ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకోవడం సాధ్యం కాకపోవడం వల్లనే జాతీయ వనరులను అద్దెకు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా? ప్రభుత్వానికి ఎంత డబ్బు వచ్చినా సరిపోదా? కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రెండుసార్లు రూ.లక్షా 70 వేల కోట్ల్లు తీసుకున్నది. ఆ డబ్బు ఏం చేశారో, ఎక్కడ ఖర్చుచేసారో తెలియదు. తొలిసారి అంతడబ్బు ఇవ్వనంటే ఆర్బీఐ గవర్నర్నే మార్చేశారు. తీసుకున్న డబ్బుకు లెక్క ఇటు ప్రజలకు చెప్పరు, అటు పార్లమెంటుకూ చెప్పరు. జీఎస్టీని కూడా సంస్కరణగా చెప్పుకుంటారు. అదొక పన్ను దారుణం. నేను ఈ మధ్య రచయితగా ఒక పుస్తకం ప్రచురించినందుకు జీఎస్టీ కట్టాను. ఇదివరకు పుస్తకం ప్రచురిస్తే పన్ను లేదు, అమ్మిన దుకాణాలకు అమ్మకం పన్ను తప్ప. అచ్చుకు అయ్యే ఖర్చు మీద జీఎస్టీ కట్టాలి. ఢిల్లీ నుంచి సామాన్లు తరలించి వచ్చినందుకు జీఎస్టీ కట్టాలి. ఇదివరకు ఇది కూడా లేదు. ప్రతి కార్యానికి పన్ను వేసి, ‘ఒకే దేశం-ఒకే పన్ను’ అని అందమైన అవాస్తవ స్వర్ణ స్వప్నాలు చూపి, జీఎస్టీలను రెండు చేసి కేంద్రం సామాన్యుడిని పిండేస్తున్నది. మీరు పిండుకోండని రాష్ర్టాలకూ సదవకాశాలు కల్పించారు. కార్పొరేట్ల నుంచి వేల కోట్ల విరాళాలను రహస్యంగా తీసుకునే రాజకీయపార్టీలకు మాత్రం ఏ పన్నూ లేదు.
ఈరెండు జీఎస్టీ పన్నులకు తోడు ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, ఎక్సైజ్ పన్ను కూడా కేంద్రానికి ఆదాయ వనరులే. జీఎస్టీ మీద కేంద్రానికి ఏటా 20 లక్షల కోట్లకు పైగా వస్తున్నది. కరోనా వల్ల గతేడాది తగ్గినా 12 లక్షల కోట్ల దాకా జీఎస్టీ మీదనే వచ్చింది. ఒక్క మార్చిలోనే 1 లక్షా 23 వేల కోట్లు వసూలయ్యాయి. నెలకు రెండు మూడు లక్షల కోట్లు వస్తాయి. ఆదాయ పన్ను తదితర ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.12.06 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఈ డబ్బంతా ఏమైంది? మళ్లీ రూ.6 లక్షల కోట్ల కోసం ఈ అద్దెకు ఇవ్వడమేంటి?
భారీ విదేశీ అప్పుల ప్రభావమా?: ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయాలనే ఒత్తిడి విదేశాల నుంచి రావడానికి కారణం భారతదేశం వారి అప్పుల మీద పూర్తిగా ఆధారపడటమే అని ప్రసిద్ధ ఆర్థికశాస్త్ర ఆచార్యులు డి.నరసింహారెడ్డి, (హెచ్సీయూ) వివరించారు. తీర్చలేనన్ని అప్పులు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోవు. ఐదేండ్లు పాలించడానికి వచ్చి, మరోసారి అధికారంలో ఉండటం కోసం చేసే ప్రయత్నాల్లో దేశం, దేశ ఆర్థిక అవసరాలు పట్టించుకోకుండా స్వార్థపూరిత విధానాలు రూపొందించడం వల్ల వచ్చిన దుర్దశ ఇది. విదేశీ శక్తులు ఆర్థికసంస్థలు, పాశ్చాత్య కంపెనీల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన ఆ దేశాలు, సంస్థలు షరతులు విధిస్తే భారతీయ సార్వభౌమత్వాన్ని వారికి తాకట్టు పెట్టిన ప్రభుత్వాలు కొని తెచ్చుకున్న దుర్దశ ఇది.
1991 తర్వాత ప్రైవేటీకరణ ఒక తప్పనిసరి విధానంగా అనుసరించినప్పుడు కూడా కొన్ని కీలకరంగాల వనరులను, సంస్థలను ప్రభుత్వేతరులకు అప్పగించరాదనే నియమాలు, పరిమితులుండేవి. ప్రభుత్వరంగ సంస్థల్లో ఒక్కొక్కటిగా వాటాలను అమ్మేస్తూ దానికి ‘డిజిన్వెస్ట్మెంట్’ అనే ముద్దుపేరు పెట్టుకున్నారు. స్ట్రక్చరల్ రీ అడ్జస్ట్మెంట్ అని కొత్త భాష సృష్టించారు. లైసెన్స్ రాజ్ తొలిగించిన తర్వా త విచ్చలవిడిగా ప్రైవేటు సంస్థలకు థర్మల్ పవర్ స్టేషన్లు, జలవిద్యుత్కేంద్రాలు పెట్టుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ఒక్క నెల్లూరులో 8 విద్యుచ్ఛక్తి సంస్థలు పెట్టుకోవడానికి అనుమతించారంటే ఎంత విచ్చల విడితనమో అర్థం చేసుకోవచ్చు.
ఏడు దశాబ్దాలుగా వ్యవస్థాపితం
చేసుకున్న అపారమైన ప్రభుత్వరంగం సంస్థల సంపదను పూర్తిగా ప్రైవేటుపరం చేయడానికి ఇప్పుడు కేంద్రం సిద్ధపడింది. దీనికోసం నగదీకరణ అనే
మరో కొత్త పదాన్ని సృష్టించింది.
‘ప్రభుత్వం కనీస స్థాయిలో పాలన గరిష్ఠ స్థాయి లో’ అని ఎన్నికల నినాదాలు చేస్తే, ప్రభుత్వ జోక్యా లు తగ్గి, సుపరిపాలన వస్తుందని భ్రమించారే కానీ రైళ్లు, రైలుమార్గాలు అద్దెకు ఇస్తారనీ, విమానాశ్రయాలు, చమురు కంపెనీలు, రేవు లు కూడా అమ్ముకుంటారని ప్రజ లు ఊహించలేదు. అప్పుల ఊబిలోంచి బయటపడలేక దేశాన్ని, పాలనను, ప్రభుత్వాన్ని అంచెలంచెలుగా, వాయిదాల పద్ధతిలో ము క్కలు ముక్కలుగా ప్రైవేటువారికి అప్పగించే వ్యాపారవేత్తలుగా రాజకీయవేత్తలు మారిపోతే ప్రజాస్వామ్యం గతేమిటి?
ఏదో ఒక పార్టీ కాదు.. మతావేశాలను ఓట్ల ఆకర్షణకు వాడుకుంటూ అధికారంలోకి వచ్చి ఆర్థిక విధానాన్ని భ్రష్టు పట్టించడం, కులాలను రెచ్చగొట్టి ఓట్లు సంపాదించడం, ముస్లిం వ్యతిరేకత, బీసీలకు, ఇతర కులాలకు మధ్య వైషమ్యాలు, అగ్రవర్ణ, హిందూ, బ్రాహ్మణ ద్వేషం షెడ్యూల్డ్ కులాలు తెగల్లో పెచ్చరిల్లజేసి ఓట్లు కూడగట్టుకోవాలనే ఆలోచన చేయని పార్టీలుండాలనే ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటారు. అన్నిపార్టీల వారు ఆవేశాలు రెచ్చగొట్టడమే మార్గమనుకుంటూ అట్టడుగు స్థాయిలోనే ఉన్నారు. ద్వేషంతో ఓట్లు తెచ్చుకోవచ్చనే రోగం కరోనా వంటిది. కరోనా పోయినా ఇది పోదేమో. ఈ రోగాలకు తోడు కరోనా కూడా వచ్చింది. ప్రజాస్వామ్యానికే కరోనా వచ్చింది. దీనికితోడు జాతీయ సంపదను కొందరికి కట్టబెట్టే దారుణమైన అమ్మకాలు అద్దెకు ఇవ్వడమనే రాజ్యాంగ విరుద్ధమైన దేశ ప్రయోజనాలకు హానికరమైన విధానాలను ప్రజలు ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది. (నాటి విలన్ రాజనాల, నాటి హీరో కత్తుల కాంతారావులకు క్షమాపణలతో..)
(వ్యాసకర్త: డీన్ (లా) మహీంద్రా యూనివర్సిటీ హైదరాబాద్, కేంద్ర మాజీ సమాచార కమిషనర్)
‘విఠలాచార్య’ సినిమాల్లో రాజనాల పిల్లలు పుడితే పన్ను, పుట్టకపోతే పన్ను, ‘తీర్థయాత్ర’కు వెళ్తే పన్ను, వెళ్లకుండా ఇంట్లో ఉంటే పన్ను విధిస్తాడు. కాంతారావు తిరుగుబాటు చేస్తాడు. మనకు ఇప్పుడు రాజనాలలే కానీ కాంతారావులు లేరు.
మాడభూషి శ్రీధర్