ఆర్థిక, సామాజిక, అసమానతల దూరాలను చెరిపేందుకు అనేక విప్లవ, అభ్యుదయ, సామాజిక, సంస్కరణ వాదాలు, ఉద్యమాలు జరిగిన నేల తెలంగాణ. ఇందుకోసం ఎన్నో విలువైన నిండు జీవితాల రక్తార్పణలతో తెలంగాణ ప్రాంతం ఏండ్ల తరబడి గర్భశోకం అనుభవించింది. దళిత, నిమ్నజాతుల ఉద్ధరణ కోసం సామాజిక బాధ్యతతో జరిగిన పెద్ద యుద్ధం ఇది. దీంతో సామాజిక చైతన్యం పెరిగింది కానీ, దళితవర్గం ఎదగాల్సినంత ఎదగలేదు. తాత్కాలికంగా దున్నుకున్న భూములు మినహా శాశ్వతంగా దళితులకు భూమిపై హక్కులు పొందే మార్గం కలగలేదు. ఈ పోరాటాలు సంస్కరణవాదానికి దోహదపడ్డాయి తప్ప దళితులకు ప్రత్యేక ప్రయోజనాలను చేకూర్చలేదు. ఇదొక పార్శం.
దేశంలో అనేక ప్రాంతాల్లో దళితులపై అమానుష దాడులు కొనసాగుతున్నాయి. ఉత్తరభారతంలో బుల్లెట్ బైకుపై వెళ్లిన కారణంగా ఒక దళిత యువకున్ని దారుణంగా హతమార్చినటువంటి సంఘటనలను చూస్తున్నాం. దేశంలో అనేకచోట్ల చుండూరు, కారంచేడు లాంటి ఘటనలు భరతమాత గుండెలపై కుంపటిలా మంటలు రేపుతూనే ఉన్నాయి. ఈ సందర్భంలో కేసీఆర్ తీసుకున్న ‘దళిత బంధు’ పథకాన్ని దళిత సమాజం స్వాగతిస్తున్నది. గుండె నిండా మురిసిపోతున్నది.
తరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో అనేక ప్రయోజనాలను పొందుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం 235కు పైగా కొత్త రెసిడెన్షియల్ స్కూళ్లలో దళిత పిల్లలకు విద్యావకాశాలను పెంచింది. సోషల్ వెల్ఫేర్ పాఠశాలల ద్వారా దళిత విద్యార్థులకు లబ్ధి చేకూరుతున్నది. సంక్షేమ పథకాలన్నింటిలో దళితులు, బీసీలే అధిక శాతంగా ఉన్న విషయాన్ని కాదనలేం.
ఏడు దశాబ్దాలు దాటిన స్వతంత్ర భారతంలో దళితులు, పేదలంటే వేరుకాదనే పరిస్థితులు ఇంకా మారలేదు. దేశాన్ని, రాష్ర్టాన్ని అనేక రాజకీయపార్టీలు పరిపాలించినా, రిజర్వేషన్లు కొనసాగుతున్నా దళితుల ఉద్ధరణ పట్ల పాలకులకు చిత్తశుద్ధి లేని కారణంగా ఆ వర్గాల జీవన ప్రమాణాలు ఏ మాత్రం పెరగలేదు. వాళ్లపట్ల ఎవరికీ హృదయపూర్వక ప్రామాణికమే లేదు. ఆర్థిక స్వావలంబన లేకుండా సామాజిక సమానత్వాన్ని ఏ వ్యవస్థ సాధించలేదు. ఈ విషయాన్ని అన్ని సిద్ధాంతాలు, మ్యానిఫెస్టోలు అంగీకరిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న నాగరిక సమాజంలో ఇంకా ఎందరో అభాగ్యులుగా అట్టడుగున ఉండటం ఏ మాత్రం సమంజసం కాదు.
అనేక అవమానాలు, అసమానతలను శాశ్వతంగా దూరం చేసుకునేందుకు సుదీర్ఘ పోరాటాలతో తెలంగాణను సాధించుకున్నాం. 1969 ఉద్యమం నేర్పిన పాఠాలు, తెలంగాణ సాధించుకోవాలనే గుండెల నిండా ఆశయం.. ప్రజాస్వామిక పంథాలోనే అది సాధ్యమవుతుందనే దృక్పథంతో నడుం బిగించిన కేసీఆర్ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి స్వరాష్ట్రం సిద్ధించేవరకు ఒక్కడై నిలబడ్డారు. ఫలితంగా రాష్ట్ర సాధన సాధ్యమైంది. రాష్ట్ర సాధనతోనే తెలంగాణ ప్రజల కష్టాలకు విముక్తి దొరకదనే నిర్ణయంతో కేసీఆర్ నిరంతర మేధో మథనం చేశారు. తెలంగాణ నేల గాథలు, ప్రజల దుఃఖాలు, బాధలు తెలిసిన కేసీఆర్ బంగారు తెలంగాణ సాధనకు నడుం బిగించారు. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం చేసిన నాటినుంచే తెలంగాణ నేల తల్లిని నీళ్లతో తడిపేందుకు తపనపడ్డారు. ఎవరూ సహకరించకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిచూపారు. ఫలితంగా ఇవాళ తెలంగాణ ఇంచు మిగలకుండా తడిసి అదనంగా కోటి ఎకరాలు సాగవుతున్నది. పంజాబ్‌ను మించి తెలంగాణ ధాన్యం సాగుబడిలో పతాకస్థాయికి ఎదిగింది. కరెంటు కష్టాలు తీరాయి. ఐటీరంగ అభివృద్ధి, ప్రభుత్వరంగ పరిశ్రమల పురోభివృద్ధి కండ్లముందు కనపడుతున్న వాస్తవం. ‘కల్యాణలక్ష్మి’ నుంచి ‘కేసీఆర్ కిట్’ దాకా సంక్షేమ పథకాల అమలుకు తెలంగాణ కార్యక్షేత్రమైంది. కులాలు, మతాలు, వృత్తులు, విభిన్న అవసరాలను గుర్తించిన కేసీఆర్ చేతివృత్తుల వాళ్లకు పెద్దన్నగా పథకాలను అమలుచేస్తున్నారు. ఈ క్రమంలోనే తరతరాల అణచివేతలో మగ్గిపోతున్న దళితజాతిని పైకి తీసుకువచ్చేందుకు అమలుపరుస్తున్న పథకమే ‘దళిత బంధు’. ఇదొక సంస్కరణ విప్లవం. రెండు, మూడేండ్ల అంతర్మథనం తర్వాత జనాభాలో 18 శాతానికి పైగా ఉన్న దళితవర్గాలకు శాశ్వత స్వావలంబన కోసం కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఇది. ఇంతటి మహత్తర కార్యాన్ని స్వాగతించకుండా రాజకీయరంగు పులమడం కంటే నీచత్వం మరొకటి ఉండదు.
ఒక దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వడం అసాధ్యం, ఇవ్వలేరు, ఇది జరగదు, బడ్జెట్ సరిపోదంటూ విమర్శలు చేయడం నిరాశావాదం, ఈర్ష్యావాదం తప్ప మరొకటి కాదు. ‘నీచ మానవులు ఆరంభించరు.. ధీరులు లక్ష్యం చేరేవరకు పోరాడుతారు..’ అని కేసీఆర్ పదేపదే చెప్తున్నట్టు ఆయన ప్రవేశపెట్టిన ఏ పథకమూ అమలుకాకుండా పోలేదు. తెలంగాణలో దళితులు ఎంతమంది ఉన్నారు, ఎందరికి ‘దళిత బంధు’ పథకం చేరుతుందని ఆర్థికగణంకాలకు పరిమితం చేసిచూడటం కురుసతనమవుతుంది.
ఈ పథకం దేశంలోని అన్ని రాష్ర్టాల దళిత సోదరలకు ఒక భరోసా కాబోతున్నదనేది వాస్తవం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ, జాతీయపార్టీలు దళితబంధు పథకానికి సరితూగే, దళిత ప్రయోజనాల పథకాలను రచించుకోవాల్సిన స్థితిని కేసీఆర్ ‘దళిత బంధు’ పథకం ద్వారా జాతీయ దళిత ఎజెండాను ఒక జెండాగా ముందుకుతెచ్చారు.
పాలకుల పథకాలన్నీ సదుద్దేశంతోనే ప్రారంభమవుతాయి. కానీ వాటి అమలులో విజయాలు, అపజయాలుంటాయి. దళితబంధును, దళిత అభ్యున్నతిని కాంక్షించే వర్గాలన్నీ ఈ పథకం అమలుకు సహకారం అందించాలి. దేశంలో అనేక ప్రాంతాల్లో దళితులపై అమానుష దాడులు కొనసాగుతున్న సందర్భం. ఉత్తరభారతంలో బుల్లెట్ బైకుపై వెళ్లిన కారణంగా ఒక దళిత యువకున్ని దారుణంగా హతమార్చినటువంటి సంఘటలను చూస్తున్నాం. దేశంలో అనేకచోట్ల చుండూరు, కారంచేడు లాంటి ఘటనలు భరతమాత గుండెలపై కుంపటిలా మంటలు రేపుతూనే ఉన్నాయి. ఈ సందర్భంలో కేసీఆర్ తీసుకున్న ‘దళిత బంధు’ పథకాన్ని దళిత సమాజం స్వాగతిస్తున్నది. గుండె నిండా మురిసిపోతున్నది.
ఈ పథకం ద్వారా రెం డో, మూడో లక్షలు ఇస్తే దుర్వినియోగమయ్యే ప్రమా దం ఉండేది. రూ.10 లక్షలు ఒక దళిత కుటుంబాన్ని నిజంగా ఆర్థిక స్వావలంబనవైపు నడిపించే అవకాశం ఉన్నది. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 లక్షలకు 2, 3 ఎకరాల భూమి లభించే పరిస్థితులు లేకపోలేదు. ఇంటిస్థలం ఉన్న దళితులు రూ.5 లక్షలతో ఇల్లు, మరో రూ.5 లక్షలతో ఉపాధి ఏర్పాటుచేసుకునే అవకాశం ఉన్నది. ప్రభుత్వ పథకాలు పొందేందుకు గతంలో అనేక ఆంక్షలు, అడ్డంకులుండేవి. చాలా సందర్భాల్లో అవి అందని ద్రాక్షలే. దళితబంధు పథకం ద్వారా సరాసరి కుటుంబ యజమానురాలైన దళిత సోదరి ఖాతాలోకి రూ.10 లక్షలు చేరేవిధంగా రూపొందించారు. గతంలో పథకాలకు సబ్సిడీలలో శాతాలు, కోతలుండేవి. కానీ ఈ పథకంలో అలాంటివేమీ లేవు. తిరిగి చెల్లించాల్సింది లేదు. ఉపాధి ఎంపిక విషయంలో కూడా లబ్ధిదారులకు సంపూర్ణ స్వేచ్ఛను ఇచ్చింది ప్రభుత్వం. రాష్ట్ర సాధన ఎంత గొప్పదో, ‘దళిత బంధు’ పథక రూపకల్పన అంత గొప్పది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందినవారు రూ.10 వేలు దళిత రక్షణ నిధికి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా మరో రూ.10వేలు జమచేస్తుంది. ఇబ్బందుల్లో ఉన్న దళితులను ఈ నిధి ఆదుకునే అవకాశం ఉంటుంది. ఇంతటి దూరదృష్టితో దళితుల అభ్యున్నతి పట్ల గుండెనిండా ప్రేమతో కేసీఆర్ అమలుచేస్తున్న పథకం దళిత బంధు. ఈ పథకంతో పాటు దళిత బీమా పథకం అమలుకోసం కూడా కేసీఆర్ ప్రయత్నం చేయడం మహోన్నతం.
తరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో అనేక ప్రయోజనాలను పొందుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం 235కు పైగా కొత్త రెసిడెన్షియల్ స్కూళ్లలో దళిత పిల్లలకు విద్యావకాశాలను పెంచింది. సోషల్ వెల్ఫేర్ పాఠశాలల ద్వారా దళిత విద్యార్థులకు లబ్ధి చేకూరుతున్నది. సంక్షేమ పథకాలన్నింటిలో దళితులు, బీసీలే అధిక శాతంగా ఉన్న విషయాన్ని కాదనలేం. అన్ని సామాజిక వర్గాలను ఆర్థికంగా ఉన్నతికి చేర్చటం కఠినమైనప్పటికీ అందుకోసం అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దళిత బాం ధవుడు, ప్రజా బాంధవుడు అనటంలో అతిశయోక్తి ఏమున్నది. అంబేద్కర్ కలలుగన్న దళిత అభ్యున్నతికి తెలంగాణ గడ్డనే కార్యక్షేత్రం కావడం మనందరికి గర్వకారణం.
ఇంతటి మహత్తర, మానవీయ పథకాన్ని హుజూరాబాద్ ఎన్నికల రాజకీయాలకు ముడిపెడుతున్న విపక్షాల వాదనలు ఎంత సంకుచితమైనవో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. స్వప్నం.. సాకారం ఇప్పటిది కాదు. దళితబంధు ఆలోచనలు, ప్రణాళికలు గతంలోవే. గత ఫిబ్రవరి 10న నల్గొండ జిల్లా హాలియా, నెల్లికల్ల లిఫ్ట్ శంకుస్థాపన సందర్భంగా జరిగిన బహిరంగసభలో కేసీఆర్ దళితబంధును ప్రకటించారు. అదే నెల 18న మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన ఎస్సీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ప్రభుత్వం తీసుకురానున్న దళిత ఎంపవర్మెంట్ (దళిత సాధికారత) పథకంలో ఏయే అంశాలు చేర్చాలనే విషయంపై అక్కడ మేధోమథనం చేశారు. మార్చి 11న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ప్రసంగించిన సందర్భంలో దళిత ఎంపవర్మెంట్కు రూ.1000 కోట్లు కేటాయించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
మార్చి 27న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు సీఎం సమాధానంగా దళిత ఎంపవర్మెంట్ మీద అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశం పెడతామని ప్రకటించారు. జూన్ 28న ప్రగతిభవన్‌లో అన్నిపార్టీల నాయకులతో దళిత ఎంపవర్మెంట్పై పదిన్నర గంటల పాటు చర్చించారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల పథకం ప్రకటించారు. ఈ సమావేశంలో అన్ని రాజకీయపార్టీల దళిత ప్రతినిధులు పాల్గొని హర్షం వ్యక్తంచేశారు. జూలై 19న ప్రగతిభవన్‌లో దళిత సాధికారత అమలు తీరుపై ఆరుగంటల పాటు సమీక్ష జరిగింది. పథకానికి నామకరణం కూడా ఆరోజే ఖరారైంది.
కేసీఆర్ చిత్తశుద్ధిపై తెలంగాణ ప్రజానీకానికి కించిత్ అనుమానం లేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం, తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రజలు అన్ని సందర్భాల్లో ఆశీర్వదిస్తున్నారు. దళితబంధు విషయంలో కూడా కేసీఆర్ సంకల్పం నెరవేరుతుందనే విశ్వాసం ప్రజల్లో ఉన్నది. ఈ పథకం ద్వారా దళితజాతి రుణం తీర్చుకుందాం. కేసీఆర్‌కు అండగా నిలుద్దాం.
(వ్యాసకర్త: రామగుండం శాసనసభ్యులు)
కోరుకంటి చందర్