దేశ స్వాతంత్య్రం కోసం శాంతిమార్గంలో పోరాడిన మహాత్మా గాంధీ ఒకవేళ నేడు ఉండి ఉంటే ఆయననూ విమర్శించేవారేమో కొందరు దిగజారిన రాజకీయ నాయకులు. అరువై ఏండ్ల ఆకాంక్ష కోసం ఉద్యమాన్ని తన భుజాన మోసి రాష్ర్టాన్ని సాధించిన తెలంగాణ ప్రదాత కేసీఆర్. ఆయన పట్ల రాష్ట్ర ప్రజలకు అపారమైన గౌరవం ఉన్నది. అందుకే రెండోసారి అధికారపీఠాన్ని ఎక్కించారు. ఇది మింగుడుపడని ప్రతిపక్షాలు ప్రభుత్వ సుపరిపాలనా విధానాలను మసకబార్చేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నాయి. వీటిని గమనిస్తున్న ప్రజలు ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలకు కర్రుకాల్చి వాతలు పెడుతున్నా.. వాటి వైఖరి మారడం లేదు.
భగీరథుడు దివి నుంచి భువికి గంగను తెచ్చాడని పుస్తకాల్లో చదివాం. కానీ, ఉక్కు సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణకు తరగని సంపదగా మార్చా రు కేసీఆర్. బీడు భూములకు నీరందించి సస్యశ్యామలం చేశారు. సంపదను ద్విగుణీకృతం చేశారు. వాస్తవాన్ని అంగీకరించని ప్రతిపక్షాలు ప్రజలకు తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నాయి. రికార్డుస్థాయిలో ధాన్యాన్ని పండించి దేశానికే ధాన్యాగారంగా నిలిచింది తెలంగాణ. రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టడంపై కేసీఆర్ను ఐక్యరాజ్యసమితి సైతం ప్రశంసించింది. ఈ విష యాన్ని ప్రతిపక్షాలు గుర్తించకపోవడం బాధాకరం. పలు సంక్షేమ పథకాలతో పాటు యువతకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. దీంతో ప్రభుత్వంపై పోరాడేందుకు ప్రతిపక్షాలకు సమస్యలే దొరకకుండా పోయాయి.
రాష్ట్రంలో టీఎస్ఐపాస్ ద్వారా పరిశ్రమలు స్థాపించే పెట్టుబడిదారులకు సులువుగా అనుమతులు లభిస్తున్నాయి. తద్వారా రాష్ట్ర ఆవిర్భావ అనంతరం వందలాది పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడం కేసీఆర్ పాలనకు గీటురాయి. ఈ క్రమంలో స్థానిక యువతకే ఉద్యోగం, ఉపాధి లభించాలనే కేసీఆర్ ధ్యేయం నెరవేరుతున్నది. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలు అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్నాయి.
దళితుల సాధికారత కోసం కేసీఆర్ బృహత్తర ‘దళితబంధు’ పథక అమలుకు శ్రీకారం చుడితే కాంగ్రెస్, బీజేపీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తుండటం విడ్డూరం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఉండాలి. ప్రభుత్వ లోపాలు ఎత్తిచూపుతూ నిర్మాణాత్మకమైన సూచనలు చేయడమే ప్రతిపక్షాల పాత్ర. అంతేకానీ వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ వైఖరి మార్చుకోవాలి.
గొప్ప విజన్ కలిగిన కేసీఆర్ అధికారం చేపట్టి సం క్షేమం, అభివృద్ధిని జోడు గుర్రాలుగా పరుగెత్తిస్తున్నారు. ఇది జీర్ణించుకోలేని విపక్షాలు వింతపోకడను ప్రదర్శి స్తున్నాయి. పాదయాత్రల పేరిట ప్రజల్లో స్థానం సంపా దించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రజలు అంత అమాయకులేం కాదు. ప్రజల ముందు ప్రతిపక్షాల కుప్పిగంతులు చెల్లని రూపాయి వంటివే.
రాష్ట్రంలో ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పాలన కొనసాగుతున్నది. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అమ లు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు ప్రజాదరణను చూరగొంటున్నాయి. ఇప్పుడు ప్రతి గడపన, ప్రతి గుండెలో కేసీఆర్ కొలువైఉన్నారు. ఇది మింగుడుపడని విపక్షాలు కేసీఆర్ వ్యక్తిత్వాన్ని పలుచన చేయడానికి అసత్య ఆరోపణలు చేస్తున్నాయి. కానీ వీటిని నమ్మేదెవరు! తెలంగాణ గాంధీ కేసీఆర్పై ఎవరెన్ని అపవాదులు మోపినా ప్రజలే తిప్పికొడతారనడంలో సందేహం లేదు. కాబట్టి ప్రతిపక్షాలు ఇకనైనా తమ వికృతచేష్టలకు స్వస్తి పలకాలి. లేకుంటే ప్రజలే బుద్ధిచెబుతారు.
ఎన్.శుభప్రద్ పటేల్