తట్టెడు మట్టి దియ్యలే. జిట్టెడు గోడ వెట్టలే. కానీ, అప్పు మాత్రం గుట్టలు గుట్టలుగా పోగుపడింది. వాటి కింద అన్ని రికార్డులూ ఫెళఫెళా బద్దలయ్యాయి. అప్పులు వద్దన్న ఒప్పుల కుప్పలు గత 15 మాసాల్లో చేసిన అప్పు అక్షరాలా రూ.లక్షన్నర కోట్లు. అంటే నెలకు రూ.10 వేల కోట్లు అన్నమాట. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులున్నాయి అన్నట్టు అప్పు చెయ్యడమే తప్పని ఇల్లెక్కి కూసినోళ్లు అప్పుల కుప్పలుగా తయారయ్యారు. పాత సర్కారు చేసిన అప్పుల మీద రోతమాటలు మాట్లాడినోళ్లు చేసిన అప్పుల లెక్క చూస్తే గుండె గుబేలనిపించక మానదు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాలా రూ.1.52 లక్షల కోట్లు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని సర్కార్లు కలిసి చేసిన మొత్తం అప్పు రూ.72,658 కోట్లే. అది 60 ఏండ్ల అప్పు. ఆ సంగతి కాంగ్రెస్ శ్వేతపత్రంలోనే రాసుకున్నది. మరి ఏడాది మూడు మాసాల్లో అంతకుమించిన అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వం వెల్లడించిన లెక్కలు, ఆర్బీఐ గణాంకాలు, కాగ్ నివేదికల ప్రకారం 2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్ వరకు రాష్ట్రం తీసుకున్న అప్పు రూ.1,24,209 కోట్లు. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు మరో రూ.28,709 కోట్లు ప్రభుత్వం అప్పుచేసింది. ఇందులో ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి చేసిన అప్పులు కూడా ఉండటం గమనార్హం. అంటే కేంద్రం లేదా ఆర్బీఐ అనుమతించిన పరిధిని మించి అప్పు చేశారు. ఇలా ఎఫ్ఆర్బీఎం పరిధి కంటే ఎక్కువ అప్పును కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ తీసుకురాలేదు. ఎక్కడెక్కడో, ఏవేవో జామీనులిచ్చి తెచ్చిన అంతలావు సొమ్ము ఏం చేశారు? ఏ బొందలో పోశారు?
ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వలేదు. కనీసం డీఏ కూడా ఇవ్వలేదు. ఒక్క కొత్త ఉద్యోగమూ ఇవ్వలేదు. మరి ఏమయ్యాయి అప్పు తెచ్చిన లక్షన్నర కోట్లు? రైతుబంధు ఎగ్గొట్టారు. రైతులందరికీ రుణమాఫీ అనే హామీ అపహాస్యం పాలైంది. మహిళలకు, వృద్ధులకు పింఛన్లు పెంచలేదు. ఆడబిడ్డలకు తులం బంగారం పంచలేదు. కనీసం పుట్టిన పాపకు కేసీఆర్ కిట్ ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి అతీగతీ లేదు. దళితబంధు జాడే లేదు. ప్రాజెక్టు కట్టడం మాట దేవుడెరుగు, ఉన్న ప్రాజెక్టులనూ పడావు పెడుతున్నారు. కనీసం కొత్తగా కిలోమీటరు రోడ్డు వెయ్యలేదు. అప్పు చేయడం తప్పు అనేది పాత మాట. చాన్నాళ్లుగా డబ్బు పొదుపు చేసుకొని ఆ తర్వాత ఎప్పుడో ఖర్చు చేయడం పాత పద్ధతి. కానీ, ఇప్పుడు అలా కాదు. అప్పు తప్పనిసరి అనేదే నేటి నీతి. స్థిర, చరాస్థులు, నగా నట్రా, ఫర్నిచర్ కొనాలన్నా, చివరికి చదువుకూ అప్పు లేందే అడుగు పడని పరిస్థితి. ఇదంతా వ్యక్తిగతం అనుకుందాం. మరి ప్రభుత్వాలు ఎందుకు అప్పులు చేస్తాయి? ఆదాయాన్ని పెంచే ఆస్తుల కల్పనకు అప్పులను ఉపయోగించుకుంటాయి.
కేసీఆర్ ప్రభుత్వం కూడా పరిమితులకు లోబడి అప్పులు తెచ్చింది. ఆ సొమ్మును సం పదను పెంచేందుకు కేసీఆర్ వినియోగించడం వల్లే రాష్ట్రం అభివృద్ధిలో అంగలు వేసిందనేది ప్రత్యక్షర సత్యం. మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా నీళ్లు అందించారు. మిషన్ కాకతీయతో వేల చెరువుల పూడిక తీశారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో కోటి రతనాల వీణ కోటి ఎకరాల మాగాణంగా రూపు సవరించుకున్నది. రాష్ట్రం పచ్చగా కళకళలాడింది. ప్రజల బతుకులు మారాయి. మరి మూటల కొద్దీ పైసలు తెచ్చి కాంగ్రెస్ ఏం కట్టిందీ అంటే సమాధానం సున్నా. అభివృద్ధి ఆగమైంది. సంక్షేమం సడుగులు ఇరిగినై. అప్పులు మాత్రం తుప్పల్లా పెరిగినై. ఏమయ్యాయి అప్పు చేసి తెచ్చిన నిధులు అని ప్రజలు అడుగుతున్నారు. ఎవరి జేబుల్లోకి వెళ్లాయని నిలదీస్తున్నరు. ఇంత అప్పు తెచ్చిన తర్వాత కూడా పెట్టుబడి వ్యయాలకు నిధులు లేవని సీఎం రేవంత్ రెడ్డి చావు కబురు చల్లగా చెప్తున్నారు. తాజాగా సర్కారు మరో రూ.3,000 కోట్ల మార్కెట్ రుణాలు తీసుకోవడం గమనిస్తే… ఈ పరిస్థితి ఎటు దారితీస్తుందో అనే భయాందోళనలు కలుగకమానవు. ఆర్థిక నిర్వహణలో ప్రభుత్వ ఘోర వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?