‘దురాశ దుఃఖానికి చేటు’ అన్న సామెత తెలుగు ప్రజలకు బాగా తెలుసు. ఆరు దశాబ్దాల ఉద్యమ పోరు, అన్యాయమైన మూడు తరాలు, అమరులైన వందల మంది (2004 నుంచి 2014 దాకానే 1200 మంది పైన) యువకులు, నక్సలైట్లన్న నెపంతో చంద్రబాబు హయాంలో జిల్లాకు 300 మందికి పైన చంపబడిన యువత, మూసివేయబడిన విద్యాసంస్థలు,తరలించుకుపోయిన తెలంగాణ నిధులు, దిగువ ఆంధ్రా ప్రాంతానికి పారిన కృష్ణా, గోదావరి నదీజలాలు, దోచుకోబడిన తెలంగాణ వనరులు, ఆక్రమింపబడిన ప్రభుత్వ ఉద్యోగాలు, కబ్జాలకు గురైన వేలకొద్దీ ఎకరాలు, రాజధాని భూమి-1956 నుంచి 2014 దాకా ఎవరైనా తెలంగాణ ప్రాంత చరిత్ర రాయదల్చుకుంటే విశ్లేషించి, చర్చించాల్సిన అంశాలు ఇవీ..!
వివరంగా రాయాలంటే ఇంకా విశేషాలున్నాయి. ఆంధ్రా ప్రాంతానికి మేలు చేయటానికి కిందికి జరిపి కట్టిన నాగార్జున సాగర్ ఆనకట్టను దిగులుగా చూస్తూ విజయపురి దగ్గర ఆ డామ్ శంకుస్థాపన చేసి వేసిన శిలాఫలకం, ఎన్నికల ముందు హడావుడి చేసి హెలికాప్టరులో వెళ్లి దేవాదులకు చంద్రబాబు వేసిన శిలాఫలకం, డాములు కట్టకుండా కేవలం కాలువలు తవ్వి తెలంగాణ వారిని భ్రమల్లో ముంచి తన కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించిన వైఎస్ఆర్ తవ్విన కాలువలు, హైదరాబాద్ నగరం మధ్యలో హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర తెలియని, మద్రాసు నగరం ఆంధ్రకు కావాలని నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన పొట్టి శ్రీరాములు పేరు మీద ఉన్న తెలుగు యూనివర్సిటీ,
సూఫీ తత్తవేత్త హసేన్ షావలీ కనుక్కున్న సరస్సు మీద 30 మంది తెలంగాణ ప్రజలకు తెలియని ఆంధ్రావారి విగ్రహాల మధ్య బిక్కుబిక్కు మంటూ ఉన్న 3 తెలంగాణ వారి విగ్రహాలు, హైదరాబాద్ నిండా తెలంగాణ ప్రజలను వెతలకు గురిచేసిన ఆంధ్ర రాజకీయ నాయకుల విగ్రహాలు, వారి పేర్ల మీద వెలిసిన కాలనీలు, పార్కులు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వందల మంది రైతులను భయపెట్టి, బాధపెట్టి ఎకరం రూపాయికి తీసుకొని వేల ఎకరాలను తన వర్గం వారికి అమ్ముకొని సొమ్ము చేసుకొని ఒక డబ్బా బిల్డింగ్ కట్టి మొత్తం హైటెక్‌సిటీలోని సైబరాబాద్ పేరు మీద తానే నిర్మించానని చంద్రబాబు చెప్పుకొనే ఆ ప్రాంతంలో అన్యాక్రాంతమై జయభేరి మోగిస్తున్న ఆంధ్ర కాలనీలు ఆఫీసులు, విద్యాసంస్థలు! తానే హైదరాబాద్ నగరాన్ని నిర్మించాననీ, అంతకంటే ముందు ఈ ప్రాంతంలో చదువన్నదే లేదనే చంద్రబాబు కోసం ఈ కింది విషయాలు పొందుపరచాలి చరిత్రకారులు.
నిజాముల కాలంలో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు స్థాపించబడి, ఇక్కడి వైద్యుల కోసం ఇరాన్, ఇరాక్ ఇంకా ఇతర మధ్య తూర్పు దేశాల వారు చికిత్సలు, ఆపరేషన్ల కోసం వచ్చేవారు. ఉస్మానియా యూనివర్సిటీ (1918) మొట్టమొదటి స్థానిక భాషా మాధ్యమం (ఉర్దూ)లో భారతదేశంలో స్థాపించబడింది. ఈ విశ్వవిద్యాలయ స్థాపన కంటే ముందుగా స్థాపింపబడిన నిజాం కళాశాల (1887) అప్పుడు మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది. అంటే, చంద్రబాబు పుట్టేకంటే సుమారు ఆరున్నర దశాబ్దాల ముందు ప్రభుత్వ జెనానా పాఠశాల (1885), ప్రధాని సాలార్జంగ్ స్థాపించిన ఓరియంటల్ కళాశాల మూడు భాషా మాధ్యమాలలో -అరబిక్, పర్షియన్, ఇంగ్లీషు, తర్వాత తెలుగు, మరాఠీ మాధ్యమాలలో కూడా విద్యను అందించింది.
అంతకంటే ముందు నిజాం ఫక్రూద్దీన్ ఖాన్ 1829లోనే భౌతికశాస్త్రం, గణితం, ఖగోళశాస్త్రం, తత్వశాస్ర్తాలు బోధించటానికి ఓరియంటల్ పాఠశాల ప్రారంభించాడు. 1839లోనే ఇక్కడ మెడికల్ కాలేజీ ఉండింది. ఇప్పటికీ నడుస్తున్న సెయింట్ జార్జి గ్రామర్ స్కూల్ ఇంగ్లీషు మాధ్యమంలో 1834లో ప్రారంభించబడింది. సెయింట్ ఫ్రాన్సిస్ స్కూలు 1850లోనూ, రోజు రీ కాన్వెంట్ హైస్కూల్ 1904లోనూ ప్రారంభించబడ్డాయి. హైదరాబాద్ రాష్ట్రంలో లెక్కలేనన్ని పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యా, సాంకేతిక విద్యా కళాశాలలు, 11 ప్రత్యేక చికిత్సల (స్పెషాలిటీ ప్రకారం) వైద్యశాలలు అంటే ఫీవర్ ఆస్పత్రి, బొక్కల దవాఖాన, చెవి, ముక్కు, గొంతు ఆస్పత్రి వంటివి స్థాపించబడినాయి. అంటే బ్రిటిష్ వారి కాళ్లు కడిగి ఆంధ్రవారు నెత్తిన జల్లుకుంటున్న కాలంలో, ఇక్కడ లండన్ నుంచి వచ్చి నిజాముల దగ్గర ఉద్యోగులుగా జీతాలు తీసుకుంటూ వారికి సలాము చేసే బ్రిటిష్ ఉపాధ్యాయులు ఎందరో ఉండేవారన్న మాట. అదీ అసలైన తెలంగాణ!
ఇంకొక మాటలో చెప్పాలంటే 1956 దాకా ఎంతో సంపన్న రాష్ట్రంగా, ఉన్నతమైన సంస్కృతి కలిగి ఉన్న తెలంగాణ, ఉమ్మడి రాష్ట్రంలో తన కీర్తిని, ఉనికిని కోల్పోయింది. ఎప్పుడూ అన్నీ తనే చేశానని గొప్పలు (స్కోత్కర్ష అంటారు, దీన్ని గురించి వేదం ఏమంటుందంటే – ‘నిజమైన గొప్ప వాడిని ఇతరులు పొగుడుతారు, అధములు తమను తామే పొగుడుకుంటారు’ అని.) చెప్పుకొనే చంద్రబాబు పుట్టకముందు ఒక శతాబ్దం + మూడు దశాబ్దాల (163) ఏండ్లు కాలం ముందే విద్యారంగం తెలంగాణలో ఉండింది. అంతేకాదు, ఆరు భాషా మాధ్యమాలలో -అరేబిక్, పర్షియన్, ఉర్దూ, తెలుగు, మరాఠీ, కన్నడం – విద్యార్థులకు విద్యను అందించింది. మరి తెలంగాణకు సుద్దులు నేర్పానని చెప్పే చంద్రబాబు మొదటి ఐదేండ్ల పాలనలో ఒక్కటీ చక్కనైన భవనం కట్టలేక పోయాడెందుకు అమరావతిలో? లక్ష వేల ఎకరాలు రాజధానిగా పరిగణించరనీ, అందులో వసతులుంటేనే పాలన జరుగుతుందనీ తెలియదా?
ఇక ఆయన శిష్యగణంలో అత్యంత ఆప్తుడు, కాస చియాంకా లాంటి మన ప్రస్తుత సీఎం పాలనలో, వలస పాలకులను మించిపోతున్నాడు. భౌతికంగా కాంగ్రెస్ పార్టీలోనూ, మానసికంగా టీడీపీలోనూ రెండు పాత్రధారుల వలె మసలుతున్న వీరి మూడో ఆత్మీయబంధం మతతత్వ బీజేపీతో సాగుతోంది. పాలనలో ఈ మూడు పార్టీల మనిషి లాగ తెలంగాణ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నా, వ్యక్తిగతంగా ఆయన నాలుగో పాత్రధారి.
ఇక్కడ మహాభారతంలోని ఒక పాత్ర గురించి మాట్లాడుకోవాలి. ఆయన పేరు పౌండ్రక వాసుదేవు డు. వాసుదేవుడి కుమారుడు కాబట్టి శ్రీకృష్ణుడిని వాసుదేవుడని కూడా అంటారు. మరి ఈ వాసుదేవు డు ఎంత విచిత్ర వ్యక్తో తెలుసుకుంటే మన ప్రస్తుత సీఎం తత్వం మనకు అర్థమవుతుంది. ఈ రెండో వాసుదేవుడు పౌండ్ర రాజ్యానికి రాజు. కంసుడి మామ జరాసంధుడి స్నేహితుడు. శ్రీ కృష్ణుడికి ప్రజ లు, పాండవులు ఇచ్చే గౌరవం, ఆదరం చూసి పట్టలే ని అసూయతో ప్రవర్తిస్తాడు. అయితే కృష్ణుడు, చేతకానివాడని, తనే కృష్ణుడిని అని నమ్మించటానికి ప్రయత్నిస్తాడు. శ్రీకృష్ణుడి కౌస్తుభం లాగ తాను కూడా ఒక మణిని తాడుతో హృదయం మీద అమర్చుకుంటాడు. పట్టు పీతాంబరాలు ధరించి నెమలీక కూడా నెత్తిన పెట్టుకుంటాడు, పూలమాల ధరిస్తాడు. ఇన్ని చేసినా ఎవరూ ఆయనను గొప్పవాడని గుర్తించకపోగా, ఆయన ఉనికినే పట్టించుకోరు. ఇది భరించలేక శ్రీకృష్ణుడికి తనే గొప్పవాడని ప్రజలకు చెప్పమనీ, లేకపోతే యుద్ధం చేసి చంపేస్తాననీ బెదిరిస్తాడు. ఆ యుద్ధంలో తన నకిలీ చక్రంతో కృష్ణుడిని చంపుదామని ప్రయత్నించి, శ్రీకృష్ణుడి చేతిలో తానే హతమవుతాడు.
మరి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్నికల ముందే పైన చెప్పిన విధంగా తెలంగాణ మొదటి ముఖ్యమంత్రితో పోలిక మొదలుపెట్టాడు. ఎన్నికల ప్రసంగంలో కేసీఆర్‌కు హుస్నాబాద్ సెంటిమెంట్ అయితే, తనకు వికారాబాద్ సెంటిమెంట్ అని ప్రకటించాడు. ఇక అది మొదలు పబ్లిక్, ప్రైవేట్ అసెంబ్లీలో – ప్రసంగం ఏదైనా అసలైన పాలకుని పేరు ఎత్తకుండా మాట్లాడలేదు. చేసిన పథకాలు కూడా ఉన్నవాటిని పెంచి చెప్పాడే కానీ, కొత్తవి, మంచివీ ఏమీ లేవు. ఆ మాటలు నమ్మి ఈ పౌండ్రక వాసుదేవుడికి ఓటేసి గెలిపించిన ప్రజలు ఏమి చేయాలో ఆలోచించుకోవాలి. మరి ప్రపంచం అంతా అసమర్థుడి లాగా చూస్తున్న ఈయన పాలనలో ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుందన్న ఆశ ఇంకా వుందా ప్రజలకు? ఈ కష్ట సమయంలో ఏమి చేయాలో విజ్ఞులైన ప్రజలే ఆలోచించుకోవాలి. మేధ, ప్రజ్ఞ, ధైర్యం, కలిగిన అసలు నాయకుడి పాలన బాగుందా? వెనుకబడిన రాష్ర్టాన్ని కేవలం తొమ్మిదిన్నరేండ్లలో సంపన్న రాష్ట్రంగా రూపుదిద్దిన ఆ నాయకుడు కావాలా? అసమర్థ, అవినీతి నకలు నాయకుడు కావాలా? తేల్చుకోండి!
కనకదుర్గ దంటు
89772 43484