తెలంగాణ స్వరూప స్వభావాలు మారడానికి, అపూర్వ చైతన్యం వెల్లివిరియడానికి గడిచిన ఏడేండ్లలో జరిగిన, ఇంకా జరుగుతున్న మహత్తర, అద్భుత కృషిని, అకుంఠిత ప్రగతిని గమనించినప్పుడు యాభై ఏండ్ల కిందటి దైన్యస్థితిని, వెనుకబాటుతనాన్ని, దారిద్య్రాన్ని ఊహించడం కష్టం కాదు. రష్యాకు వెళ్లడం సులభం, రామప్పకు వెళ్లడం కష్టమైన రోజులవి. ఎన్నడో సమ్మక్క జాతర జరిగినప్పుడు నేల ఈనినట్లు లక్షలమంది పోగయ్యే ఆ ప్రాంతం ఇతర సమయాల్లో నిర్మానుష్యం; అప్పటికి ఇంకా తీవ్రవాదం బెబ్బులి ఆ అడవిలో జొరబడి భయపెట్టలేదు.
కాకతీయ పాలకులు భక్తి వల్ల, మత ప్రచార లక్ష్యంతో విరివిగా దేవాలయ నిర్మాణాలకు పూనుకున్నారు. తాము నిర్మింపజేయటమే కాక ఇతరులను ప్రోత్సహించారు. పాలకులను అనుసరించి అనేకులు ఉప పాలకులు, సేనాపతులు, ధనిక వర్గాల వారు కూడా ఆలయ నిర్మాణాలు చేయించారు.
వరంగల్ పట్టణంలో ఉంటున్న కొందరు మిత్రులం యాభై ఏండ్ల కిందట ఓ రోజు స్కూటర్ల మీద రామప్ప గుడి చూడటానికి బయల్దేరాం. అప్పటి ములుగు తాసిల్దార్, డిప్యూటీ తాసిల్దార్ మా మిత్రులలో ఒకతనికి సన్నిహితులు. అందువల్ల ములుగులో ఎటువంటి ఇబ్బంది జరగలేదు. రామప్ప వెళ్లిన మిత్రులలో ఒకతను నెల్లుట్ల వెంకటేశ్వరరావు ఆయన వెటర్నరీ డాక్టర్ (వరంగల్లు సమీపంలోని కాపుల కనపర్తివాడైనా, తిరుపతి విశ్వవిద్యాలయంలో వెటర్నరీ లెక్చరర్), కవి, రచయిత. వరంగల్లు వాడే మరో నెల్లుట్ల వెంకటేశ్వరరావు కాకతీయ వారపత్రికలో తిక్కన ఉద్యోగ పర్వంపై వివరమైన ఆర్టికల్ రాసి ప్రసిద్ధుడైనాడు. పొద్దున్నే రామప్ప ఆలయం ఆవరణంలో అడుగుపెట్టి ఆ అద్భుత, శృంగార విలసిత శిల్ప సౌందర్యాన్ని చూడగానే కవి వెంకటేశ్వరరావు ‘అడవి రతనంబు రామప్ప ఆలయంబు’ అంటూ మధురమైన కొన్ని పద్యాలను ఆశువుగా చదివాడు. నాడు రామప్ప గుడికి వెళ్లిన మిత్రబృందంలో ఒకతను నవీన్చంద్ర, ఓయూ సైన్స్ కాలేజీలో గోల్డ్ మెడలిస్టు, స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు, తర్వాత జియాలజీ ప్రొఫెసర్గా కెనడాలో స్థిరపడ్డాడు, మరో మిత్రుడు 1969-70 తెలంగాణ ఉద్యమం సమయాన అమోస్, కమతం రామకృష్ణారెడ్డి తర్వాత తెలంగాణ ఎన్జీఓల సంఘం రాష్ట్రస్థాయి అధ్యక్షుడు.
కవి వెంకటేశ్వరరావుకు అది కొత్త కాదు. ఓయూ తెలుగు ఉత్సవాల్లో ఆయన కవితాగానం విని ముగ్ధులైనవారు ఎంతోమంది. మొగలె ఆజం, నయాదౌర్ వంటి హిందీ సినిమాలు చూసి థియేటర్ బయటికి వస్తుండగానే ఆ హిందీ సినిమాల పాటల తెలుగు అనువాదాలను మాకు విన్పించి చకితులను చేసిన చతుర కవి వెంకటేశ్వరరావు. ఆయన, మరో మిత్రుడు అవురుపల్లి మురళీధరరావు (ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలోని స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్న మిత్రుడు), నేను రాసిన కొన్ని కవితల సంకలనాన్ని ‘పారిజాతాలు’ పేరిట ఓయూలో ఉన్నప్పుడు ప్రచురించాం. మా పారిజాతాల సంకలనానికి పీఠిక రాస్తూ ఆరుద్ర మా కవిత్వాన్ని మెచ్చుకున్నాడు. ‘పారిజాతాలు’ కవితా సంకలనాన్ని చూసి కుందుర్తి నాతో ‘ఇదేం కవిత్వమోయ్’ అని వ్యంగ్యంగా అన్నాడు. కుందుర్తి రచనల సమగ్ర సంకలనం రాపర్ వ్యాఖ్యను రాసింది నేనే మరి. ఆ వ్యాఖ్య కుందుర్తికి బాగా నచ్చింది. వెంకటేశ్వరరావు కవిత్వాన్ని చివరి క్షణం వరకు వదిలిపెట్టలేదు, సిగరెట్లను కూడా వదలిపెట్టలేదు. సిగరెట్లకే వెంకటేశ్వరరావు చివరికి బలైనాడు.
రామప్ప గుడి గురించి మాట్లాడుతున్నప్పుడు యాభై ఏండ్ల కిందట మిత్రుడు చలసాని ప్రసాద్ రచించిన ‘కాకతీయ శిల్పం’ గ్రంథం జ్ఞాపకం రావడం సహజం. ప్రసాద్ తెలుగులో రాసిన ఈ గ్రంథం ఆంగ్లంలో కూడా ప్రచురితమైంది. ఇదొక కళాకారుని దృష్టితో వివరంగా రాసిన గ్రంథం. రవీంద్రనాథ్ ఠాగూర్ శతజయంతి సందర్భాన నేను, ప్రసాద్ కలిసి రాసిన ‘రవి కథ’కు రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి ఇవ్వాలని న్యాయమూర్తులు తాపీ ధర్మారావు, గిడుగు సీతాపతి, చక్రపాణి (విజయా ఫిలివ్ నిర్ణయించారు. కానీ, కమిటీ వారు మరొకరికి బహుమతి ఇచ్చారు. కమిటీ నిర్ణయాన్ని వివరించడానికి ఇది సమయం, సందర్భం కాదు. ప్రసాద్ తర్వాత రెండు మాసపత్రికల, ‘కళ’ ప్రత్యేక సంచికల ప్రముఖ సంపాదకుడు. మిత్రుడు ప్రసాద్ రాసిన కాకతీయ శిల్పం గ్రంథంలోని ఈ కింది వాక్యాలు గమనార్హమైనవి ‘కాకతీయుల పాలనాకాలంలో రూపొందిన ఈ శిల్ప సంపదలో చిత్రిత వస్తువులో, నిర్మాణ వైఖరిలో ఏకత్వం ప్రముఖంగా కానవస్తుంది.
నేడు అసంఖ్యాకంగా మనముందున్న ఈ శిల్పసంపదలో ఏ ఒక్క దానిని విడిగా చూసినా ‘ఇది కాకతీయుల కాలపుదిలా ఉందే’ అని అనిపింపజేస్తున్నదంటే దాని అర్థం నాటి శిల్పులు తమ కళాసృష్టి అంతటా తమదని చూపుకో గల ప్రత్యేకతనూ, సారూప్యతనూ ప్రతిభావంతంగా ప్రదర్శించారన్న మాట.. నాడు దేవాలయ నిర్మాణం ఒక ఉద్యమంలా కొనసాగింది. ఆర్థికవ్యవస్థను బాగుపరిచే ప్రయత్నంలో ఎక్కడైనా ఓ చెరువు నిర్మింపబడినా, ఓ కాలువ తవ్వబడినా అక్కడ ఒక ఆలయాన్ని నిర్మింపజేయడం కాకతీయుల కాలంలో సర్వసాధారణమైంది. కాకతీయ పాలకులు భక్తి వల్ల, మత ప్రచార లక్ష్యంతో విరివిగా దేవాలయ నిర్మాణాలకు పూనుకున్నారు. తాము నిర్మింపజేయటమే కాక ఇతరులను ప్రోత్సహించారు. పాలకులను అనుసరించి అనేకులు ఉప పాలకులు, సేనాపతులు, ధనిక వర్గాల వారు కూడా ఆలయ నిర్మాణాలు చేయించారు. నేడు మనముందున్న కాకతీయుల నాటి శిథిలాలను గమనిస్తే నాడు ప్రతి మండలంలోను సర్వాలంకార శోభితమైన ఆలయాలు, కట్టడాల నిర్మాణం లక్ష్యమైందని అర్థమౌతుంది’.
దేవులపల్లి ప్రభాకరరావు