సామాజిక వివక్ష నుంచి అంబేద్కర్ స్ఫూర్తితో దళిత సమాజం విముక్తి పొందటానికి తెలంగాణలో వెలుగుదారులు పడుతున్నాయి. దళితుల్లో పేదరికాన్ని శాశ్వతంగా తరిమికొట్టాలనే సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో ‘దళితబంధు’ పథకం ప్రారంభమైంది. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం అందనుండటంతో దళితులు ఇక సగర్వంగా తలెత్తుకొని తిరిగే సామాజిక పరిస్థితులు రాబోతున్నాయి. ఇక దళితులు ఉపాధి కోసం ఇతరుల వద్ద చేతులు జోడించి నిలిచే పరిస్థితులు పోయి, వారే ఇతరులకు పనికల్పించే స్థితి ఏర్పడుతుంది. ఇది ఒకరకంగా సామాజిక విప్లవమే.
ఉమ్మడి రాష్ట్రంలో చేతివృత్తుల విధ్వంసం జరిగింది. నాటి వ్యవసాయ సంక్షోభానికి మూలకారణం కూడా వృత్తుల విధ్వంసమే. రాష్ట్ర అవతరణ తర్వాత సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో కులవృత్తులకు ఆదెరువు, ఆదరణ మళ్లీ ప్రారంభమైంది. గ్రామీణ ఆర్థికవ్యవస్థ పురోగతి, పరిపుష్టి ఈ వృత్తుల మీదే ఆధారపడి ఉన్నది. కులవృత్తులను ప్రోత్సహించడమంటే గ్రామీణ సంస్కృతిని పునరుజ్జీవింపచేయడమే. ‘బహుజన హితాయ- బహుజన సుఖాయ’ అనే అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తున్నది. రాష్ట్ర జనాభాలో 54 శాతం ఉన్న సమస్త బీసీ కులాలకు వివిధ పథకాల ద్వారా ఆదుకుంటున్నది. సబ్బండవర్ణాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నది.
ప్రతిపక్షాలకు ఎన్నడు లేనిది దళిత, గిరిజనుల మీద, బడుగుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. అందరికి బంధు ఇవ్వాలని విపక్షాలు చేస్తున్న గోల అంతా ఇంతాకాదు. కానీ బీజేపీ, కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ర్టాల్లో 85 శాతం ఉన్న అట్టడుగు వర్గాల కోసం ఎన్ని సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారో చెప్పటం లేదు. కానీ ఇక్కడ దళితబంధు పథకంపై రంధ్రాన్వేషణతో విష ప్రచారంతో కుట్రలు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థికపరిస్థితి అంతంత మాత్రమేనని, దళితబంధు అమలుచేయాలంటే లక్షల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటది కాబట్టి అది సాధ్యమయ్యే పని కాదంటున్నారు. ఇది వారి అవగాహన లోపంగానే భావించాలి. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఏ పథకం కూడా మధ్యలో ఆపలేదనే దానికి ఈ ఏడేండ్ల పాలనే సాక్ష్యం. రైతుబంధు, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, అనేక సంక్షేమ పథకాలు దేశానికే తలమానికంగా నిలిచినాయి.
దళితులు సంపన్నులుగా ఎదగాలనే సంకల్పంతో ఇచ్చే పది లక్షలు ఏడాది తిరిగే సరికి ఇరువై లక్షలు కావాలనేది కేసీఆర్ ఆకాంక్ష. దళిత బంధుతో తెలంగాణలోని దళితులు తరతరాల వివక్ష, అణిచివేతల నుంచి విముక్తి సాధిస్తారనటంలో అతిశయోక్తి లేదు. వచ్చే నాలుగేండ్లలో దళిత బంధు పథకంతో అద్భుత ఫలితాలు రానున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన మాదిరిగనే, ఎస్సీల అభివృద్ధి కూడా ఉద్యమంలా సాగి విజయవంతమవుతుంది. రాష్ట్ర ప్రత్యేక అవసరాలు, అవకాశాల మేరకే గ్రామీణ ఆర్థికవ్యవస్థ పలు కులవృత్తుల వారికి జీవన భూమికగా మారింది. గ్రామీణ జీవన సౌందర్యాన్ని, గ్రామీణ ఆర్థికవ్యవస్థను ముందుకు తీసుకువెళ్లే విధంగా విధానాలు, ప్రణాళికల రూపకల్పనతో ఇప్పుడు రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. కులవృత్తులకు చేయూతనివ్వడమంటే బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడమే అవుతుంది.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా ఎస్సీ, ఎస్టీ బీసీలు ఇప్పటికీ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడే ఉండటానికి కారణం గత పాలకుల నిజాయితీ లేని తనమే. ఈ లోపాన్ని పూరించటానికి ఇన్నాళ్లకు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిబద్ధతతో కృషిచేస్తున్నది. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి అండగా నిలువాలి. సంక్షేమపాలన పటిష్టంగా, సుస్థిరంగా పదికాలాల పాటు కొనసాగేలా మద్దతు పలుకాలి.
డాక్టర్ సంగని మల్లేశ్వర్
(వ్యాసకర్త: ఫూలే ఆశయ సాధన సమితి (పాస్)-రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు)