అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బహుజన వధూవరులను ఆశీర్వదిస్తూ 2014 అక్టోబర్‌లో కల్యాణలక్ష్మి పథకం తెచ్చిండు. అప్పటి నుంచి 2023 సెప్టెంబర్ నాటికి 6.35 లక్షల బీసీ కొత్త జంటలు ఈ పథకం కింద కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నయి. కేసీఆర్ దిగిపోయాక వచ్చిన ఇంకో 1.65 లక్షల కొత్త జంటల దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ దరఖాస్తుల వాళ్లు కొత్తగా పెళ్లయిన వారు కాబట్టి ఇంకా వీరికి సంతానం కలగలేదనే అనుకుందాం. పాత వారిలో కూడా వెయ్యి జంటలకు పిల్లలు పుట్టలేదు అనుకుందాం. వీళ్లు పోగా మిగతా 6.34 లక్షల జంటలకు ఇద్దరి చొప్పున లెక్కేసినా 12.68 లక్షల మంది బీసీ బిడ్డలు పుట్టాలి కదా! కానీ ఈ పదేండ్ల కాలంలో కేవలం 11.44 లక్షల మంది మాత్రమే బీసీ జనాభా పెరిగినట్టు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం లెక్కలు కట్టింది.
మేం ఎంత మందిమి ఉన్నామో.. రాజ్యాధికారంలో మాకంత వాటా ఉండాలనేది బీసీల చిరకాల స్వప్నం. మండల్ కమిషన్ నుంచి ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్లపై ఎప్పుడూ ఏదో రచ్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా చట్టసభల్లో అంటే అసెంబ్లీ, పార్లమెంటులో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఉంది. బీసీలకు లేదు. బీసీల ఆకాంక్షను పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచుతామని 2023 కామారెడ్డి డిక్లరేషన్‌లో హామీ ఇచ్చింది. 2024 నవంబర్ మాసంలో హడావుడిగా కులగణన చేసినట్టు కలరింగ్ ఇచ్చింది. ఎట్టకేలకు కట్టుకథలతో అల్లిన కాకి లెక్కలను అసెంబ్లీలో పెట్టింది. రాష్ట్రంలో బీసీల జనాభా 46.25 శాతం మాత్రమేనని, ముస్లిం బీసీలు 10. 08 శాతం ఉన్నట్టు చెప్పింది. హిందూముస్లిం బీసీలను కలుపుకొంటే మొత్తం బీసీ జనాభా 56.33 శాతం మించడం లేదని క్యాబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.
దేశ జనాభాలో బీసీలు 52 శాతం ఉన్నారని 1980లో మండల్ కమిషన్ తేల్చి చెప్పింది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ర్టాల్లో బీసీ జనాభా ఎక్కువగా ఉన్నదని అదే కమిషన్ నిర్ధారించింది. ఈ మౌలిక సూత్రాన్ని బేస్ చేసుకొనే తెలంగాణలో బీసీ కుల సంఘాలు తమది 60 శాతం జనాభా అని వాదిస్తూ వస్తున్నాయి. ఇది ఉజ్జాయింపే అయినా వాస్తవ లెక్క కూడా ఒకటి, అర శాతం అటూ ఇటుగా ఇదే.
గొప్ప విభాజక సంవత్సరం 1921 నుంచి భారత దేశ జనాభా స్థిరంగా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాలంతో పాటుగా తెలంగాణ బీసీ జనాభా కూడా పెరుగుతుంది. గొప్ప విభాజక సంవత్సరం ప్రకటనను అనుసరించి పెరగాలి కూడా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రోకు తప్పిన లెక్క చెప్తున్నది. బీసీ జనాభా 46.25 శాతమే ఉందట.1980లోనే 52 శాతం బీసీలు ఉన్నారని మండల్ కమిషన్ నిగ్గు తేల్చిన నాటి నుంచి దేశ జనాభా పెరుగుతూ పోతుంటే తెలంగాణలో మాత్రం బీసీ జనాభా ఎండుకపోయిందా? అనేది రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పాల్సిన ప్రశ్న.
తెలంగాణలో బీసీ జనాభా పెరుగుదలకు కల్యాణలక్ష్మి పథకమే ఓ కొలమానం. 2018 మార్చి నాటికి 2.1 లక్షల జంటలు దరఖాస్తు చేసుకున్నాయి. 2021 సెప్టెంబర్ నాటికి 4.13 లక్షల జంటలు, 2022 నవంబర్ నాటికి 5.23 లక్షల జంటలు, 2023 సెప్టెంబర్ నాటికి 6.35 లక్షల స్త్రీ పురుష జంటలు పెండ్లి చేసుకున్నాయి. 2023 అక్టోబర్ నుంచి 2024 సెప్టెంబర్ నాటికి 1.65 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ దిగిపోయేనాటికి కల్యాణలక్ష్మి కింద 11.79 లక్షల మంది బీసీ,ఎస్సీ, ఎస్టీ వధూవరులు.. షాదీముబారక్ కింద 2.14 లక్షల ముస్లిం జంటలు దరఖాస్తు చేసుకున్నాయి. మొత్తం 13.93 లక్షల దరఖాస్తుల్లో బీసీలు7 లక్షల మంది. ఈ లెక్కన చూసుకున్నా బీసీల వాటా 50.1 శాతానికి మించే ఉంది. ఉద్యోగులు, ఆర్థిక స్థిరత్వం, ఇన్కమ్ టాక్స్ కట్టే బీసీలు ఇందులోకి రాలేదు. వాళ్లను కూడా కలుపుకొంటే ఇంకో 6.5 లక్షల జంటలు అదనం. తొమ్మిదేండ్ల కాలంలో 14.45 లక్షల బీసీలు పెండ్లి చేసుకున్నారు. వీళ్లకు ఇద్దరేసి పిల్లల చొప్పున లెక్కలు కడితే 28.90 లక్షల మంది కొత్త బీసీ జనాభా వచ్చినట్టే. కానీ, విచిత్రంగా ఈ పదేండ్ల కాలంలో 21.52 లక్షల మంది బీసీలు చనిపోయినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే నివేదించిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఒకరు ఆందోళన చెందటం గమనార్హం.
వాస్తవ లెక్కలను విస్మరించి, అంచనాలకు, ఊహకు కూడా అందనంతగా బీసీ జనాభా 46.25 శాతానికి తగ్గిందనే లెక్కలు ప్రజల ముందు పెట్టడంలో అంతర్యం ఏమిటి? బీసీ రిజర్వేషన్ల ప్రస్థావన వచ్చిన ప్రతిసారి ఓసీల రిజర్వేషన్ల గురించి కూడా చర్చ వస్తున్నది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? శాస్త్రీయంగా ఏదైనా కమిషన్ నివేదిక ఉన్నదా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
2014లో కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణ ఓసీల జనాభా కేవలం 9.77 శాతం ఉన్నట్టు తేలింది. రేవంత్‌రెడ్డి కుల గణనలో మాత్రం వారు 13.31 శాతానికి పెరిగినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలు తీసింది. ఓసీల జనాభా 10 శాతానికి మించే ఉన్నదని చెప్పే ప్రయత్నంలో బీసీ జనాభా శాతాన్ని కుదించినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభాను తగ్గించి రిజర్వేషన్లను కుదించేందుకు కాంగ్రెస్ నేతలు ఎత్తులు వేస్తున్నారు. ఈ సర్వేను ముందుగా కాంగ్రెస్ పార్టీలోని బీసీ ప్రజా ప్రతినిధులు వ్యతిరేకించాలి. తప్పుడు నివేదికలు రూపొందించిన ప్లానింగ్ అధికారులను నిలదీయాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ అంకెల గారడీకి కాంగ్రెస్ బీసీ నేతలు వత్తాసు పలకటం విచారకరం.
సీఎంగా కేసీఆర్ దిగిపోయేనాటికి కల్యాణలక్ష్మి కింద 11.79 లక్షల మంది బీసీ,ఎస్సీ, ఎస్టీ వధూవరులు.. షాదీముబారక్ కింద 2.14 లక్షల ముస్లిం జంటలు దరఖాస్తు చేసుకున్నాయి. మొత్తం 13.93 లక్షల దరఖాస్తుల్లో బీసీలు7 లక్షల మంది. ఈ లెక్కన చూసుకున్నా బీసీల వాటా 50.1 శాతానికి మించే ఉంది. ఉద్యోగులు, ఆర్థిక స్థిరత్వం, ఇన్కమ్ టాక్స్ కట్టే బీసీలు ఇందులోకి రాలేదు. వాళ్లను కూడా కలుపుకొంటే ఇంకో 6.5 లక్షల జంటలు అదనం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీసీ సంక్షేమశాఖ 2020లో అప్డేట్ చేసిన వివరాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం 112 వెనుకబడిన కులాలు ఉన్నాయి. గ్రూప్-ఏలో 43, గ్రూప్-బీలో 23, గ్రూప్-సీలో ఒకటి, గ్రూప్-డీలో 31, గ్రూప్-ఈలో 14 కులాలు ఉన్నాయి. అన్ని బీసీ కులాలకు కలిపి 29 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులాల వారీగా సామాజిక, ఆర్థిక అంశాల వివరాలు సేకరించి ఉంటే నిజంగా బీసీల జనాభా ఎంత ఉందో, వారి జీవన ప్రమాణాలు ఎలాఉన్నాయో బయటపడేది. ఇవేమీ లేకుండా కులగణన చేశామని హడావుడి చేయడం, 42 శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపడం ఒక బూటకం. ఇదేదో చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అన్నట్టుగా సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.
38 ఏండ్ల కిందనే 1986లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్టీఆర్ బీసీ రిజర్వేషన్ల మీద మురళీధర్‌రావు కమిషన్‌ను వేశారు. ఆయన సిఫార్సు ప్రకారం ఎన్టీఆర్ బీసీ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 44 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. కానీ పెంచిన రిజర్వేషన్లను కోర్టు కొట్టేసింది. పార్లమెంటు ఆమోదం లభించలేదు.
2010లో కృష్ణమూర్తి వర్సెస్ కర్ణాటక ప్రభుత్వం కేసులో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టినప్పుడు, జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన అమలు చేస్తారని, ఆ రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు కొట్టేసింది. జనాభా లెక్కలు శాస్త్రీయంగా ఉంటే ఆ మేరకు పెంచవచ్చని తీర్పు చెప్పింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసిన లెక్కలకు సమగ్రత, శాస్త్రీయత లేదని బీసీ సంఘాలే ఆరోపణలు చేస్తున్నాయి.
జాజుల శ్రీనివాస్‌గౌడ్, జూలూరి గౌరీశంకర్, జస్టిస్ ఈశ్వరయ్య లాంటి బీసీ సంఘం నేతలు ఈ నివేదిక ప్రతులను చించి అవతల పారేశారు. ఇటువంటి కుల గణన సర్వే కోర్టుల శాస్త్రీయ నిర్ధారణ పరీక్షల ముందు నిలబడగలుగుతుందా? కేవలం బీసీ కులాలకు నమ్మించడం కోసమే తప్ప.. బహుజనులను బతికించే కులగణన కాదని అర్థం అవుతున్నది.