భారత రాజ్యాంగ ఫలాలు అన్నివర్గాలకు అందాలంటే వాటిని అమలుచేసే సమర్థ నాయకత్వం కావాలి. దళితులు, పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగంలో అనేక హక్కులను పొందుపరిచారు.
అంబేద్కర్ ఆశించిన విద్య, వైద్యం, ఆర్థిక స్థిరత్వం, సాంఘిక సమానత్వాన్ని దేశవ్యాప్తంగా సాధించాలంటే ప్రభుత్వాలు జెండాలను పక్కనబెట్టి దళిత ఎజెండాను అమలుచేయాల్సిన అవసరం ఉన్నది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో దళితుల
అభివృద్ధి, సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత సాధికారత కోసం వెయ్యి కోట్లను కేటాయించిన విషయం గమనార్హం. అలాగే ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం అందించేందుకు ‘దళిత బంధు’ను తీసుకురావటం విప్లవాత్మకం. సామాజిక భద్రత, సమానత్వాన్ని పెంపొందించాలనే ధ్యేయంతో దళితుల సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా నిర్దేశించుకున్నది. ఈ క్రమంలో దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి చర్చించుకుందాం.
దళిత, గిరిజన వర్గాల ఐక్య ఉద్యమ ఫలితంగా ఉమ్మడి ఏపీలో దేశంలోనే తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం (2013) వచ్చింది. (కేంద్ర ప్రభుత్వం) బడ్జెట్ కేటాయింపుల్లో ప్లాన్, నాన్‌ప్లాన్ విధానాన్ని రద్దుచేయడంతో సబ్‌ప్లాన్ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సబ్‌ప్లాన్ చట్టాన్ని సవరించి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకాభివృద్ధి నిధుల కేటాయింపు చట్టం-2017ను తెచ్చింది. ఈ చట్టం ద్వారా బ్యాంకులతో సంబంధం లేకుండా దళితుల కోసం భూమి కొనుగోలు పథకాన్ని అమలుచేస్తున్నది. గృహాలకు ఉచిత కరెంటు, విదేశాల్లో ఉన్నత చదువులకు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేస్తున్నది.
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి: ఎస్సీ విద్యార్థుల విదేశీ ఉన్నత విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల సాయాన్ని అందజేస్తున్నది. 60 శాతం మా ర్కులు సాధించిన విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. దీంతోపాటు ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్లకు స్కిల్ అప్‌గ్రేడేషన్ పథకం కింద విదేశీ వర్సిటీల్లో ప్రవేశానికి TOEFL, IELTS, GRE, GMAT వంటి ప్రవేశ పరీక్షల కోసం శిక్షణ ఇప్పిస్తున్నది. అంతేకాకుండా ఉద్యోగార్థులకు ఉపకరించే కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్‌లో సైతం శిక్షణ ఇస్తున్నారు.
ఎస్సీ న్యాయవాదులకు ఆర్థిక సాయం: రాష్ట్రంలో ఏటా ఒక్కో జిల్లాకు 8 మంది న్యాయ పట్టభద్రుల ను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ కాలవ్యవధి మూడేండ్లు. కోర్సు మొత్తానికి రూ 42 వేల సాయం అందిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులను జిల్లా కోర్టుల్లోని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, జిల్లా అసిస్టెంట్ ప్రాసిక్యూటర్లకు అనుసంధానం చేసి కోర్టుల్లో జరిగే ప్రొసీడింగ్స్‌ను తెలుసుకునేలా శిక్షణ ఇస్తున్నారు.
గురుకులాలు: తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో గురుకులాలు విజయవంతంగా నడుస్తున్నాయి. 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకునే అవకాశం పేద విద్యార్థులకు దక్కింది. వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి ఈ సొసైటీ ప్రత్యేక కళాశాలలను నిర్వహిస్తూ, ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నది.
బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం: పోటీని తట్టుకొని ఇతర విద్యార్థులతో సమానంగా నిలబడటానికి 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య ను అందించడం ఈ పథక ప్రధాన ఉద్దేశం. విద్యా ర్థులు ఎంపికచేసిన, అత్యధిక విద్యా ప్రమాణాలు కలిగిన ప్రైవేట్ పాఠశాల్లో చదువుకోవచ్చు. ప్రభుత్వం రెసిడెన్షియల్ విద్యార్థులకు ఏడాదికి రూ.30 వేలు, నాన్ రెసిడెన్షియల్ విద్యార్థులకు రూ.20 వేలు మంజూరు చేస్తుంది. విద్యార్థులు ఇపాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
జోగిని మహిళలకు పునరావాసం: రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో జోగిని, బసవిని, దేవదాసి వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతున్నవి. రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జోగినులకు పునరావాస పథకం అమలుచేస్తున్నది. ఎస్సీ కులాల వారికి మౌలిక సదుపాయాల కోసం కమ్యూనిటీ హాల్స్, అంబేద్కర్ భవనాలను నిర్మిస్తున్నది.
మెట్రిక్ పూర్వ ఉపకార వేతనాలు: డ్రాపౌట్లను నివారించడానికి ప్రభుత్వం డే స్కాలర్ ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని అమలుచేస్తున్నది. 5 నుంచి 8వ తరగతి చదివే బాలురకు నెలకు రూ.100, బాలికలకు రూ.150, 9, 10వ తరగతి డే స్కాలర్ విద్యార్థులకు నెలకు రూ.225, హాస్టల్ విద్యార్థులకు రూ.350 చొప్పున 10 నెలల పాటు చెల్లిస్తున్నది. సఫాయి కార్మికుల పిల్లలకు డే స్కాలర్ 1 నుంచి 10వ తరగతి వరకు నెలకు రూ.110 లు చెల్లిస్తున్నది. ఇవేకాకుండా ప్రతి విద్యార్థికి ఏటా అడ్‌హక్ గ్రాంట్ కింద రూ.750 మంజూరు చేస్తున్నది. మెట్రిక్ అనంతరం ఉపకారవేతనాలు కూడా అందిస్తున్నది.
కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు: కులవ్యవస్థను నిర్మూలించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నది. పెండ్లి చేసుకున్న వధూవరులకు రూ.2.50 లక్షల ఆర్థికసాయాన్ని అందిస్తున్నది. ఈ మొత్తాన్ని భార్యాభర్తల పేర ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వారి భవిష్యత్తుకు అండగా నిలుస్తున్నది.
ఎస్సీ కార్పొరేషన్: 1974 నుంచి ఎస్సీల ఆర్థికాభివృద్ధి కోసం ఎస్సీ కార్పొరేషన్ కొనసాగుతున్నది. భూమి లేని దళిత వ్యవసాయాధారిత కుటుంబాలకు భూమి కొనుగోలు పథకం, విద్యావంతులైన నిరుద్యోగ యువత కోసం ఉపాధి ఆధారిత నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నది.
స్వయం ఉపాధి పథకాలు: ప్రభుత్వం బ్యాంక్ లింకేజీ పథకం కింద రూ.12 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది. లక్షకు 80, 2 లక్షలకు 70, 5 లక్షలకు 60 శాతం సబ్సిడీ ఇస్తున్నది. డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకం కింద టాక్సీ కార్లను అందిస్తున్నది.
ఇలా.. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ప్రభుత్వం దళిత వర్గాల అభ్యున్నతి, అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూనే ఉన్నది. కేవలం హుజూరాబాద్‌లో ఎన్నికలో లబ్ధి పొందేందుకే ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకాన్ని ప్రవేశపెడుతున్నదని అవాకులు చెవాకులు పేలుతున్న ప్రతిపక్షాలు గతంలోకి వెళ్లి దళిత సంక్షేమ పథకాలను పరికించి చూస్తే అర్థమవుతుంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రారం భిస్తున్న ఈ పథకాన్ని దళితులు సద్వినియోగం చేసుకోవాలి. తద్వా రా అన్నిరంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.
(వ్యాసకర్త: ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, సిద్దిపేట)
పి.శంకర్