తెలంగాణ ఆవిర్భావం అనంతరం వివిధ రంగాల అభివృద్ధితో పాటు వైద్య రంగానికీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది. దీనికి నిదర్శనంగా గత ఏడేండ్లలో గణనీయంగా తగ్గుముఖం పట్టిన అంటువ్యాధులే సాక్ష్యం. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖను పటిష్ఠం చేయడం కూడా కారణమే. హైదరాబాద్ నగరంలో ఎంటమాలజీ విభాగానికి పూర్తిస్థాయిలో నిధులు, దోమల నివారణా మందులు, ఆధునిక మెషిన్లు అందించడంతో అంటువ్యాధులు పతా లేకుండాపోయాయి.
ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన వైద్య, ఆరోగ్యరంగాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. రాష్ట్రంలో మల్టీ స్పెషాలిటీ దవాఖానలుగా ఉన్న ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నిజాం బొక్కల దవాఖా న, ఫీవర్ ఆసుపత్రి, చెస్ట్ హాస్పిటల్, మానసిక చికిత్సాల యం మొదలైన దవాఖానలన్నీ పునర్వైభవం చాటుతున్నాయి. నగరానికి నలుదిక్కులా ఒక్కో సూపర్ స్పెషాలి టీ దవాఖాన ఏర్పాటుచేయాలని నిర్ణయించడం గొప్ప మార్పునకు నాంది. దీనిలోభాగంగా గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ విలేజ్ భవనాన్ని తెలంగాణ ఇనిస్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)గా ఏర్పాటుచేశారు. అలాగే కొత్త పేటలోని ఫ్రూట్ మార్కెట్ స్థలంలో మల్టీ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వరంగల్‌లోని జైలు స్థలంలో అత్యంత ఆధునిక బహుళ అంతస్థుల దవాఖాన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
ప్రజలందరికీ ఉపయోగపడే దవాఖానల నిర్మాణం, సేవలకు తెలంగాణలో సుదీర్ఘ చరిత్ర ఉన్నది. అసఫ్‌జాహీ కాలంలోనే 1876లో హైదరాబాద్‌లో మొట్ట మొదటి మెడికల్ స్కూల్ ప్రారంభమైంది. 1884-85లో నిజాం రాష్ట్రంలో 6 దవాఖానలు, 48 డిస్పెన్సరీలున్నాయి. 1901లోనే 6,36,044 మందికి వైద్య చికిత్సలందించారు. అఫ్జల్‌గంజ్ దవాఖానలో మహిళలకు ప్రత్యేకంగా చికిత్సలు, పరీక్షలు నిర్వహించే విధానం ఉండేది. 1901లోనే 74 మంది సర్జన్లు, 12 మంది లేడీ డాక్టర్లు, 31 మంది దవాఖాన అసిస్టెంట్లు, 104 కాం పౌండర్లు, 116 వాక్సినేటర్లు ఉన్నారు.
హైదరాబాద్‌లో వ్యాక్సిన్ ప్రక్రియను 1884-85 ప్రవేశపెట్టారు. 1901లోనే వ్యాక్సిన్ కార్యక్రమాన్ని అమలుచేశారు. 1911 నాటికి తెలంగాణలో 91 ప్రభు త్వ దవాఖానలు, డిస్పెన్సరీలున్నాయి. తెలంగాణలో అఫ్జల్‌గంజ్‌లో ఉన్న ఉస్మానియా జనరల్ దవాఖాన నిర్మాణం 1925లో జరిగింది. ప్రిన్స్ ఎడ్వర్డ్ మెమోరియల్ దవాఖాన పేరుతో గాంధీ దవాఖాన 1853లో ప్రారంభమైంది. 1955లో గాంధీ దవాఖానగా పేరు మారింది. రాజా ప్రతాప్ నర్సింగ్ గిరిజి 75 పడకల దవాఖానగా కోఠి ఈఎన్టీ దవాఖానను ప్రారంభించారు. చార్మినార్‌లోని యునానీ దవాఖానను 1930లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించారు. 1915లో ఫీవర్ హాస్పిటల్‌ను ప్రారంభించారు. 1997లో ఈ దవాఖానకు పర్ రోనాల్డ్ రాస్ ఇనిస్టిట్యూట్‌గా పేరు మార్చారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ను మానసిక వైకల్యం ఉన్న వారికి చికిత్స కోసం 1900 లో దీన్ని ప్రారంభించారు. నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ మనుమరాలు పేరిట 1867లో జజ్గి ఖానా ప్రసూతి దవాఖానను ప్రారంభించారు. 40 పడకల ఎంఎన్‌జే హాస్పిటల్‌ను దేశ తొలి ప్రధాని నెహ్రూ 1955 డిసెంబర్ 8వ తేదీన ప్రారంభించారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఇచ్చిన 65 ఎకరాల్లో శతాబ్దం కిందట చెస్ట్ హాస్పిటల్ ప్రారంభమైంది. నీలోఫర్ దవాఖాన 1953లో ప్రారంభమైంది. ఆయన ఇచ్చిన నిధులలోనే నిమ్స్ దవాఖాన ఏర్పాటైంది.
కన్నెకంటి వెంకటరమణ