స్వల్పకాలంలో అతి వేగవంతమైన అభివృద్ధిని సాధించిన తెలంగాణ రాష్ర్టానికి నీతిఆయోగ్ ప్రశంస లభించడం గర్వకారణం. తెలంగాణ రాష్ట్ర సమితి వాడవాడలా జెండా పండుగ జరుపుకొంటూ, ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుంటున్న సందర్భంలో ఈ గుర్తింపు రావడం మరీ ఆనందకరం. నీతిఆయోగ్ విడుదల చేసిన ‘అర్థ నీతి’ ఏడో నివేదికను పరోక్షంగా తెలంగాణ ప్రగతి నివేదికగా చెప్పుకోవచ్చు! రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ) అంటే రాష్ట్ర ఆర్థికస్థితిని వెల్లడించే సూచిక. జీఎస్డీపీ విషయంలో 11.7 శాతం వార్షిక వృద్ధిరేటుతో దక్షిణ భారతంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని నీతిఆయోగ్ వెల్లడించింది. పారిశ్రామిక, ఐటీ రంగాల్లో అప్పటికే స్థిరపడిన తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ర్టాలను కూడా కొత్త రాష్ట్రమైన తెలంగాణ అధిగమించటమంటే మాటలు కాదు. జీఎస్డీపీ వృద్ధిరేటులో దేశంలోనే తెలంగాణ మూడోస్థానంలో నిలిచింది. రాష్ట్రం ఆవిర్భవించిన నాటితో పోల్చితే ఈ అంశంలో ఏకంగా 94 శాతం వృద్ధి నమోదు కావటం ముదావహం.
ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, సమర్థత మూలంగానే తెలంగాణ ఆర్థిక రంగంలో అంగలు వేస్తున్నది. దిగ్గజ కంపెనీలను రాష్ర్టానికి రప్పించేలా, ఉత్తమమైన పారిశ్రామిక విధానాన్ని (టీఎస్-ఐపాస్) ప్రవేశపెట్టారు. విద్యుత్, నీరు, రహదారుల వంటి మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు జోడు గుర్రాల్లా ప్రగతి రథం పరుగులు తీస్తున్నది. కేసీఆర్ పారిశ్రామికీకరణకు ఎంత ప్రాధాన్యమిస్తారో, బడుగువర్గాల సంక్షేమానికి కూడా అంతే ప్రాధాన్యమిస్తున్నారు. అభివృద్ధిలో నగరాలతో దీటుగా పల్లెలు ముందడుగు వేస్తున్నాయి. చెరువులు నిండి, కులవృత్తులు మళ్లీ కళకళలాడుతూ గ్రామాలు సంపద సృష్టికి కేంద్రాలుగా మారుతున్నాయి. తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదనేది నీతిఆయోగ్ చెబితేనే తెలిసింది కాదు. ఏ పారిశ్రామికవేత్తను అడిగినా, పల్లెపట్టున సామాన్యుడిని అడిగినా తన జీవితానుభవాన్ని వివరించగలడు.
కాళేశ్వరం వంటి బృహత్ పథకం, కుల వృత్తులకు ప్రోత్సాహం మాదిరిగానే కేసీఆర్ ‘దళిత బంధు’ పథకాన్ని చేపట్టారు. ఈ వినూత్న పథకం వల్ల దళితులలోనే కాదు, అన్ని సామాజికవర్గాల యువత ఆలోచనా విధానం మారిపోయి సమాజంలో వ్యాపార కౌశలం పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి మరింత వేగవంతమవుతుంది. నీతిఆయోగ్ నివేదిక నేపథ్యంలోనైనా ప్రతిపక్షాలు కువిమర్శలను మానుకుంటే మంచిది. ఆదర్శవంతమైన పాలన సాగుతున్నప్పుడు తమవంతుగా సహకరించడం అన్ని రాజకీయపక్షాల బాధ్యత. వారి నుంచి విజ్ఞతతో కూడిన కార్యాచరణను తెలంగాణ సమాజం కోరుకుంటున్నది.