‘చూసే కన్నులుంటే ఎటుచూసినా మృత్యు ఛాయలే కనిపిస్తున్నాయి’- మరో మహా ఉత్పాతం సంభవించే వినాశకర పరిస్థితులు భూగోళం మీద ఏర్పడుతున్నాయంటూ వెలువడిన అధ్యయనం మీద కొందరు శాస్త్రవేత్తలు ఆవేదనతో చేసిన వ్యాఖ్య ఇది. ఇప్పటికి ఐదు మహా ఉత్పాతాలను చూసిన భూమి ఆరో ఉత్పాతాన్ని చూడబోతున్నదని, దీనికి ప్రధాన కారణం మనిషేనని హవాయి యూనివర్సిటీకి చెందిన రాబర్ట్ కోవీ తదితర శాస్త్రవేత్తల బృందం ఇటీవల తమ పరిశోధన పత్రాన్ని విడుదల చేసింది. దీనిపై ఇప్పుడు శాస్త్రవేత్తలలోనే కాకుండా సాధారణ వ్యక్తుల్లోనూ చర్చ జరుగుతున్నది. ‘ఇంతకాలమూ పర్యావరణ శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ పరిశోధన సంస్థలు జీవవైవిధ్యం విషయంలో తీవ్రమైన పక్షపాత దృష్టితో వ్యవహరిస్తున్నారు’ అని కోవీ బృందం తమ పరిశోధన పత్రంలో పేర్కొనడం గమనార్హం.
పక్షులు, క్షీరదాలు వంటి వెన్నెముక జీవులను మాత్రమే లెక్కగట్టి, వెన్నెముక లేని అకశేరుకాలను పర్యావరణ శాస్త్రవేత్తలు పట్టించుకోవటం లేదని, ఫలితంగా భూమ్మీద కొడిగడుతున్న జీవవైవిధ్యానికి సంబంధించి వాస్తవాలు వెల్లడి కావటం లేదని కోవీ బృందం కుండబద్దలు కొట్టింది. వందలాది దేశాలకు, వేలాదిమంది శాస్త్రవేత్తలకు ప్రాతినిధ్యం వహించే ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్’ ఎప్పటికప్పుడు ప్రకటించే ‘అంతరిస్తున్న జాతుల రెడ్‌లిస్ట్’లో కూడా ఇదే ‘పక్షపాత ధోరణి’ ఉంది. కానీ జంతుజాలంలో దాదాపు 97 శాతం అకశేరుకాలే. వీటిని పక్కనపెట్టి జీవవైవిధ్యం గురించి మాట్లాడటం నేలవిడిచి సాము చేయటమే. అకశేరుక జీవజాతులు అంతరిస్తున్న వేగాన్ని బట్టి చూస్తే భూమి ఆరో ఉత్పాతానికి దగ్గరవుతున్నదని తాజా అధ్యయనం హెచ్చరించింది. పరిశోధనల్లో హ్రస్వదృష్టిని వదిలిపెట్టడం, జీవవైవిధ్య పరిరక్షణకు తక్షణం నడుంకట్టడమే పరిష్కారమన్న హితవును ప్రపంచ దేశాలు పట్టించుకోవాలి.
జీవవైవిధ్య పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవ, తీసుకుంటున్న చర్యలు గొప్పవి. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన రంగాల్లో పర్యావరణం ఒకటి. 2015లో ‘జంగల్ బడావో.. జంగల్ బచావో’ నినాదంతో తెలంగాణలో హరితహారం కార్యక్రమాన్ని ఆయన స్వయంగా ప్రారంభించారు. చరిత్రలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నంగా హరితహారం పేరొందింది. ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 230 కోట్లకుపైగా మొక్కలు నాటారు. ఫలితంగా ఏడేండ్లలో అటవీ విస్తీర్ణం దాదాపు 7,200 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా-2021 నివేదిక ప్రకారం అడవి పెరుగుదలలో దేశంలోనే తెలంగాణ రెండోస్థానంలో నిలువగా, పచ్చదనం పెరుగుదలలో హైదరాబాద్ నెంబర్‌వన్ మెగా సిటీగా నిలిచింది. అడవులు పెరగటంతో వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. మొత్తంగా, జీవవైవిధ్య పరిరక్షణలో అతిపిన్న రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలువటం హర్షణీయం.