వాల్యూ గెయిన్స్కే పెట్టుబడిదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. చైనా సహా ప్రపంచదేశాల్లో ఈ రియల్ ఎస్టేట్ పెరుగుదల-2008లో అమెరికాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం వంటి పరిస్థితికి దారి తీయవచ్చునని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
గడిచిన రెండు దశాబ్దాలలో మౌలిక వసతులు, తయా రీ, ఉత్పత్తి, ఎగుమతులలో చైనా గణనీయమైన వృద్ధి సాధించింది. భారతదేశంలో గడిచి రెండు దశాబ్దాలలో పదేండ్లు కాంగ్రెస్ పరిపాలించగా మిగతా పదేండ్లు బీజేపీ పాలించింది. ఈ రెండు పార్టీల పాలనాకాలాల్లో నికర విలువల పెరుగుదల ప్రాతిపదికగా చూస్తే భారత్ మొదటి పది దేశాల్లో చేరలేకపోయింది. ఇప్పటికైనా మన దేశం ప్రజాస్వామిక పాలనలో, తలసరి ఆదాయంలో అమెరికాతో పోటీ పడుతూనే, నికర విలువ పెరుగుదలలో చైనాతో పోటీపడాలని కోరుకుందాం. విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా, పాక్, చైనాలను బూచిగా చూపడం ద్వారా ఆర్థిక పెరుగుదల సాధ్యం కాదని మన దేశ పాలకులు గ్రహించాలి.
పెండ్యాల మంగళా దేవి