అప్పుడప్పుడే పెన్సిల్ పట్టుకోవడం నేర్చుకున్న చిన్నపిల్లలు వేసే బొమ్మలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. మానవ సమాజ బాల్యం కూడా ఇలాంటి ఎన్నో బొమ్మలు వేసి, మెదడులో సృజనను, వేళ్ల మధ్య పట్టును పెంచుకొని ఆ తర్వాత కాలంలో అజంతా చిత్ర సుందరులను, ఎల్లోరా శిల్ప మంజరులను సృష్టించగలిగింది.
బండరాళ్లే కాన్వాస్‌గా..
తెలంగాణ అంతటా విస్తరించి ఉన్న గ్రానైట్ గుట్టలు, రాతిగుహల్లో ఉన్న రాతియుగపు మానవ నివాసాలే నాటి ఆర్ట్ గ్యాలరీలు. రాతిగుహల పైకప్పు, గోడలు, పక్కనే ఉన్న బండలు అన్నిటిమీదా కొన్ని వందల చిత్రాలు దొరికాయి. వేల ఏండ్ల కిందట వేసిన రంగులు ఇప్పటికీ మనకు కనిపించటం ఒక విచిత్రమే. అయితే ఈ అద్భుతానికి కారణం ప్రకృతిని, ప్రకృతితో మేళవించడమే. నాటి మానవులు రంగుల్ని, ప్రకృతిలో సహజసిద్ధంగా దొరికే మట్టి, ధాతువుల నుంచి సేకరించి, రాతిపై చిత్రించడానికి వాడుకున్నారు. అందుకే ప్రస్తుతం అవి వెలిసిపోయినప్పటికీ, ఆ రంగులు మనకు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ఎరుపురంగు కోసం జేగురుమన్ను (red ochre), తెలుపు కోసం సుద్ద, నలుపు కోసం బొగ్గు, ఇలానే.. పసుపు, ఆకుపచ్చ వంటి రంగులతో బొమ్మలు వేశారు. అయితే తెలంగాణలో ఎక్కువగా ఎరుపు, తెలుపు చిత్రాలే మనకు లభిస్తున్నాయి.
ఉత్తర తెలంగాణ రాతి చిత్రాలు
పాత రాతియుగం నుంచి అన్ని చారిత్రక కాలాలకు సాక్షిగా నిలిచిన ఉత్తర తెలంగాణ ఎన్నో ‘రాక్ ఆర్ట్’ ప్రదేశాలను ఇప్పటికీ నిలుపుకొంది. దేశంలోనే అతి గొప్ప రాతి చిత్రకళా స్థావరంగా మధ్యప్రదేశ్‌లోని భీంబేట్కాకు గుర్తింపు ఉన్నది. దానికి దీటుగా నిలిచేదిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాండవుల గుట్టను చెప్పుకోవచ్చు.
వారసత్వ సంపద పాండవుల గుట్ట
తెలంగాణలో అతిపెద్ద రాతియుగపు ఆర్ట్ గ్యాలరీగా చెప్పుకోదగ్గ పాండవుల గుట్ట ఉనికిని వెలుగులోకి తెచ్చింది తెలంగాణ ఆర్కియాలజీ శాఖ ఉద్యోగి ఎస్.ఎస్. రంగాచార్యులు. 1990లో స్థానికుల సహకారంతో చరిత్ర పుటల్లోకి ఎక్కిన ఈ స్థలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలం రావులపల్లె గ్రామ పరిధిలో ఉంది. ఇది ఒక గుట్ట కాదు.. ఎన్నో గుట్టల సముదాయం. రాతి చిత్రాలకే కాదు, కొన్ని కిలోమీటర్లున్న పొడవైన గుహకు, వందల కోట్ల ఏండ్ల కిందటి శిలాతోరణానికి కూడా స్థావరం ఈ గుట్టలు.
ఎదురు పాండవుల గుట్ట, పంచ పాండవుల గుట్ట, గొంతెమ్మ లేక కుంతీదేవి గుట్ట, పంది పర్వతం, జ్యోతి పర్వతం, పులి పర్వతం, శక్తి పర్వతం- ఇవన్నీ ఇక్కడి గు ట్టలకు స్థానికులు పెట్టుకున్న పేర్లు. ఇక్కడి చిత్రాలు ఎగువ మధ్య రాతి యుగం నుంచి మధ్యయుగం వరకూ అంటే దాదాపు ముప్పై వేల ఏళ్ల నుండి ఐదు వందల ఏండ్ల కిం దటి చిత్రాల వరకున్నాయి. అమెరికాలోని సాన్డియెగో యూనివర్సిటీ ప్రొఫెసర్ థామస్ లెవీ ఇక్కడి కొన్ని బొమ్మ ల్ని ఎగువ రాతియుగానికి చెందినవిగా నిర్ధారించాడు.
ఈ గుట్టల్లో పులి, జింక, ముళ్లపంది, గుడ్డేలుగు, జిరాఫీ, ఉడుము, కప్ప, సీతాకోకచిలుక, రేఖాగణిత డిజైన్లు, చేతి ముద్రలు (హ్యాండ్ ప్రింట్స్) – ఇలా ఎన్నో బొమ్మల్ని చిత్రించారు. పంచపాండవుల గుహలో మధ్యయుగం నాటి అంటే సుమారు 500 ఏండ్ల నాటి పాండవుల కథ, వివాహం, శేషసాయి, గణపతి వంటి చిత్రాలు ఎరుపు, ఆకుపచ్చ, గోధుమ, పసుపు, తెలుపు రంగుల్లో కనిపిస్తాయి. అయితే ఈ చిత్రాల్ని వేల ఏండ్ల కిందట గీసి న చిత్రాలపైనే వేసినట్టుగా కనిపిస్తుంది. ఇక గొంతెమ్మ గుట్టలో ‘శ్రీ ఉత్పత్తి పిడుగు, ఏకాంతవాసి పరామమ…’అనే రాష్ట్రకూట కాలం నాటి శాసనం కూడా ఉంది.
ఈ రోజు మనం లలితకళగా చెప్పుకొంటున్న చిత్రలేఖనం మన ఆలోచనలతో పాటు వికసించింది. తెలంగాణ అంతటా మానవ సంచారపు ఆనవాళ్లు వాళ్లు వేసిన బొమ్మల రూపంలో మనకు మిగిలినయి. కొండలు గుట్టల్లో, రాళ్ల మీద వెలిసిపోయిన రంగుల్ని ఇప్పటికీ ఊళ్లలో దేవతల రాతలుగా చూస్తారు. ప్రపంచమంతా రాతియుగపు చిత్రకళ ఎగువ పాతరాతియుగంలో మొదలై మధ్య, కొత్తరాతి యుగాల గుండా చారిత్రక యుగానికి విస్తరించింది. ఇప్పటివరకు మన తెలంగాణలో సుమారు 50కి పైగా స్థలాల్లో దొరికిన ఈ బొమ్మల ఆనవాళ్లు మన చరిత్రను కేవలం దక్షిణ భారతంలోనే కాదు మొత్తం దేశంలోనే ప్రముఖంగా నిలుపుతున్నాయి.
కొస్సగుట్ట – బొమ్మలలొద్ది – దేవర్లగుట్ట
ఇదే జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం నర్సాపూర్ గ్రామ పరిధిలో ఉన్న కొస్సగుట్ట, బొమ్మలలొద్ది, లింగాల గ్రామ పరిధిలోని దేవర్లగుట్టలలో కూడా రాతి యుగపు చిత్రాలున్నాయి. ఆడ, మగ జింకల జంటను స్పష్టంగా చిత్రించడం బొమ్మలలొద్ది విశేషం.
నీలాద్రిగుండ్లు
ఖమ్మం జిలా ్లపెనుబల్లి మండలంలోని ఈ ఐదుగుట్ట లు రాతిచిత్రాలకు ఒక స్థావరం వంటివి. జర్మనీ ఆర్కియాలజిస్టు న్యూమెయర్ ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతా లు కేవలం రాతిచిత్రాలకే కాదు, ప్రత్యేకమైన బృహత్ శిలాయుగ సమాధులకు నిలయం. రాతిపై చెక్కిన బొమ్మలకు (పెట్రొగ్లిఫ్స్) రంగులద్దిన ప్రత్యేకమైన పురాతత్వస్థలం ఇది. ఇక్కడి రంగుల పెట్రొగ్లిఫ్స్లో జంతువులు, మానవాకృతులు, పంజా గుర్తులు చిత్రించారు. వేల ఏండ్ల కింద గీసిన తేనెతుట్టె చిత్రం, ఇప్పటికీ అక్కడ పైకప్పుకు వేలాడుతున్న తేనెతుట్టె, కాలం నిరంతరతకు సాక్షి. ఇక్కడికి దగ్గరలోనే తరతరాలుగా స్థానిక ఆదివాసులు పూజలు చేస్తూ అక్షరలొద్దిగా పిలుచుకుంటున్న గుట్టల్లో కూడా నీలాద్రిగుండ్ల లాగానే రంగులద్దిన పెట్రోగ్లిఫ్స్ ఉన్నాయి.
ఒంటిగుండు
చరిత్ర పరిశోధకులు కట్టా శ్రీనివాస్, కొండవీటి గోపి పరిశోధనలో ఉనికిలోకి వచ్చిన ఈ ప్రదేశం కూడా నీలాద్రి గుండ్లకు సమీపంలోనే ఉంది. ఎరుపు రంగులో వేసిన బొమ్మలకు బయటవైపు బోర్డర్‌గా తెలుపు రంగు వేసిన ఒకే ఒక్క స్థలం ఈ ఒంటిగుండు. ఇక్కడ ఎక్కువగా బల్లుల చిత్రాలున్నాయి. కేవలం మూడు వేళ్ల చేయితో ఉన్న మానవాకృతి, నైరూప్య (అబ్స్ట్రాక్ట్) చిత్రాలు ఇక్కడి ప్రత్యేకత అంటారు కట్టా శ్రీనివాస్.
ఈ బొమ్మలు గీయడం వెనుక మర్మం ఏమిటి?
ఫ్రాన్స్‌లో 1885లో లామౌతే అనే గుహలో రివియేరే రాతి చిత్రాల్ని తొలిసారి కనుగొన్నప్పటి నుంచి ఈరోజు వరకు రాతి యుగపు మానవులు చిత్రాలు ఎందుకు వేశారనే దానిపై ఎన్నో సిద్ధాంతాలు వచ్చినాయి. యూరప్ దేశాల్లో మొదట కనుగొన్నందున ఈ బొమ్మలు గీసే కళ యూరప్‌లో మొదలై విస్తరించిందని సిద్ధాంతాలు వచ్చినా, ఆ తర్వాత అది తప్పని తేలింది. పరిణామక్రమంలో, మానవ సమూహాలలో అభివృద్ధి చెందుతున్న జ్ఞానమే ఈ సృజన సామర్థ్యానికి (కాగ్నిటివ్ కేపబిలిటీ) భూమి మీద వేర్వేరు ఖండాలలో స్వతంత్రంగా తెరతీసింది.
ఆ చిత్రాల వెనుక ఉన్న అర్థం, వేసిన ఉద్దేశ్యంపై కూడా భిన్నవాదనలు, సిద్ధాంతాలున్నాయి. హెన్రీ బ్రుయల్ అనే ఫ్రెంచ్ ఆర్కియాలజిస్ట్ ఈ బొమ్మల వెనుక వేటకు సంబంధించిన మాయ, మార్మికత ఉందనీ, ఇలా బొమ్మలు వేయడం వల్ల వేటాడుతున్న జంతువులలో పునరుత్పత్తి శక్తి పెరుగుతుందని, తాము వేటాడే శక్తిని పొందగలమని నాటి మనుషులు భావించారని అన్నాడు. న్యూమెయర్ అనే జర్మన్ ఆర్కియాలజిస్టు కూడా ఈ చిత్రాల్ని మేజిక్ (మాయ), తొలినాళ్ల మతపరమైన వ్యక్తీకరణలుగా భావించాడు. ఇంకొందరు ఇదేదీ కాదు, రాతియుగంలో మానవులు తమ చుట్టూ చూస్తున్న విషయాల్ని బొమ్మలుగా వేశారని భావించారు. వీటిలో ఏది నిజం అని తేల్చడం అంత సులువేమీ కాదు. అయితే ఈ బొమ్మలు వేయడం వెనుక ఏ ఒక్క కారణమో కాక, వేటకు సంబంధించిన మార్మికత, అప్పుడే బీజరూపంలో మొదలవుతున్న మతపరమైన ఆలోచనలు, చుట్టూ ఉన్న జంతువుల్ని, చూస్తున్న దృశ్యాల్ని చిత్రించడం, మెదడులో వికసిస్తున్న సృజనాత్మకతకు రూపం ఇవ్వడం – ఇలా పలు కారణాలు ఉండవచ్చని భావించాల్సి ఉంటుంది.
గాంధారికోట
మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట పక్కన ఉన్న గాంధారికోట (గాంధారిఖిల్లా), సమీపంలోని ఒక రాతి గుహలో మూపురం ఉన్న ఎద్దు, పక్షులు, పొడుగాటి ముక్కున్న కొంగ, జింక వంటి చిత్రాలు ఉన్నాయి. ఈ పరిసరాల్లో దొరికిన గోకుడు రాయి, సూక్ష్మ రాతి పనిముట్ల ఆధారంగా ఇది ఎగువ పాత రాతియుగం నుంచి మధ్యరాతి యుగం వరకు మానవులు నివసించిన ప్రాంతం అని ఆర్కియాలజీ శాఖ నిర్ధారించింది.
రేగొండ – రేగొండ -బూడిగపల్లి
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పక్కనే ఉన్న ఈ మూడు ఊళ్లలోని గుట్టల్లో రాతిచిత్రాల్ని వి.వి.కృష్ణశాస్త్రి రికార్డు చేశారు. రేగొండలో పొడవుగా ఉన్న మగమనిషి ఆకృతి, నందిపాదం, త్రిశూలం వంటి బొమ్మలు ఉన్నాయి. రేగొండ గ్రామం నల్లకొండ గుట్టపై రాతి చెక్కడాలున్నాయి. సుమారు రెండు మీటర్ల పొడుగున్న మనిషి ఆకృతి చేతిలో కత్తి, డాలు వంటివి ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే కొత్త రాతి యుగంలో ఇనుము తయారుచేసుకున్న ఆనవాళ్లు, బృహత్ శిలాయుగ సమాధులు ఉండటం వల్ల ఈ రెండు ప్రదేశాలు కొత్త రాతియుగం కాలానివని చెప్పొచ్చు. రేగొండకు దగ్గర్లోనే ఉన్న బూడిగపల్లి గ్రామ శివారులో వలసగట్టు గుట్టపై గుర్రం మీద బల్లెం పట్టుకొని కూర్చున్న మనుషులు, మూపురంతో ఉన్న ఎద్దు వంటి చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కొత్త రాతి యుగం నాటివే.
రాతి చిత్రాల కాలాన్ని ఎలా నిర్ధారిస్తారు?
రాతి చిత్రాలు కనిపించిన స్థలాల్లో దొరికిన రాతి యుగపు పనిముట్లు, చారిత్రక సందర్భాన్ని బట్టి మనం ఆ రాతి చిత్రాల కాలాన్ని నిర్ధారిస్తున్నాం. ఆర్కియాలజీ పరిశోధనల్లో ముందడుగు వేసిన కొన్ని దేశాల్లో శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఇందుకు వాడుతున్నారు. రామన్ స్పెక్ట్రోస్కోపీ వంటి పద్ధతుల ద్వారా కూడా రంగులలో ఉన్న ఖనిజాలు, మూలకాల గురించి తెలుసుకోగలుగుతాం. రాతి చిత్రకళలో చిత్రించిన జంతువులు, మానవాకృతులు, డిజైన్లు వంటి వాటిపై విస్తృత అధ్యయనం వల్ల కూడా ఆ చిత్రాల కాలాల్ని చెప్పగలుగుతున్నాం.
డా. ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000