తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ‘1960 పౌర గ్రంథాలయ చట్టం’లో ప్రభుత్వం కొన్ని మార్పులు, చేర్పులు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వు నెం.35, 2015 డిసెంబర్ 21 ద్వారా తెలంగాణ రాష్ట్ర పౌర గ్రంథాలయ చట్టాన్ని అమలుచేసింది. తద్వారా రాష్ట్ర పౌర గ్రంథాలయాలు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల నాయకత్వంలో అధునాతన మోడల్ ప్రజా గ్రంథాలయాలుగా మార్పుచెందాయి.
పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా ఏర్పడిన 33 జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం అధునాతన మోడల్ ప్రజా గ్రంథాలయాలను ఏర్పాటుచేయాలనే సంకల్పంతో ఉన్నది. ప్రస్తుతం 12 జిల్లా కేంద్ర గ్రంథాలయాలను మోడల్ ప్రజా గ్రంథాలయాలుగా మారు స్తూ, ఒక్కొక్కటి రూ.2 నుంచి 4 కోట్లతో నూతన భవనాలు నిర్మించింది. కంప్యూటర్లు, మౌలిక వసతులతో పాటు పుస్తకాలను ఏర్పాటుచేసింది. అట్లాగే కొన్ని శాఖా గ్రంథాలయాల పాత భవనాలను కూల్చి, కొత్త భవనాలు నిర్మిస్తున్నది. మరికొన్ని గ్రంథాలయాలు మరమ్మతులకు నోచుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం ఇటీవలే హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ పరిధిలోని 13 పాత శాఖా గ్రంథాలయాలకు కొత్త భవనాలు, 35 పాత భవనాల మరమ్మతుల కోసం రూ.17 కోట్లు కేటాయించింది.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధమైన చాలామంది విద్యార్థులకు పలు శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. ఆ విద్యార్థుల్లో ఎక్కువ మంది ప్రజా/జిల్లా గ్రంథాలయాల్లో చదివినవారే. జిల్లా, మండలాల్లో అధునాతన మోడల్ ప్రజా గ్రంథాలయాలను నిర్వహించడం వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు, స్కాలర్లకు, నిరుద్యోగులకు లాభం చేకూరుతుంది. పుస్తకాలపై మక్కువ ఉన్న కేసీఆర్ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావడం వల్లనే ఇదంతా సాధ్యమవుతుందనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లా కేంద్ర గ్రంథాలయాలు, 562 శాఖా గ్రంథాలయాలున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టుల్లో 184 మందిని ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా రాష్ట్రంలో 60 వేల ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఇందులో 150 గ్రంథాలయ ఉద్యోగుల పోస్టులకు ఆర్థికశాఖ అనుమతినిచ్చింది. త్వరలో నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉండ టం శుభసూచకం.
తెలంగాణ నగర, జిల్లా గ్రంథాలయ సంస్థల చరిత్రలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కింది. అట్లాగే శిక్షణ పొందిన ఉద్యోగులతో ఖాళీలను భర్తీచేయాలి. నగర, జిల్లా గ్రంథాలయ సంస్థ కమిటీల్లో, తెలంగాణ గ్రంథాలయ పరిషత్ కమిటీల్లో, జిల్లా గ్రంథాలయ సంస్థల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలి. అప్పుడే జిల్లా గ్రంథాలయ సంస్థలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. విద్య, పౌర గ్రంథాలయ శాఖకు మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి వ్యవహరిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రముఖ తెలంగాణ ఉద్యమ నాయకులు డాక్టర్ అయాచితం శ్రీధర్‌ను తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌కు చైర్మన్‌గా నియమించింది. వీరు పౌర గ్రంథాలయ శాఖ, జిల్లా గ్రంథాలయ సంస్థలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండటం అభినందనీయం.
కొక్కుల దేవేందర్