‘నీళ్లు, నిధులు, నియామకాలు’ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అన్ని రంగాల్లో రాష్ట్రం సమూలంగా అభివృద్ధి చెందడం కోసం ఒక్కో రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. భవిష్యత్తు తెలంగాణ దశ, దిశ పట్ల అంకితభావం ఉన్న ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాటి నుంచి తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తున్నారు.
ఉద్యోగాల విషయానికి వస్తే రాష్ట్రంలో ఐటీ, పారిశ్రామిక, ఫార్మా రంగాలు దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయి. కేసీఆర్ దూరదృష్టి, అకుంఠిత దీక్ష వల్ల హైదరాబాద్ నగరం నేడు దే శానికి ఐటీ హబ్‌గా మారింది. ఇప్పుడు హైదరాబాద్ ప్రపంచ స్థాయి సంస్థల గమ్యస్థానం. అమెజాన్, గూగుల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలకు, ఐటీ నిపుణులకు హైదరాబాద్ నగ రం నేడు విశ్వ వేదికగా మారింది. ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ నగరాలకూ ఐటీ రంగం విస్తరిస్తున్నది. ఇటీవల నీతి ఆయోగ్ ప్రకటించిన ‘ఇండియన్ గ్లోబల్ ఇండెక్స్’లో అద్భుత పనితీరు (పెర్ఫార్మన్స్)తో ప్రథమ స్థానం, సాధించిన స్థాయి సూచికలో నాలుగో స్థానం, మొత్తంగా భారత ఆవిష్కరణ సూచీలో ద్వితీయ స్థానం కైవసం చేసుకుని తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.
ఆవిష్కరణల్లో అ‘ద్వితీయ’ం: దేశంలో నవ కల్పనలు, నూతన ఆవిష్కరణలతో వివిధ రాష్ర్టాల పనితీరును తెలుసుకోవడానికి; నైపుణ్య ఆధారిత ఉపాధి, అంకుర పరిశ్రమలో ప్రోత్సాహక మార్గాలు, తగిన పెట్టుబడులు నైపుణ్య శిక్షణ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి (ఎంఎస్ఎంఈ) మొదలైన అంశాల్లో సమగ్ర విధానాన్ని జాతీయ స్థాయిలో రూపకల్పన చేయడానికి నీతి ఆయోగ్ ఇటీవల ‘ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్’ ర్యాంకులను ప్రకటించింది. పెద్ద రాష్ర్టాల కేటగిరిలో తెలంగాణ రాష్ట్రం 17.66 స్కోరుతో రెండవ స్థానం దక్కించుకున్నది. మానవ వనరులు, పెట్టుబడులు, నైపుణ్య కార్మికులు, వాణిజ్య, భద్రతా న్యాయపరమైన వాతావరణం, విజ్ఞాన వ్యాప్తి, విజ్ఞాన ఉత్పాదనలు మొదలైన ప్రామాణికాల్లో అద్భుతమైన స్కోరును సాధించి నూతన ఆవిష్కరణలలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచింది.
ఐటీలో అభివృద్ధి మంత్రం: భారత ఆవిష్కరణ సూచీలోని అనేక అంశాల్లో తెలంగాణ మెరుగ్గా ఉన్నది. ఐసీటీ (Information and communication technology) ల్యాబ్‌ల వినియోగంలో 17 శాతం నుంచి 35 శాతం వృద్ధి సాధించింది. లక్ష జనాభా పరంగా ఉన్నత విద్యలో విద్యార్థుల నమోదులో 9.7 నుంచి 15.7 శాతానికి ఎగబాకింది. పరిశోధన, అభివృద్ధి యూనిట్లలో 0.3 నుంచి 1.4 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో స్టార్టప్‌ల సంఖ్య 4,900 నుంచి 9,000 వరకు పెరిగింది.
భౌగోళిక పరిస్థితులతో పాటు ప్రభుత్వ సానుకూల విధానాల వల్ల ఐటీ రంగంలో హైదరాబాద్ మరో సిలికాన్ వ్యాలీగా మారి బెంగళూరుకు పోటీగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి కోసం ‘ఆవిష్కరణలు, మౌలిక వసతులు, సమగ్రాభివృద్ధి’ మంత్రాన్ని జపిస్తున్నది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నది. అత్యధిక ఐటీ ఉత్పత్తుల ఎగుమతులతో దేశ ఆర్థిక రంగానికి చోదక శక్తిగా నిలుస్తున్నది. ఐటీ రంగంలో ఎగుమతులు 2014లో 57 వేల కోట్లు ఉంటే ప్రస్తుతం 1.50 లక్షల కోట్లకు పెరిగాయి.
ఏక గవాక్ష(సింగిల్ విండో) పద్ధతిలో పరిశ్రమలకు అన్ని రకాల అనుమతులు ఇవ్వడం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్‌తో దేశ, విదేశీ పారిశ్రామిక వేత్తలు తెలంగాణలో వందలాది కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొల్పుతున్నారు.
హైదరాబాద్ నగరం నలుదిశలా అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రోత్ ఇన్ డిస్పర్షన్ గ్రిడ్ పాలసీకి శ్రీకారం చుట్టి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నది. నగరంలోని 11 పారిశ్రామిక వాడలను ఐటీ పార్కులకు మార్చింది. కండ్లకోయలో 10.11 ఎకరాల విస్తీర్ణంలో గేట్ వే ఐటీ పార్క్ పేరుతో రెండు భారీ ఐటీ టవర్లను నిర్మిస్తున్నది. భవిష్యత్తులో ఇక్కడ ఐటీ దాని అనుబంధ రంగాల్లో 10 వేల మంది యువతకు ఉపాధి లభించనున్నది. తెలంగాణ తన మెరుగైన పనితనంతో భవిష్యత్తులో ఏ రాష్ర్టానికీ అందనంత ఎత్తులో ఆవిష్కరణలతో బలమైన ఆర్థిక శక్తిగా నిలవగలదనడంలో సందేహం లేదు.
అంకం నరేష్
6301650324