ప్రజా సంక్షేమం కోసం పనిచేసే నాయకుడిని ప్రజలు పదికాలాల పాటు గుర్తుంచుకుంటారు. కేవలం తన కోసమో, తన కుటుంబం కోసమో, లేక సొంత ఆస్తులు పెంచుకోవడం కోసమో పనిచేసే వారిని పట్టించుకోరు. ఎందుకం టే ప్రజలు విజ్ఞులు. కాబట్టే తమ కోసం, తమ భవిష్యత్తు కోసం, భవిష్యత్ తరాల కోసం పనిచేసే నాయకులనే పదవులపై కూర్చోపెడుతారు.
నిబద్ధ ప్రజా నాయకుడే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన సాగిస్తాడు. నటించే వాడైతే అధికారాన్ని అడ్డంపెట్టుకొని అందినకాడికి దండుకొని రాజకీయాల్లో రంగులు మారుస్తాడు. అందుకే కొట్లా డి తెచ్చుకున్న తెలంగాణకు ఎవరి నాయకత్వం అవసరమో ప్రజలు గుర్తించారు. ఢిల్లీ అధిష్టానాలకు తలలూపే నాయకులను పక్కనపెట్టి, స్వరాష్ట్రం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకే రెండుసార్లు పాలనా పగ్గాలు అప్పజెప్పారు.
ఉద్యమస్ఫూర్తితో పదవి చేపట్టిన కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే అభివృద్ధి సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారు. నిద్రాహారాలు మాని రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళిక రచించారు. పరాయి పాలనలో తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో.. ఆ ఫలాలను ఒక్కొక్కటిగా అందిస్తున్నారు. ఆ క్రమంలోనే రైతు ‘రుణమాఫీ’ మొదలు నేటి ‘దళితబంధు’ దాకా అనేక సంక్షే మ పథకాలను అమలుచేస్తున్నారు. ‘రైతుబంధు’ పథకాన్ని..‘ అయ్యేదా.. పొయ్యేదా..’ అని వెటకారంగా మాట్లాడిన ప్రతిపక్షాలు తర్వాత తలెత్తుకోలేకపోయాయి.
మాటలతో కోటలు కట్టే ప్రధాని మోదీ సైతం ‘రైతు సమ్మాన్ నిధి’ పేరుతో కేసీఆర్ పెట్టిన ‘రైతు బంధు’ పథకాన్ని కాపీ కొట్టారంటే కేసీఆర్ మేధో సంపత్తి ఎంత గొప్పదో యావత్ దేశానికే తెలిసిపోయింది. ‘కేటీఆర్ గొప్ప వ్యక్తి అని’ అని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసిస్తే రేవంత్‌రెడ్డి శశిథరూర్‌పై నోరు పారేసుకోవటం కుళ్లుబోతు తనమే.
హుజూరాబాద్ ప్రజల అభివృద్ధి కోసం దళిత బంధు అమలు చేస్తే దానిపై కూడా విమర్శలే! ఈటలకు భయపడే నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని పెట్టారంటూ విషప్రచారానికి దిగుతున్నారు. ప్రజల ఆకాంక్షలు, చైతన్యం ముందు తెలంగాణ వ్యతిరేక ద్రోహచింతనా పరులంతా గాల్లో కలిసిపోయారు. వారి రాజకీయ జీవితమే ప్రశ్నార్థకమైంది. అలాంటి కేసీఆర్ ఈటలకు భయపడటమేంటి?
ప్రతిపక్షాలు అంటున్నట్లు ‘ఎన్నికల కోసం దళితబంధు’ పథకం హడావుడిగా ప్రారంభించింది కాదు. కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దళితుల సంక్షే మం కోసం ప్రత్యేకంగా పలు కార్యక్రమాలు అమలు చేశారు. ఆ అనుభవంతోనే దళితబంధు పథకాన్ని తెచ్చారు. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ‘దళితబంధు’ను అమలుచేస్తున్నారు.అలాగే ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ పథకం అమలవుతున్నది.
హుజూరాబాద్‌లో ఈటల ఎక్కడ తిరిగినా ప్రజలు ఛీ కొడుతున్నారు. మొన్నటికి మొన్న ఒక మహిళ ఆయనపై ఏకంగా దుమ్మెత్తి పోసింది. తన కొడుకు చావుకు కారణమయ్యాడంటూ శాపనార్థాలు పెట్టిం ది. ఈటలపై తన నియోజకవర్గంలో ఎంత చీదరింపు ఉన్నదో తెలిసిపోతున్నది. దీన్నిబట్టి ఈటలకు ఓటమి తథ్యమని అర్థమవుతున్నది. గెల్లు గెలుపు సునాయసమే. రాజకీయాల్లో కొత్త, యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్న కేసీఆర్‌కు అభినందనలు.
తుమ్మల కల్పనారెడ్డి