కేసీఆర్‌ను విమర్శించడమే వ్యూహం అనుకునేవాళ్లకు ఏ కారణం అవసరం లేదు. బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా అభివృద్ధికి గండికొట్టి తద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనుకునే ఈ నాయకులు ఎన్ని పాదయాత్రలు చేసినా, పొర్లు దండాలు పెట్టినా ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించలేరు.
ప్రతిపక్ష పార్టీల్లోని నాయకులు నేనంటే నేను పాదయాత్ర చేస్తానని మీడియా ముఖంగా ప్రగల్భాలు పలుకుతున్నారు. కొంతమంది యాత్రల తేదీలు ప్రకటించడం, స్పందన లేక మార్చుకోవడం, ప్రజల్లో పలుచనవుతామేమోనని మళ్లీ షెడ్యూళ్లు ప్రకటించడం జరుగుతున్నది. ఈ మధ్యే ఆత్మరక్షణ కోసం బండెక్కి, పువ్వెట్టుకుని, ఆత్మగౌరవ పరిరక్షణ నినాదంతో ఆర్భాటంగా పాదయాత్ర మొదలుపెట్టి అనుకున్న రీతిలో సాగక యాత్రను మధ్యలోనే ఆపిన తీరు చూస్తున్నం.ఈ పాదయాత్రలకు సొంత పార్టీల్లోనే ఆదరణ కరువవడం, శ్రేణుల్లో ఆసక్తి లేకపోవడం.. ఇవన్నీ చూస్తుంటే రాబోయే కాలంలో కాబోయేపాదయాత్రలన్నీ పసలేని, ప్రజాప్రయోజనంలేని యాత్రలుగా
తేలిపోవడం ఖాయం.
కార్యకర్తలే తప్ప ప్రజలు లేని యాత్రలు, కుర్చీపై ధ్యాసే కానీ ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేని నాయకులు యాత్రలంటూ బయల్దేరుతున్నారు. అధికారంపై యావతో ఉన్న డొల్ల నాయకత్వం పట్ల సదరు పార్టీల్లోని శ్రేణుల్లోనే నిరాసక్తత వ్యక్తమవుతున్నది.
పార్టీలేవైనా, లక్ష్యం రాజకీయాధికారమైనా, గతంలో పాదయాత్రలు చేసి ప్రభుత్వాలు స్థాపించిన నాయకులకు ఉన్న నేపథ్యం, పలుకుబడి, అనుభవం ఇప్పటి నేతలకు లేదు. ఒకస్థాయి ఉన్న నాయకులే సదరు యాత్రలు చేస్తారనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో, గాలివాటంగా రాజకీయాల్లో ఉన్నత పదవులను సంపాదించుకున్న కొంతమంది స్వలాభం కోసం, తమ స్థానాన్ని పదిలపరచుకోవడం కోసం చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రజా సమస్యలపై, పరిపాలన సంబంధ విషయాల్లో కనీస పరిజ్ఞానం లేని కొంతమంది సోషల్ మీడియా సాయంతో పులులు అవుదామనుకుంటున్నందున ఈ పాదయాత్రల పట్ల ప్రజల్లో ఏవగింపు ఏర్పడుతున్నది.
గతంలో పాదయాత్రలు చేసి ముఖ్యమంత్రులు కాగలిగిన నాయకుల నేపథ్యం, ఆ సమయంలో ఆయా రాష్ర్టాల్లో ఉన్న పరిస్థితులు వేరు. మౌలిక వసతుల లేమి, పాలనాపరమైన కుంగుబాటు, వివిధరంగాల్లో వెనుకబాటుతో పాటు సామాన్య మానవుని జరుగుబాటు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులున్నపుడు జరిగిన పాదయాత్రలు వారికి ఫలితాన్నిచ్చాయి. మరిప్పుడు తెలంగాణలో ఏ అంశాల ప్రాతిపదికన పాదయాత్రల ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయనేది ఆ పార్టీలు, నేతలే చెప్పాలి. పాలకపక్షాన్ని నిలదీయడానికి స్పష్టమైన అంశాల్లేని పరిస్థితుల్లో స్వోత్కర్ష, పరనింద అనే ద్విసూత్ర ప్రయోగమే దిక్కని వ్యవహరిస్తున్న ప్రతిపక్ష నాయకుల తీరు ప్రజా బాహుళ్యంలో ఆయా పార్టీల ప్రతిష్ఠను మరింత దిగజారుస్తుందనడంలో సందేహం లేదు.
వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్, మౌలిక వసతుల రంగం, పరిశ్రమల ఏర్పాటు, ఐటీ ఎగుమతులు, నూతన పెట్టుబడుల ఆకర్షణ, నూతన ఆవిష్కరణలు, ప్రజా సంక్షేమం, వెనుకబడిన, మైనారిటీ వర్గాల అభివృద్ధి, కులవృత్తులకు ప్రోత్సాహం, రైతు సంక్షేమం, ఆరోగ్య రంగంలో వసతుల కల్పన, పర్యావరణం, పల్లెల పట్టణాల ప్రగతి తదితర అంశాల్లో, ఏ రంగం చూసినా విమర్శలకు తావులేని రీతిలో అభివృద్ధి దిశగా ముందుకుపోతున్నది. కరోనా నేపథ్యంలో, క్లిష్ట పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో కూడా రాష్ట్ర స్థూల ఉత్పత్తి మొదలుకొని, తలసరి ఆదాయం వరకు అన్ని సూచీలు జాతీయ సగటులను మించి ఉన్నాయి. ఈ విషయాలు పార్లమెంటు సాక్షిగా నిర్ధారితమవుతున్నాయి. ‘పాదయాత్రలు చేస్తాం ప్రభుత్వాన్ని నిలదీస్తాం’ అంటున్న నాయకులు పై అంశాలకు సంబంధించి ప్రజలు సంధించబోయే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పగలరో చూడాలి.
కార్యకర్తలే తప్ప ప్రజలు లేని యాత్రలు, కుర్చీపై ధ్యాసే కానీ ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేని నాయకులు యాత్రలంటూ బయల్దేరుతున్నారు. అధికారంపై యావతో ఉన్న డొల్ల నాయకత్వం పట్ల సదరు పార్టీల్లోని శ్రేణుల్లోనే నిరాసక్తత వ్యక్తమవుతున్నది. నిన్న మొన్న పదేపదే పాదయాత్ర తేదీలు మారుస్తున్న ఒక జాతీయ పార్టీలోనైతే నాయకుని యాత్ర పట్ల ఏకాభిప్రాయమే కరువైంది. పాదయాత్ర అంటే.. ఓ ముప్ఫై కార్లు, వెంట నడవడానికి ఓ మూడొందల మంది, అక్కడక్కడా మీడియా బ్రీఫింగులు, ముందున్న కొద్దిమందికీ ఊకదంపుడు ఉపన్యాసాలు, సోషల్‌మీడియాలో లైకుల కోసం చిత్రమైన వాగుడే తప్ప మరేం ఉంటుందనుకునే పరిస్థితి వచ్చింది. ఈవెంట్ మేనేజ్మెంట్లుగా పాదయాత్రలు చేసే చౌకబారు నాయకుల నుంచి ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. పథకాలపై విమర్శలే తప్ప, ప్రత్యామ్నాయ మార్గాల పట్ల కొద్దిగానైనా జ్ఞానం ఉండదు.
ఆత్మగౌరవ పరిరక్షణ పేరుతో పాదయాత్ర చేసి ఆపిన నాయకుని పరిస్థితి మరీ విచిత్రం. ప్రజల ఇబ్బందులను అధ్యయనం చేయడానికి యాత్రలను చేసిన వాళ్లను చూసినం. ఏదో ఒక సామాజిక అంశంపై, ఒక ప్రాజెక్టు సాధనకో లేదా హక్కుల పరిరక్షణ కోసమో పాదయాత్రలతో కూడిన ఉద్యమాలను చూశాం. కానీ భూ ఆక్రమణలతో పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలకు కారణమై, స్వలాభం కోసం ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకొని, నిన్నటిదాక భాగమై ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న తీరు ఏవగింపు కలిగిస్తున్నది. ఆ నాయకున్ని చేర్చుకున్న జాతీయ పార్టీ కూడా వ్యక్తి ప్రయోజనం కోసం వ్యవస్థనే తాకట్టు పెడుతున్న తీరు పరిశీలకులను నివ్వెరపరుస్తున్నది. తీవ్రమైన సిద్ధాంత వైరుధ్యంతో కూడిన వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల పరిరక్షణకు ఆత్మగౌరవ ముసుగు తొడిగి నడుం కడుతున్న తీరు నవ్వుల పాలవుతున్నది.
కేసీఆర్ లాగా ఒక్క పథకం ప్రవేశపెట్టలేం కానీ చేసిన ప్రతీ పనిని విమర్శించి లాభం పొందుతామనే దురాశాపరులను ప్రజలు నమ్మరనే విషయం వారికి త్వరలోనే అర్థమవుతుంది. కేసీఆర్‌ను విమర్శిం చడం కాదు, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్‌లాగా ఆలోచించే స్థాయికి చేరుకున్నప్పుడే ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామనే విషయాన్ని అర్థం చేసుకోగలిగితే దారి ఖర్చుల మందమైనా ఫలితం దక్కుంతుందేమో.
(వ్యాసకర్త: టీఆర్ఎస్ నాయకులు)
రావుల శ్రీధర్‌రెడ్డి