e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home ఎడిట్‌ పేజీ నిబద్ధ కవి పెన్నా

నిబద్ధ కవి పెన్నా

‘వెన్నెల్లో/ ఏటిలోని వెండి పళ్లాన్ని/ మూతితో జరుపుతోంది గుర్రం..!’
‘గాలితరగ/ దీపంతో పాటు/నా నీడనూ పట్టుకెళ్లింది..!’

ఈ కవితా పాదాలు చాలు కవి ప్రతిభ ఏంటో చెప్పటానికి. ఏవో కొన్ని వాక్యాలు రాసి ముక్కలుగా విరిచేసి దాన్నే కవిత్వంగా చెప్పుకొని ఊరేగుతున్న కాలంలో సాంద్రమైన వ్యక్తీకరణతో.. ‘కవిత్వం అంటే ఇదీ..’ అని చాటినవాడు పెన్నా శివరామకృష్ణ. కరువు, ఫ్లోరైడ్‌ పీడిత నల్లగొండ జిల్లాలో జన్మించిన పెన్నా తన కవిత్వంతో తన దాహాన్నంతా తీర్చుకున్నాడు. నిత్య సాహిత్య కృషీవలుడిగా సంపుటాలు, సంకలనాలుగా సాహిత్యాన్ని పండించారు. 11 కవిత్వ సంకలనాలు, సాహిత్య విమర్శ 8 సంపుటాలు, పదుల సంఖ్యలో ఇతర రచనల సంపుటాలు వెలువరించారు. కవిత్వం, సాహిత్య విమర్శ, వచనం.. ఏది రాసినా అది సామాజిక ప్రయోజనం కోసం రాశారు. రూప, సారాలను సారవంతం చేస్తూనే, అందమైన ఉపమానాలతో భాషకే అందాలు అద్దినవాడు పెన్నా.

- Advertisement -

తన చుట్టూ ఉన్న దృగ్గోచర ప్రపంచాన్ని తనదైన చూపుతో దర్శించటమే కాదు, విలక్షణమైన వ్యక్తీకరణతో ప్రకృతినీ, సమాజాన్నీ కవిత్వీకరించిన వాడు పెన్నా శివరామకృష్ణ. ఉదాహరణకు.. ‘వెన్నెల్లో/ ఏటిలోని వెండి పళ్లాన్ని/ మూతితో జరుపుతోంది గుర్రం..’లో.. ఉపమానాలు, ప్రతీకలతో కవిత్వాన్ని ఉన్నతీకరించారు. తెల్లని వెన్నెలకాంతిలో ఏటిలో కనిపిస్తున్నది తెల్లటి వెండిపళ్లెం చంద్రుడు. ఆత్రంగా దూపను తీర్చుకోవటానికి ఏటికివచ్చిన గుర్రం మూతిపెట్టి నీళ్లు తాగుతుంటే ఏర్పడిన నీటిలోని అలజడికి చంద్రబింబం అలల ప్రయాణంలో జరిగిపోతున్న దృశ్యం అద్భుతం. అలాగే.. ‘గాలితరగ/ దీపంతో పాటు/నా నీడనూ పట్టుకెళ్లింది’లో.. మనిషి జీవన తాత్వికతను లోతుగా చెప్పాడు. గాలి దీపం ఆర్పేయటం, దాంతో తన నీడనూ తీసుకుపోవటం.. మనిషి సహజీవన అనుబంధాన్నీ లోతుగా చెబుతుంది.

పెన్నా సాహిత్య కృషి ముందు బహుముఖ ప్రజ్ఞాశాలి అనేమాట చాలా చిన్నదేమో. ‘రోజు రోజుకో చరిత్ర’, ‘జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలు’, ‘నిరాశావాది నిఘంటువు’ లాంటి రచనలు విద్యార్థి యువజనులకు ప్రాపంచిక జ్ఞానాన్ని అందించేవిగా ఎంతో ప్రసిద్ధమైనవి. కవిత్వం రాసినా, సాహిత్య విమర్శ రాసినా సమాజాన్ని ఎక్స్‌రే చేసి చూపాడు. ఆ క్రమంలో సమకాలీన ప్రపంచ పోకడలను అసహ్యించుకున్నాడు. అంతకన్న తీవ్రంగా గర్హించాడు. సమూహం నుంచి వ్యక్తిని విడదీసి వ్యక్తి విజయానికి ఎదురయ్యే అడ్డంకులన్నింటినీ దాటడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కాలని చెప్పే వికృతాన్నీ, సామాజిక జీవితాన్నుంచి మనిషిని ఒంటరిని చేస్తున్న ధోరణులను ఖండించాడు. ఆ వినాశకర వికృత పోకడలను తన శక్తినంతా కూడదీసుకొని ఎదిరించాడు.

‘నీడలో నిల్చొని ఒకడు వెలుగును వెక్కిరిస్తుంటే.., మరొకడు నీడల కొలతలు తీస్తూ వెలుగుకు వెళతాడు..’ అని తన ‘సమాంతర ప్రవాహాలు’లో అజ్ఞానపు చీకటిలో మగ్గుతూ ఆధునికతను, శాస్త్రవిజ్ఞానాన్ని వెక్కిరిస్తున్న ఛాందసుల మౌఢ్యాన్ని ఈసడించుకుంటాడు. ఆశాజీవి ప్రగతికాముక పురోగమనాన్ని నూతన ప్రపంచపు దాపులకని దారిచూపుతాడు. ఆధునిక మనిషి జీవనమంతా సంక్లిష్టమయమైన రంపపుకోతల మధ్య రక్తాన్నోడుతున్న కాలంలో ప్రతి మనిషీ తనదైన అస్తిత్వాన్ని చాటుకోవాల్సిందే అంటాడు. ఎంత చిన్న కాంతి కిరణం ప్రసరించి వెలుగుబాటలు వేయాలన్నా కటిక చీకటిని కనికరం లేకుండా పారదోలాల్సిందే అంటాడు. మానవీయతకు అవరోధాలుగా ఉన్న సమస్త మౌఢ్యాలూ, సంకెళ్లనూ తెగనరకాల్సిందేనంటాడు. ఈ నేపథ్యంలోంచే.. ‘కత్తి అంచుతోనే కన్నీటిని తుడుచుకో.. వెంటాడే విష కంటకాన్ని వేణువుగా మలచుకో..’ అంటూ సమాజ పురోగతికి ఎదురుగా ఉన్న అవరోధాలన్నింటినీ ఆరోహణానికి ఆధారాలుగా మల్చుకోవాలని పిలుపునిస్తాడు. కుండలకొద్దీ మానవీయతను తన హృదయ కుహరంలోకి ఒంపుకొని మానవీయ పరిమళాలను వెదజల్లుతున్న శివరామకృష్ణ నిబద్ధ కవి.

అమ్మంగి వేణుగోపాల్‌
(కవి, రచయిత పెన్నా శివరామకృష్ణకు కాళోజీ పురస్కారం లభించిన సందర్భంగా..)

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement