ఆర్తితో హరిని పిలిచాడు ప్రహ్లాదుడు. నమ్మకంతో ‘స్వామి ఇక్కడే.. ఈ స్తంభంలోనే ఉన్నాడ’ని చెప్పాడు. మరుక్షణం స్తంభంలో నారసింహుడిగా వెలిశాడు శ్రీమన్నారాయణుడు. హిరణ్యకశిపుని సంహరించాడు. ఉగ్రమూర్తి కాసేపటికి చల్లబడ్డాడు. ప్రహ్లాదుడిని అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. ఆ బాలుడు పెద్దవాడయ్యాడు. నిరంతరం శ్రీమన్నారాయణుడిని ఆరాధిస్తూ, జనరంజకంగా పరిపాలన కొనసాగించాడు. ఓ రోజు పూజా మందిరంలో శ్రీహరి ధ్యానంలో ఉన్నాడు ప్రహ్లాదుడు. అకస్మాత్తుగా ప్రతక్ష్యమయ్యాడు హరి. ‘నాయనా! నీకేం వరం కావాలో కోరుకో’ అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఏం కోరినా స్వామి చిటికెలో ఇచ్చేవాడే. ఆ భక్తాగ్రేసరుడు ఆలోచనలో పడ్డాడు. ఏం అడగాలా అని తటపటాయించాడు. అంతలోనే ‘ఇచ్చేవాడు ఆయన, తీసుకునేది నేను.. నాకు ఏది యోగ్యమో, ఏది అవసరమో స్వామికి తెలియకుండా ఉంటుందా!’ అనుకున్నాడు. ‘స్వామీ! అన్ని వరాలలో ఉత్తమమైనది నాకు అనుగ్రహించు’ అని ప్రార్థించాడు. అప్పుడు నారాయణుడు ‘ప్రహ్లాదా! ఆత్మ సాక్షాత్కారం పొందేవరకు నీలో చక్కని జ్ఞానవిచారం కలుగుగాక’ అని ఆశీర్వదించాడు. తర్వాతికాలంలో జ్ఞాన సముపార్జనతో తరించాడు ప్రహ్లాదుడు. మోక్షత్వాన్ని సాధించాడు.

ప్రహ్లాదునికి స్వామి నేరుగా మోక్షం ఇవ్వగలడు. కానీ, మోక్షప్రాప్తికి కావలసిన జ్ఞానాన్ని కటాక్షించాడు. భక్తులకు ఏది అనుగ్రహించాలో భగవంతుడికి కాక ఎవరికి తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకోలేక.. కోరికల చిట్టాతో యాత్రలకు వెళ్తుంటాం. అనంతమైన అనుగ్రహాన్ని ఊహించలేక స్వల్ప విషయాల కోసం అభ్యర్థిస్తుంటాం. కానీ, భగవానుడి కరుణకు కారణాలుండవు. నిర్హేతుకమైన కృప ఆయనది. అవ్యాజమైన ప్రేమ చూపిస్తాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది.
ద్వాపరయుగంలో కృష్ణ భగవానుడు సాందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశాడు. చదువు పూర్తయ్యాక ‘గురువు గారూ! మీకు ఏం గురుదక్షిణ సమర్పించుకోవాలి. మీరు కోరింది ఇస్తాను’ అన్నాడట కృష్ణుడు. సాక్షాత్తు నారాయణుడే ‘ఏం కావాలో కోరుకో!’ అనేసరికి సాందీపని మహర్షికి ఏం చేయాలో పాలుపోలేదు. ఏ వరం కోరుకోవాలో బుర్రకు తట్టలేదు. వడివడిగా కుటీరంలోకి వెళ్లాడు. భార్యతో విషయం చెప్పి సలహా అడిగాడు. తర్జనభర్జనల తర్వాత కృష్ణుడి దగ్గరికి వచ్చి ‘గతంలో చనిపోయిన నా కుమారుడిని మళ్లీ తెచ్చివ్వండ’ని కోరుకుంటాడు. కొడుకును తెచ్చి ఇచ్చాడు కృష్ణుడు. ఆ సమయంలో సాందీపని ఏది అడిగినా ఇచ్చేవాడు కృష్ణుడు. కానీ, మోక్షత్వం కోరుకోకుండా కొడుకును అడిగాడు. అంతటి మహనీయుడికే ఏం కోరుకోవాలో తెలియనప్పుడు సామాన్యులకు మాత్రం తెలుస్తుందా?
భగవానుడి కృప అనంతం. భక్తుడు ఏం కోరినా ఇచ్చేస్తాడు. కానీ, భక్తులే అప్రాధాన్య కోరికలు కోరి స్వామిని నిరుత్సాహపరుస్తుంటారు. కొండంత దైవాన్ని ఎదురుగా పెట్టుకొని గోరంత కోరికల కోసం ఆశపడటం వెర్రితనమే అవుతుంది. అల్పమైన ప్రాపంచిక విషయాల కోసం, భౌతిక సుఖాల కోసం దైవానుగ్రహాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. దైవానుగ్రహాన్ని పురుషార్థ సిద్ధి కోసం ఉపయోగించుకోవాలి. జ్ఞాన సముపార్జన కోసం అర్థించాలి. జ్ఞానం కలిగినప్పుడు భౌతిక విషయాలపై వ్యామోహం తొలగిపోతుంది. ఏది శాశ్వతమో అది సిద్ధిస్తుంది. లౌకిక జీవితంలో కోరికలు లేకుండా ఉండటం సాధ్యం కాకపోవచ్చు. కానీ, వాటిని తీర్చుకునే ప్రయత్నంలో భగవానుడిని వరాలు కోరుకోనవసరం లేదు. ఆయన పరమ దయాళువు. అడగకనే వరాలు కురిపిస్తాడు. కనిపించకుండానే తోడు నిలుస్తుంటాడు. ఆ సంగతి గుర్తెరిగి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. కర్తవ్యాలను పాటించాలి. తన భక్తునికి ఏ క్షణంలో ఏది అవసరమో స్వామే చూసుకుంటాడు. అడగకుండానే కుచేలుడిని కుబేరుడిగా చేసిన ఉదంతం మనకు తెలిసిందే కదా!
టి.వి.ఫణీంద్రకుమార్