రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం, వారి సమగ్ర వికాసం కోసం, దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ‘దళితబంధు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది దళితుల జీవితాల్లో ఒక మైలురాయి. గత ప్రభుత్వాలు ఓట్ల కోసం, సీట్ల కోసం తపనపడ్డాయే తప్ప దళితుల అభివృద్ధికి ఏనాడూ ముందుకురాలేదు. కానీ కేసీఆర్ తన ప్రజా రంజక పరిపాలనలో ఆయా వర్గాల సర్వతోముఖాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఆ కృషిలో భాగంగానే ‘దళితబంధు’ పథకం తీసుకువచ్చారు.
కేసీఆర్ చిత్తశుద్ధి కలిగిన, పరిణతి చెందిన రాజకీయవేత్త. తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపిన నాయకుడు. రైతుల కండ్లల్లో వెలుగును చూడాలనుకున్నారు, కాబట్టే ‘రైతుబంధు’ను ప్రవేశపెట్టి రైతులకు బంధువయ్యారు. ఇపుడు ‘దళితబంధు’ను ప్రవేశపెడుతున్నారు. కచ్చితంగా దళితులకు పెద్ద దిక్కవుతారని మేం విశ్వసిస్తున్నాం.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు కావస్తున్నది. దేశంలోకి కంప్యూటర్, సెల్ఫోన్, నగదురహిత వ్యాపారం మొదలైనవి ప్రవేశించాయి. కొన్ని వర్గాలు ప్రధాన స్రవంతిలోకి వచ్చి సంపన్నమయ్యాయి. పాలనలో, అధికారంలో, సంపదలో భాగస్వామ్యం తీసుకుంటున్నాయి. ప్రపంచ కుబేరుల జాబితాలో ఇంకొందరు చేరుతున్నారు. కానీ దళితుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉన్నది. దళితుల సామాజిక చైతన్యానికి విద్య ఆలంబనగా పనిచేస్తుంది. విద్య ద్వారానే సామాజిక మార్పు తొందరగా జరుగుతుందని అంబేద్కర్ భావించారు. కానీ ఈ కాలంలో దళితుల విద్యాస్థాయి చూస్తే 10 శాతం కూడా దాటలేదు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయస్థాయి వరకు దళితులు అర్ధాంతరంగా తమ చదువులను ముగిస్తున్నారు. ఫలితంగా వారి జీవితంలో రావలసిన మౌలిక మార్పునకు అనేక పరిమితులు ఏర్పడుతున్నాయి. ఈ పరిమితులను దాటాలంటే ‘దళితబంధు’ పథకం దళితుల్లో విద్యా చైతన్యాన్ని తీసుకొచ్చేలా ఉండాలి. నాణ్యమైన విద్యను కొనసాగించడానికి కావలసిన ప్రాతిపదికను ప్రభుత్వం రూపొందించాలి.
దళితులు సాంస్కృతికంగా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు. వేల ఏండ్లుగా కులవ్యవస్థ దళితుల్లో చొరవను దెబ్బతీసింది. గ్రామానికి, అంటరాని పల్లెకు మధ్య నిర్మాణమైన గోడలు దళితులను న్యూనతాభావానికి గురిచేశాయి. దేశ సంస్కృతిలో భాగం కాకుండా వాళ్లు విడిగా జీవిస్తూ వచ్చారు. శూద్ర కులాలు దళితులను తమ సమూహాల్లో భాగం కాకుండా చూశాయి. ఈ కారణాల వల్ల దళితులు సాంస్కృతిక వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు. ఏ సమాజాల్లోనైనా ఉన్నత సంస్కృతే ఆ ప్రజల అభివృద్ధికి కొలమానం. కాబట్టి ‘దళితబంధు’ పథకం దళిత ప్రజల సాంస్కృతిక అభివృద్ధికి పాటుపడి వారికి బంధువుగా మారాలని కోరుకుంటున్నాం.
కష్టపడి పనిచేసి జీవించటమే తప్ప నికరంగా వచ్చే ఆదాయం దళితులకు ఉండదు. ప్రభుత్వ ఉపాధిలో కూడా దళితుల శాతం చాలా తక్కువ. ప్రైవేట్ రంగంలోనైతే దళితులకు చోటే లేదు. ఈ పదేండ్లలో దళిత సమాజం నుంచి చదువుకున్న యువత కొంత మేరకైనా ఎదిగివచ్చింది. వారందరూ నిరుద్యోగులుగా ఈ సమాజంలో తిరుగుతున్నారు. చిన్నపాటి చాలీచాలని ఉద్యోగాలు చేస్తూ జీవితాలను గడుపుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఏ పనిచేయని యువత కుటుంబాలకు భారమవుతున్నది. కష్టించి పనిచేసే దళిత యువత శక్తిసామర్థ్యాలను తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం చేయాలంటే వారికి ఉపాధి అవకాశాలను కల్పించేవిధంగా ‘దళితబంధు’ పథకాన్ని అమలుచేయాలి.
శూద్ర కులాల్లో కొన్నింటికి ఇంకా కులవృత్తులు కొనసాగుతున్నాయి. కానీ దళితులకు డప్పు-చెప్పు వృత్తిగా లేకుండాపోయింది. పెద్ద పెట్టుబడిదారులు షూ కంపెనీలు పెట్టడం వల్ల చెప్పుల షాపులన్నీ కార్పొరేటీకరించబడ్డాయి. ఫలితంగా దళితులు ఉపాధిని కోల్పోయారు. దళిత సమాజం తన అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితికి చేరుకున్నది. కనుక డప్పు, చెప్పు వృత్తిదారులకు పింఛన్ ఇస్తూ వారి వృత్తిలో సాంకేతికను ప్రవేశపెట్టి వారిని ఆదుకునేవిధంగా ‘దళితబంధు’ పథకాన్ని విస్తరించాలి.
కేసీఆర్ తలచుకుంటే ఏ పథకాన్నైనా అమలుచేసి తీరుతారు. ఆయన చిత్తశుద్ధి కలిగిన, పరిణతి చెందిన రాజకీయవేత్త. తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపిన నాయకుడు. రైతుల కండ్లల్లో వెలుగును చూడాలనుకున్నారు, కాబట్టే ‘రైతుబంధు’ను ప్రవేశపెట్టి రైతులకు బంధువయ్యారు. ఇపుడు ‘దళితబంధు’ను ప్రవేశపెడుతున్నారు. కచ్చితంగా దళితులకు పెద్ద దిక్కవుతారని మేం విశ్వసిస్తున్నాం. మా ఆత్మబంధువు కేసీఆర్ ‘దళితబంధు’ ద్వారా దళితుల ఇండ్లల్లో, కండ్లల్లో వెలుగు నింపుతారని ఆశిస్తున్నాం.
(వ్యాసకర్త: రాష్ట్ర అధ్యక్షులు, టీఎస్ఎమ్మార్పీఎస్)
వంగపల్లి శ్రీనివాస్ మాదిగ