సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం, పోలీసుల పనితీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యాలకు అద్దం పడుతున్నాయి. అల్లు అర్జున్ వివాదం తర్వాత తెలుగు సినిమా రంగం హేమాహేమీలంతా వెళ్లి ముఖ్యమంత్రిని కలవడంతో పెను తుఫాన్ కాస్త టీ కప్పులో తుఫాన్‌లా ముగిసిపోయింది. అప్పటివరకు సీఎం రేవంత్‌ను గుర్తించని సినీ పెద్దలు మూకుమ్మడిగా వెళ్లి ఆయనకు బొకేలు ఇచ్చి, శాలువాలతో సత్కరించారు.
దీంతో ఈ వ్యవహారంలో విజయం ఎవరిదనే చర్చ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది. సినిమా వాళ్లను బెదిరించి సీఎం తన వద్దకు రప్పించుకున్నారు కాబట్టి, ఆయనదే విజయం అని ఒక వాదన. ఒక్కరు చేసిన తప్పునకు సినిమా వారంతా సీఎం వద్దకు వెళ్లి తల దించుకోవలసి వచ్చిందని తమ్మారెడ్డి భరద్వాజ విమర్శించారు. అంటే ఆయన మాట ప్రకారం చూసినా సినిమా వారి మీద సీఎందే విజయం అన్న విషయం స్పష్టమవుతున్నది.
విజయం సీఎందా? సినిమా వారిదా? అని చర్చ నడుస్తున్నదంటేనే ప్రభుత్వ పాలన తీరును తెలుపున్నది. అసలు ప్రభుత్వానికి, సినిమా వారికి పోలిక ఏమిటి? రెండు భాషల సినిమా రంగాల మధ్య పోలిక చూస్తారు. రెండు రాష్ర్టాల మధ్య పోటీ ఉంటుంది. లేదా గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మధ్య పోలిక ఉంటుంది. కానీ, ప్రభుత్వం, సినిమా రంగం మధ్య పోటీలో విజయం ఎవరిదనే చర్చ ఏమిటో? అసలు అర్థం కాని విషయం.
రాష్ట్రంలో ఉండే అనేక రంగాల్లో సినీ రంగం ఒకటి. అత్యంత శక్తివంతమైన ప్రభుత్వాన్ని, కాలక్షేపానికి సంబంధించిన ఒక రంగంతో పోటీలో ఎవరు విజేత అని సమాన స్థాయిలో చూడటమే తప్పు అనుకుంటే, సినిమా వారిపై సీఎందే పైచేయి అని మురిసిపోవడం మరొక వింత. ప్రభుత్వంపై సినిమా వాళ్లు పోరాడుతారనే ఆలోచనే తప్పు. దేశాన్ని నడిపించే బడా పారిశ్రామికవేత్తలు సైతం ప్రభుత్వంతో పోరాడలేరు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు తప్ప ప్రభుత్వంతో పోరాడరు. దిల్ రాజు నాయకత్వంలో సినిమా పెద్దలంతా సీఎంను కలిసేంత వరకు అల్లు అర్జున్-సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారాన్ని ప్రభుత్వం మరే సమస్య లేనట్టుగా చిత్రీకరించింది. ఒక పోలీసు కేసుగా చూడకుండా ఆ వ్యవహారాన్ని సీఎం వ్యక్తిగతంగా తీసుకున్నారు. హాస్టళ్లలో ఆహారం వికటించి విద్యార్థులు మరణించినా, సీఎం పర్యటనలో ఆయన కటౌట్లతో విద్యుత్తు షాక్‌తో ఇద్దరు వ్యక్తులు మరణించినా స్పందించని సీఎం అల్లు అర్జున్ వ్యవహారంలో ‘మానవత్వంతో స్పందించినట్టు’ పేర్కొన్నారు. విద్యార్థులు, కటౌట్‌తో కార్యకర్తలు మరణించినప్పుడు మానవత్వం ఏమైంది అనే ప్రశ్నలు సహజం.
సినీ బృందం ముఖ్యమంత్రిని కలిసేదాకా పోలీసు ఉన్నతాధికారులు, కాంగ్రెస్ నాయకులు అల్లు అర్జున్ తీరుపై ధ్వజమెత్తారు. ఆషామాషీ కేసు కాదు, దేశ బహిష్కరణో, ఉరి శిక్షో తప్పదు అన్నంత హడావుడి చేశారు. ఎప్పుడూ హుందాగా మాట్లాడే పోలీసు అధికారి సీవీ ఆనంద్ సైతం ఈ వ్యవహారంలో సహనం కోల్పోయి జాతీయ మీడియాను దూషించారు. తర్వాత ఆయనే క్షమాపణలు చెప్పారు. అంటే ఈ కేసుపై పోలీసుల పైనా తీవ్రమైన ఒత్తిడి పనిచేసింది అనిపిస్తున్నది.
ప్రతి రోజు, ప్రతి పోలీస్ స్టేషన్లో ఎన్నో కేసులు నమోదవుతుంటాయి. కానీ, అల్లు కేసులో మాత్రం శాసనసభలో గంటల తరబడి చర్చ, పోలీసు అధికారుల ప్రెస్ కాన్ఫరెన్స్‌లతో రాష్ట్రంలో ఇదొక్కటే ప్రధాన సమస్య అన్నట్టు చేశారు. సినీ పెద్దలు సీఎంను కలువగానే అంతా గప్‌చుప్. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు సినిమా వాళ్లు వెళ్లి సీఎంకు బొకే ఇవ్వడం ఆనవాయితీ. కానీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సినీ పెద్దలు ఎవరూ వెళ్లి రేవంత్‌కు బొకేలు అందించలేదు. ఇదిలా ఉంటే… ‘నేను సీఎం అయ్యాక జగన్ (అప్పుడు సీఎం) ఫోన్ చేసి అభినందించలేదు’ అని రేవంత్ బహిరంగంగానే మాట్లాడారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. దీనిపై కూడా సినిమా పెద్దలు స్పందించలేదు. ‘గద్దర్ అవార్డులు ఇస్తామంటే సినిమా వాళ్లు ఎవరూ స్పందించలేదు’ అని సీఎం రేవంత్ ఏకంగా మీడియా సమావేశంలో విమర్శించారు. ఆ తర్వాత వెంటనే చిరంజీవి స్పందించి గద్దర్ అవార్డును స్వాగతించారు. కానీ, పెద్దగా ముందడుగు అయితే పడలేదు. ఇలాంటి పరిణామాల మధ్య పాలకులకు ‘అల్లు అర్జున్-పుష్ప’ కేసు చేతికి చిక్కింది. దానితో సీఎం రేవంత్ సినిమా వాళ్లకు చుక్కలు చూపించాలనుకున్నారు. అంతే తప్ప కేసును కేసుగా చూసినట్టు కనిపించలేదు.