తమపై జరుగుతున్న అన్యాయాలను
ఎదురించి హక్కుల కోసం ఉద్యమించిన ఆమాయక ఆదివాసీలపై 1981 ఏప్రిల్ 20వ తేదీన అధికారంలో ఉండి అప్పటి ముఖ్యమంత్రి టీ అంజయ్య నాయకత్వంలో కాల్పులు జరిపి వందల మందిని పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ సోమవారం ఇంద్రవెల్లి అమరుల స్థూపం వద్ద గిరిజన, దళిత దండోరా పేరుతో సభపెట్టి ఆదివాసులను అడ్డంపెట్టుకొని తమ రాజకీయ పబ్బం గడపడానికి కపట నాటకాన్ని ప్రారంభించింది. ఇంద్రవెల్లి ఘటన జరిగి నాలుగు దశాబ్దాలు దాటింది. ఆదివాసీ అమాయకులపైన కాల్పులు జరిపి మరో జలియన్‌వాలాబాగ్‌ను తలపింపజేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఆదివాసీల అభివృద్ధి గుర్తుకు రావడం విడ్డూరంగా ఉన్నది. ఆదివాసీలను అడ్డంపెట్టుకొని కాంగ్రెస్ రాజకీయ పబ్బం గడపడానికి కపట నాటకమాడుతున్నది.
ఇంద్రవెల్లి సంఘటనలో ప్రాణాలు తీసిన కాంగ్రెస్ ఇప్పుడు గిరిజన, దళిత దండోరా సభపెట్టి ఆదివాసీ అమరుల రక్తపు మరకలను తుడ్వగలదా! ఆదివాసీ అమరుల త్యాగాలపైనా, సమాధులపైనా రాజకీయం చేస్తే, ఇంద్రవెల్లి కాంగ్రెస్ చేసిన పాపంతో చనిపోయిన ఆదివాసీ అమరుల ఆత్మ ఘోషిస్తుంది.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున స్వేచ్ఛగా ఆదివాసీల తమ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు, తమ హక్కుల కోసం మాట్లాడే రోజును రాజకీయ రంగుపూసి అమరుల త్యాగాల గడ్డమీద సభపెట్టి ఆదివాసీలను, ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి పూనుకొన్నది.
ఆనాడు హక్కులు అడిగినందుకు ఆదివాసీలను పొట్టన పెట్టుకొన్న కాంగ్రెస్ అమరుల రక్తపు మరకలపై రాజకీయం చేస్తున్నది. నలభై సంవత్సరాలు అధికారంలో ఉండి ఆదివాసీల అభివృద్ధిని పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ ఏప్రిల్ 20వ తేదీన అమరవీరులకు నివాళి అర్పించకుండా జిల్లా వ్యాప్తంగా ఆంక్షలు, పోలీసు పహారా పెట్టిన పార్టీ.. ఆదివాసీల అభివృద్ధిపై మాట్లాడటం విడ్డూరంగా ఉన్నది. కేద్రంలో అధికారంలో ఉండి ఆదివాసీ ప్రాంతాల్లో పులుల రక్షణ కేంద్రాలు పెట్టి అడవికి పోకుండా ఆదివాసీలను అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ రోజు ఆదివాసీల భూముల పట్టాల గురించి మాట్లాడ్డం విచిత్రంగా ఉంది. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ పెట్టి ఆదివాసీ గ్రామాలను చీకటి రోజుల్లో ఉంచిన కాంగ్రెస్ ఆదివాసీల గురించి మాట్లాడటం ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ఇంద్రవెల్లి నెత్తుటి గాయానికి కాంగ్రెస్ కారపు పూతలు పూసి ఆదివాసీలను మభ్యపెట్టపూనుకున్నది. ఇది ఇంద్రవెల్లి ఆదివాసీ అమరుల త్యాగాలపైనా అధికార దాహం తీర్చుకొనేందుకే ఈ దళిత దండోరా సభ.
కావున సమస్త ఆదివాసీ, దళిత సమాజం కాంగ్రెస్ కుటిల రాజకీయ కపట ప్రేమను గ్రహించవలసిందిగా విజ్ఞప్తి. కాంగ్రెస్ పన్నిన రాజకీయ వలలో పడకూడదని, ఆదివాసీ సమాజానికి సూచిస్తున్నాం.
మర్సుకోల తిరుపతి