ముసలెడ్ల మెడపై కాడిమోపి
మొద్దుబారిన కర్రు మొనను
కొలిమిలో మండించి డాకలిమీద సరిచేసి
సాలుకు ఇరువాలు దుక్కిదున్ని
మొలకబోస్తే ముత్యమంత
సంతోషం రైతు ముఖం మీద.
ఆ ముత్యమంత సంతోషం కోసం
రైతుపడే వేదన ఏ కావ్యంలో ఇమడదు
కాలం కలిసొస్తే కాసుల గలగల
కాటేస్తే కన్నీటి వలపోత.
పశువులనమ్మి పుస్తెలమ్మి
తననుతాను అమ్ముకొని
తనతో పాటు చుట్టూ జీవరాశుల
కడుపునింపే రైతన్నపై
కన్నెర్రజేస్తే కటిక హృదయుడే.
నాల్గు నెల్ల పంటకాలం
బిడ్డను కాపాడిన ఇకమతి
కల్లంల వడ్లరాశి మీద వానకురిస్తే
దూలం విరిగి ఇల్లు కూలిన ఎత రైతుది.
ఎండకు ఆరబోస్తారు
గాలి వస్తే మేఘం వైపు చూస్తారు
చినుకులొస్తే పరదాలు కప్పుతారు
ఇంటికొస్తరు హాయి పొందరు
కునుకుదీస్తరు నిద్రపట్టదు
ఎక్కడికిపోయినా రైతన్న మనస్సు
ధాన్యపు కుప్ప చుట్టూ
భూమి తిరిగినట్లు తిరుగుతుంటది
కలుపుదీసినా మందుచల్లి
కోతకోసి కుప్పనూకి కల్లంల రాలిన గింజగింజను
మునివేళ్లతో ముద్దాడి
ధాన్యం సర్కారుకు అమ్మబోతే
వానొచ్చి అంతా కొట్టుకపాయె.
ఓ నేతల్లారా రైతుమీద రాజకీయం చేయకుర్రి
గింజ గింజ వెనుక రాయలేని కథలెన్నో ఉంటయి
రైతు రైతు వెనుక మోయలేని
ఎతలెన్నో దాగుంటయి